Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
యూజీడీపై అలసత్వం?

యూజీడీపై అలసత్వం?

  • ఏళ్లు గడుస్తున్నా నగరంలో కొసెళ్లని అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజీ పనులు
  • పట్టింపులేనట్టు వ్యవహరిస్తున్న పాలకులు
  • పూర్తికి రూ.259 కోట్లు
  • నిధులు వచ్చినా ముందుకు సాగడంపై అనుమానాలు
  • కార్పొరేషన్‌, పబ్లిక్‌ హెల్త్‌ శాఖల మధ్య సమన్వయలోపం
  • ప్రణాళికాబద్ధంగా చేస్తే ప్రగతికి అవకాశం

కరీంనగర్‌ కార్పొరేషన్‌ పరిధిలో అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ (యూజీడీ) పనులపై అధికారులు అలసత్వం వీడడం లేదు. నగరంలోని రోడ్ల మధ్యలో పైపులు వేసి ఏళ్లు గడుస్తున్నా.. కనెక్షన్లు ఇచ్చి వాటిని వినియోగంలోకి తేవడం లేదు. ప్రస్తుతం ఈ పనులు పూర్తికి అమృత్‌-2, యూఐడీఎఫ్‌ కింద సుమారు రూ.259 కోట్ల నిధులు రావడంతో మళ్లీ ఆశలు చిగురిస్తుండగా.. పాలకవర్గం సమ్మతి తెలుపుతుందా.. లేదా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇదే సమయంలో కార్పొరేషన్‌, పబ్లిక్‌ హెల్త్‌ శాఖల మధ్య సన్వయలోపం ఉందనే విమర్శలు వస్తున్నాయి.

కరీంనగర్‌ కార్పొరేషన్‌, జూన్‌ 1 : కరీంనగర్‌లో రూ.76.50 కోట్ల వ్యయంతో 2008లో మొదలు పెట్టిన అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ పనలను ఇన్నాళ్లూ నిధులు లేవన్న సాకుతో పక్కన పెట్టిన విషయం తెలిసిందే. అయితే, ఇప్పుడు అమృత్‌ 2, యూఐడీఎఫ్‌ కింద సుమారు రూ.259 కోట్ల రాగా, పనులు ముందుకు సాగుతాయా..? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. 2008లో భూమిలో పైపులు వేయడం, మ్యాన్‌హోల్స్‌, గోపాల్‌ చెరువులో ఎస్‌టీపీ (సీవేజ్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌) నిర్మాణం వంటి పనులు చేశారు. అంతటితో ఆ పనులను పక్కన పెట్టారు. కరీంనగర్‌కు అర్బన్‌ ఛాలెంజ్‌ ఫండ్‌ (యూసీఎఫ్‌) కింద రూ.840 నిధులు వస్తుండగా, రోడ్లు, మౌలిక సదుపాయాలకు కేటాయిస్తున్నారు. ఇదే ఫండ్‌ కింద వరంగల్‌కు రూ.4 వేల కోట్లకు పైగా వచ్చే నిధులను పూర్తిగా యూజీడీ కోసం వెచ్చించనున్నారు. కానీ, కరీంనగర్‌లో మాత్రం ఉన్న దానిని కూడా వినియోగంలోకి తీసుకురావడం లేదు.

అతీగతి లేని అమృత్‌-2 పనులు
అమృత్‌-2 కింద నగరంలో రూ.79.57 కోట్లతో యూజీడీని వినియోగంలోకి తీసుకురావాలని ప్రభుత్వం టెండర్లు పిలిచి పనులు ప్రారంభించింది. వీటితో నగరంలో రెండేళ్ల క్రితం గతంలో వేసిన అండర్‌ గ్రౌండ్‌లోని మెయిన్‌ పైపులైన్‌ (ట్రంక్‌ లైన్‌)లు సరిగా ఉన్నాయో.. లేదో పరిశీలించారు. పలు ప్రాంతాల్లో మ్యాన్‌హోల్స్‌ నుంచి చెత్తను తొలగించడంతోపాటు క్లీనింగ్‌ పక్రియ చేపట్టారు. అంతటితో పనులు ఆగిపోయాయనే చెప్పాలి. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇంచు పని కూడా ముందుకు సాగలేదు. ఈ నిధులతో వంద కిలోమీటర్ల మేర పైపులైన్లను సరిచేయడం, 24 వేల ఇండ్లకు కనెక్షన్లు అందించాల్సి ఉంది. కాగా, ఇప్పటి వరకు ఒక్క ఇంటికి కూడా కనెక్షన్‌ అందించలేదు. రెండేళ్లుగా పనుల్లో ఎలాంటి పురోగతి లేకుండా పోయింది. ఇటీవల ప్రభుత్వ ఉన్నతాధికారులు ఈ పనులను సీరియస్‌గా తీసుకొని పూర్తి చేయాలని సూచించారు. అయితే, అటు పబ్లిక్‌హెల్త్‌, ఇటు నగరపాలక అధికారుల సమన్వయలోపం పనుల్లో ముందడుగు లేకుండా పోయింది.

