Wednesday, 25 Nov, 7.41 am నమస్తే తెలంగాణ

తాజావార్తలు
విశ్వనగరంపై విషం

  • విద్వేషాలు రెచ్చగొడుతున్న కమలం నేతలు
  • శాంతి భద్రతలను భగ్నం చేసే కుట్రలు
  • నాలుగు ఓట్ల కోసం వివాదాస్పద వ్యాఖ్యలు
  • హైదరాబాద్‌లో సర్జికల్‌ స్ట్రైక్‌ చేస్తామంటూ అక్కసు
  • మండిపడుతున్న మేధావులు, నగరప్రజలు

పచ్చటి నగరంపై కమలం నేతలు విషం చిమ్ముతున్నారు. కోట్లమందికి కన్నతల్లిలాంటి హైదరాబాద్‌పై అక్కసు వెళ్లగక్కుతున్నారు. అన్నదమ్ముల్లా బతుకుతున్న మనుషుల మధ్య అగ్గి రాజేసి.. చలిమంట కాచుకోవాలనుకుంటున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ పాలనలో ఆరేండ్ల నుంచి ప్రశాంతంగా ఉన్న నగరాన్ని చూసి కండ్లు మండి.. కడుపు చించుకుంటున్నారు. నాలుగు ఓట్ల కోసం నరం లేని నాలుకతో నోటికొచ్చినట్టు మాట్లాడి కోటి మంది శాంతిభద్రతలను ప్రమాదంలోకి నెడుతున్నారు. పాతబస్తీలో సర్జికల్‌ స్ట్రైక్‌ చేస్తామంటూ బీజేపీ నేత బండి సంజయ్‌ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు నగరంలో కలకలం రేపాయి. విద్వేషాలు రెచ్చగొట్టేలా ఉన్న ఆయన తీరుపై అన్ని వర్గాల ప్రజలు భగ్గుమన్నారు. శాంతి భద్రతలను భగ్నం చేసే కుట్రలు చేస్తున్నారని మేధావులు మండిపడుతున్నారు. తప్పుడు వ్యక్తులు, తప్పుడు శక్తులతో అప్రమత్తంగా వ్యవహరించాలని హెచ్చరిస్తున్నారు.

శాంతిని భగ్నం చేసే కుట్ర

హైదరాబాద్‌లో సర్జికల్‌ స్ట్రైక్‌ చేస్తామనడం అశ్చర్యంగా ఉంది. ఇతర దేశాల నుంచి మన దేశంలోకి వచ్చే వారిపై నిఘా పెట్టి, కట్టడి చేయాల్సింది కేంద్ర ప్రభుత్వమే. హైదరాబాద్‌లోకి శరణార్థులను కేంద్రమే అనుమతిస్తున్నది. ఇక్కడ రోహింగ్యాలు, బంగ్లాదేశీయులు, పాకిస్తానీలు అనధికారికంగా ఉన్నారంటే అది కేంద్ర ప్రభుత్వ వైఫల్యమే. ఆరేండ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఇన్నాళ్లు ఏం చేసింది. బల్దియా ఎన్నికల నేపథ్యంలో ప్రజలను రెచ్చగొట్టేందుకే ఆ పార్టీ వాళ్లు ఇలా మాట్లాడుతున్నట్టు అనిపిస్తున్నది. శాంతిభద్రతల సమస్యలను సృష్టించేందుకు ఇలాంటి అంశాలను తెరపైకి తెస్తుంటారు. ప్రజల భావోద్వేగాలతో ఆడుకోవాలని చూడడం కరెక్ట్‌ కాదు. - ఓ రిటైర్డ్‌ పోలీస్‌ అధికారి

అన్నదమ్ముల మధ్య చిచ్చుపెట్టే వ్యాఖ్యలు

పాతబస్తీ అభివృద్ధిని కోరుకుంటుంది. హైదరాబాద్‌లో ఎలాంటి సర్జికల్‌ స్ట్రైక్‌లు పనిచేయవు. ఎందుకంటే ఇక్కడ ఉగ్రవాదులుగానీ, చొరబాటుదారులుగానీ లేరు. బీజేపీ లేనిపోని వ్యాఖ్యలతో అన్నదమ్ముల్లా కలిసి ఉంటున్న హిందూ, ముస్లింల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తోంది. ఎన్ని కుట్రలు పన్నినావిడదీయలేరు. - సయ్యద్‌ అహ్మద్‌ రజ్వి మాజిద్‌

