Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Yoga | ఆరోగ్యకరమైన వృద్ధాప్యం కోసం యోగా.. ఈ ఏడాది యోగా దినోత్సవం ప్రత్యేకత ఇదే..

Yoga | ఆరోగ్యకరమైన వృద్ధాప్యం కోసం యోగా.. ఈ ఏడాది యోగా దినోత్సవం ప్రత్యేకత ఇదే..

Yoga | ప్రపంచవ్యాప్తంగా ప్రజల సగటు ఆయుష్షు పెరుగుతున్న నేపథ్యంలో ఆరోగ్యకరమైన వృద్ధాప్యం అనే అంశం మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. వృద్ధాప్యంలోనూ శారీరక, మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ నాణ్యమైన జీవితాన్ని గడపడం నేటి సమాజం ఎదుర్కొంటున్న ప్రధాన సవాళ్లలో ఒకటిగా మారింది.

ఈ నేపథ్యంలో 2026 అంతర్జాతీయ యోగా దినోత్సవం కోసం ఆరోగ్యకరమైన వృద్ధాప్యం కోసం యోగా అనే థీమ్‌ను ప్రకటించారు. వృద్ధాప్యాన్ని ఆరోగ్యంగా, చురుకుగా గడపడంలో యోగా పాత్రను ప్రపంచానికి చాటిచెప్పడమే ఈ అంశం ప్రధాన ఉద్దేశంగా పేర్కొంటున్నారు. ప్రపంచంలోని అనేక దేశాలు ప్రస్తుతం వృద్ధుల జనాభా పెరుగుదల, జీవనశైలి సంబంధిత వ్యాధులు వంటి సమస్యలను ఎదుర్కొంటున్నాయి. ఈ పరిస్థితుల్లో యోగా కేవలం ఒక వ్యాయామ విధానం మాత్రమే కాకుండా, ఆరోగ్య సంరక్షణలో కీలకమైన సాధనంగా గుర్తింపు పొందుతోంది.

వృద్ధుల ఆరోగ్యమే లక్ష్యంగా..

శారీరక చురుకుదనం, మానసిక ప్రశాంతత, సామాజిక అనుబంధాలను పెంపొందించడంలో యోగా సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల వృద్ధులు స్వతంత్రంగా, గౌరవప్రదంగా జీవించే అవకాశాలు మెరుగుపడతాయి. యోగా ఆరోగ్యకరమైన వృద్ధాప్యానికి ఉపయోగపడుతుందనే అంశంపై ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు కూడా వేగంగా పెరుగుతున్నాయి. గత దశాబ్దంలో యోగా, వృద్ధాప్య ఆరోగ్యం సంబంధిత అధ్యయనాల సంఖ్య గణనీయంగా పెరిగినట్లు సమాచారం. వయస్సు పెరిగే కొద్దీ ఎదురయ్యే శారీరక, మానసిక సమస్యలను తగ్గించడంలో యోగా సానుకూల ప్రభావం చూపుతుందనే అంశంపై శాస్త్రీయ వర్గాల్లో ఆసక్తి పెరుగుతోంది. ఆరోగ్యకరమైన వృద్ధాప్యం అంటే కేవలం ఎక్కువ కాలం జీవించడం మాత్రమే కాదు. మంచి ఆరోగ్యంతో, స్వయం సమర్థతతో, జీవన నాణ్యతను కాపాడుకుంటూ గడిపే సంవత్సరాలను పెంచడం కూడా అంతే ముఖ్యమని నిపుణులు పేర్కొంటున్నారు. ఈ దృక్పథానికి యోగా అనువైన సాధనంగా భావిస్తున్నారు.

విస్తరిస్తున్న వృద్ధుల ఆరోగ్య రంగం..

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సిల్వర్ ఎకానమీగా పిలవబడుతున్న వృద్ధుల కేంద్రిత ఆర్థిక వ్యవస్థ కూడా వేగంగా విస్తరిస్తోంది. ఆరోగ్య సేవలు, వెల్‌నెస్ కార్యక్రమాలు, సహాయక నివాసాలు, పునరావాస సేవలు, డిజిటల్ హెల్త్, వృద్ధుల సంరక్షణ వంటి రంగాల్లో భారీ వృద్ధి కనిపిస్తోంది. దేశంలో కూడా వృద్ధుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఏర్పడుతున్న ఈ ఆర్థిక వ్యవస్థ వేల కోట్ల రూపాయల విలువను కలిగి ఉండగా, రానున్న సంవత్సరాల్లో మరింత విస్తరించే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో యోగా కేవలం ప్రజారోగ్య కార్యక్రమంగా మాత్రమే కాకుండా, వృద్ధుల ఆరోగ్య రంగంలో కొత్త ఆవిష్కరణలు, ఆర్థిక వృద్ధికి దోహదపడే శక్తిగా కూడా గుర్తింపు పొందుతోంది. వృద్ధుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన యోగా విధానాలు ప్రస్తుతం ప్రోత్సహించబడుతున్నాయి. ఇవి శరీర కదలికలు, వంపులు, సమతుల్యత, శ్వాసకోశ ఆరోగ్యం, భావోద్వేగ సంక్షేమాన్ని మెరుగుపరచడంపై దృష్టి సారిస్తున్నాయి.

వృద్ధులకు చేరవవుతున్న యోగా..

ప్రతి సంవత్సరం జూన్ 21న మాత్రమే కాకుండా ఏడాది పొడవునా యోగాను ప్రజల జీవితాల్లో భాగం చేయాలనే లక్ష్యంతో పలు కార్యక్రమాలు కూడా కొనసాగుతున్నాయి. సాంకేతికత ఆధారంగా రూపొందించిన ప్రత్యేక వేదికల ద్వారా రోజువారీ యోగా సాధనను ప్రోత్సహిస్తున్నారు. అలాగే వృద్ధులు, సామాజికంగా వెనుకబడిన వర్గాలు, కదలికల పరిమితులు ఉన్నవారిని కూడా యోగా కార్యక్రమాల్లో భాగస్వాములను చేయడానికి ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. కుర్చీలో కూర్చుని చేయగలిగే యోగా, తక్కువ శారీరక ఒత్తిడి కలిగిన వ్యాయామాలు, కమ్యూనిటీ వెల్‌నెస్ కార్యక్రమాలు వంటి పద్ధతుల ద్వారా వృద్ధులకు యోగా చేరువవుతోంది. ఒంటరితనం, శారీరక బలహీనత వంటి సమస్యలను ఎదుర్కొంటున్న వృద్ధులకు ఇవి ఉపయోగకరంగా మారుతున్నాయి. 2026 అంతర్జాతీయ యోగా దినోత్సవం థీమ్ ప్రపంచానికి ఒక ముఖ్యమైన సందేశాన్ని అందిస్తోంది. పెరుగుతున్న వృద్ధ జనాభా నేపథ్యంలో యోగా వంటి సులభమైన, అందుబాటులో ఉండే, సమగ్ర ఆరోగ్య పద్ధతులు భవిష్యత్తు ఆరోగ్య సంరక్షణలో కీలక పాత్ర పోషిస్తాయని ఈ అంశం స్పష్టం చేస్తోంది. ఆరోగ్యకరమైన వృద్ధాప్యానికి యోగా ఒక ప్రభావవంతమైన మార్గంగా మరింత ప్రాధాన్యం పొందుతోంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Namasthetelangaana