యూఐడీఎఫ్‌ కింద రూ.180 కోట్లు
కరీంనగర్‌లో అర్బన్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్‌ డెవలప్‌మెంట్‌ ఫండ్‌ (యూఐడీఎఫ్‌) కింద అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ పనుల కోసం రూ.180 కోట్ల నిధులు మంజూరయ్యాయి. వీటితో నగరంలోని 20 వేల ఇండ్లకు ఇంటర్‌ కనెక్షన్‌ అందిచడంతోపాటు నగరానికి నలువైపులా సీవేజ్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌ (ఎస్‌టీపీ)లు నిర్మించాల్సి ఉంది. ఈ పనులు పూర్తిగా పబ్లిక్‌ హెల్త్‌ ఆధ్వర్యంలో జరగనున్నాయి. ఈ ఇంటర్‌ కనెక్షన్‌ సందర్భంగా ఎక్కడైనా రోడ్ల తవ్వకాలు చేస్తే వాటిని మరమ్మతు చేసేందుకు కూడా నిధులు కేటాయించారు. ఈ పనులకు సంబంధించి ఇప్పటికే టెండర్‌ పక్రియ పూర్తయినట్టు అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. అయితే, సంబంధిత కాంట్రాక్టర్‌కు అగ్రిమెంట్‌ చేసి పనులు చేపట్టాల్సి ఉందని తెలుస్తున్నది. అలాగే, ఈ నిధులతో చేపట్టే ఎస్‌టీపీలకు నగరపాలక సంస్థ స్థలం కేటాయించాల్సి ఉన్నది.

పాలకులు కనికరిస్తారా..?
నగరంలో చేపడుతున్న అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ పనుల విషయంలో అంటీముట్టనట్లుగానే వ్యవహరిస్తున్న కరీంనగర్‌ పాలకులు ఈసారి వచ్చిన నిధులతో చేపట్టే పనులకు ఏ మేరకు సహకారం అందిస్తారన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. నగరపాలక సంస్థ, పబ్లిక్‌ హెల్త్‌ సమన్వయం ఉంటే తప్ప పనులు వేగంగా సాగే పరిస్థితి లేదు. ఇప్పటికే అమృత్‌ కింద చేపడుతున్న పనుల్లో సమన్వయం లేకపోవడంతో ఎక్కడ పైపులైన్లు ఉన్నాయో? ఎక్కడ ఇన్‌స్పెక్షన్‌ చాంబర్లు (ఇంటికి పైపులైన్‌కు కనెక్షన్‌ ఇచ్చే చాంబర్లు) నిర్మించాల్సి ఉన్నదో? పబ్లిక్‌ హెల్త్‌ అధికారులకు తెలియకుండా పోయింది. నగరంతో గత ఐదేళ్లలో అనేక ప్రాంతాల్లో నూతనంగా సీసీ రోడ్లు నిర్మించారు. వాటిల్లో అత్యధిక శాతం రోడ్లలో ఇన్‌స్పెక్షన్‌ చాంబర్లు నిర్మించేందుకు వీలుగా ట్రంక్‌లైన్‌కు అనుసంధానం చేస్తూ పైపులైన్లు వేశారు. వీటిని గుర్తించే విషయంలో నగరపాలక, పబ్లిక్‌ హెల్త్‌ అధికారులు సమన్వయంతో పని చేయాల్సి ఉన్నది. ప్రణాళికాబద్ధంగా రోడ్ల వారీగా సమన్వయంతో పని చేయడంతోపాటు తవ్వే రోడ్లను మళ్లీ పక్బందీగా మరమ్మతు చేయించాల్సిన అవసరం ఉన్నది. గతంలో మాదిరి ఇష్టారాజ్యంగా రోడ్లను తవ్వితే మాత్రం మరోసారి నగరవాసులు అవస్థలు పడే పరిస్థితి వస్తుంది. ఈ పనుల విషయంలో పాలకవర్గం ఎలా ముందుకు సాగుతుందో చూడాలి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Namasthetelangaana