అవి అనాలోచిత వ్యాఖ్యలు

రాష్ట్ర ప్రభుత్వ కృషితో హైదరాబాద్‌ ప్రశాంతంగా ఉంది. మత విద్వేషాలను రెచ్చగొట్టి రాజకీయ లబ్ధిపొందాలనుకునే వారికి ప్రజలే బుద్ధి చెప్తారు. హైదరాబాద్‌లో సర్జికల్‌ స్ట్రైక్‌ చేస్తామనడం అనాలోచిత వ్యాఖ్య. ఇది మంచి పద్ధతి కాదు. - ఖైసర్‌

'బండి'.. ప్రజాస్వామ్య వ్యవస్థకే ప్రమాదం

హైదరాబాద్‌లో ప్రజల మధ్య చిచ్చుపెట్టి రాజకీయ పబ్బం గడపాలని బండి సంజయ్‌ భావిస్తున్నారు. పార్టీలో తన పట్ల వ్యతిరేకతను కప్పిపుచ్చుకునేందుకు చౌకబారు వ్యాఖ్యలు చేస్తున్నారు. బండి సంజయ్‌ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోని పక్షంలో కేసులు ఎదుర్కొనక తప్పదు. -కొంతం గోవర్ధన్‌ రెడ్డి, తెలంగాణ అడ్వకేట్‌ జేఏసీ చైర్మన్‌

రాజకీయాల కోసం చిచ్చు పెట్టొద్దు

హైదరాబాద్‌ ఆరేండ్లుగా ఎంతో ప్రశాంతంగా ఉన్నది. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న వారు హైదరాబాద్‌లో సర్జికల్‌ స్ట్రైక్‌ చేస్తామనడం వారి అవివేకానికి నిదర్శనం. ఓట్లు కావాలి.. గెలవాలి అనుకుంటే అభివృద్ధి ఏం చేస్తారో చెప్పాలి. ఎన్నికల ప్రచారమంటే హుందాగా ఉండాలి. - టి.కృష్ణమోహన్‌, ఐటీ ఉద్యోగి

చరిత్ర తెలుసుకుని మాట్లాడాలి

బండి సంజయ్‌ హైదరాబాద్‌ను వదిలిపెట్టి కరీంనగర్‌ గురించి ఆలోచించాలి. హైదరాబాద్‌ చరిత్ర తెలుసుకుని మాట్లాడాలి. అందరినీ కలుపుకునిపోయే, అందరికీ అన్నం పెట్టే సంస్కృ తి హైదరాబాద్‌ది. పదవి కోసం రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు. ఎన్నికల కోడ్‌ ముగిశాక బీజేపీ అగ్ర నేతలకు ఫిర్యాదు చేస్తాం. - ముజీబ్‌ హుస్సేనీ, టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు

ఇవి మూర్ఖత్వపు వ్యాఖ్యలు

సర్జికల్‌ స్ట్రైక్స్‌ చేస్తామనడం మూర్ఖత్వం. హైదరాబాద్‌ను పాకిస్తాన్‌లా చూడటం అత్యంత దుర్మార్గం. విడగొట్టి ఓట్లు దండుకునేందుకే ఈ ఎత్తుగడ. బీజేపీ వాళ్లు దేశభక్తి.. దైవభక్తి రెండింటికీ ముడిపెట్టి రాజకీయం చేస్తున్నారు. సమస్యలు పరిష్కరిస్తామని, అభివృద్ధి చేస్తామని ప్రచారం చేయాలేగాని ఇలా మాట్లాడొద్దు. - డా. సుధాకర్‌, సీపీఐ నాయకుడు

వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి

సర్జికల్‌ ైస్టెక్స్‌ అంటూ.. దాడులంటూ మాట్లాడటం సబబు కాదు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఏం చేస్తామో చెప్పి ఓట్లు అడగాలి. అంతేకాని ఇలా నోటికి ఏది వచ్చినట్లు అది మాట్లాడటం తగదు. ఉద్రేకానికిపోయి ఏదిపడితే అది మాట్లాడి రెచ్చగొచ్చకూడదు. ఇకనైనా బండి సంజయ్‌ తన వ్యవహారశైలి మార్చుకోవాలి.- నక్క యాదగిరి, ఈఎల్‌బీ సభ్యుడు

ఆలోచించి మాట్లాడాలి

సర్టికల్‌ స్ట్రైక్‌ అంటే మాటలా? భాగ్యనగరంలో లేనిపోని దుమారం రేపుతారా? దుర్మార్గంగా ఒకరిపై ఒకరు బురద జల్లుకోవటం సమంజసం కాదు. ఒక జాతీయపార్టీలో ఇట్లా మాట్లాడటం సమంజసం కాదు. ఇలాంటి మాటలు అనే ముందు ఒకసారి ఆలోచించాలి. - జుట్టుకొండ మహేందర్‌, సామాజిక కార్యకర్త, షేక్‌పేట దర్గా

ఓట్లు పెంచుకునే మార్గం ఇది కాదు.

ఓట్లు పెంచుకునేందుకే అలజడి రేపవద్దు. రాజకీయంగా స్టంట్స్‌ వేయొచ్చు. కానీ, శాంతి భద్రతలకు భంగం కలుగొద్దు. సరైన నాయకులు అనిపించుకోవాలంటే.. పాతబస్తీ అభివృద్ధిపై దృష్టి పెట్టండి. అంతే కానీ సర్జికల్‌ స్ట్రైక్‌.. అని జనాల్లో లేనిపోని భయానక వాతావరణాన్ని కల్పించొద్దు.- సోమశేఖర శర్మ, స్థానాచార్యులు, గణపతి ఆలయం, సికింద్రాబాద్‌

అప్పుడు కేంద్ర బలగాలు ఏం చేశాయి

బంగ్లాదేశ్‌ నుంచి అక్రమంగా వలస వచ్చిన రోహింగ్యాలను గుర్తించి వారిని ఆ దేశానికి పంపటం ప్రభుత్వం చేయాల్సిన పని. అంతే గాని, వ్యక్తులు, సంస్థలు చట్టాన్ని చేతిలోకి తీసుకుంటామనడం సరికాదు. దీనిని ప్రతి ఒక్కరూ వ్యతిరేకించాలి. అంతే కాని, సర్జికల్‌ స్ట్రైక్‌ చేస్తామనటం సమంజసం కాదు. - స్వప్న, గృహిణి, నాగోల్‌

నోటికొచ్చినట్లు మాట్లాడొద్దు..

బార్డర్‌లో మొత్తం కేంద్ర బలగాలే ఉంటాయి. చొరబాటుదారులు చొచ్చుకు వస్తున్నపుడు ఏం చేశారు? కేంద్ర ఇంటిలిజెన్స్‌ ఏం చేసింది. ఎల్వోసీ, పీఓకే వద్ద సర్జికల్‌ స్ట్రైక్‌ చేయాలి. హైదరాబాద్‌లో చేస్తామనటం సరి కాదు. నోటికొచ్చినట్టు మాట్లాడొద్దు. ఎవరి మీద సర్జికల్‌ స్ట్రైక్‌ చేస్తారు? పాతబస్తీని అభివృద్ధి చేస్తామని చెప్పండి.. ఓట్లు పడుతాయి. - చెన్నగాని రవి కుమార్‌, నిజాంపేట

ధైర్యశాలి సీఎం కేసీఆర్‌

రాష్ట్రంలో ప్రజలకు కావాల్సిన పథకాలను ఆలోచించి అమలు చేస్తున్న ధైర్యశాలి సీఎం కేసీఆర్‌. దేశంలో ఎక్కడాలేని పథకాలను తెలంగాణలో ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు అమలు చేస్తున్నారు. ప్రజలకు నీతిమంతమైన పాలనను అందిస్తున్న సీఎం కేసీఆర్‌ను ప్రజలు ఎన్నటికీ మరవరు. -శ్రీనివాస్‌, లాల్‌దర్వాజ


Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Namasthetelangaana
Top