Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
యూరియాకు మరో యాప్‌

యూరియాకు మరో యాప్‌

  • అన్నదాతలపై కేంద్ర సర్కార్‌ పిడుగు
  • ఇప్పటి వరకు రాష్ట్రం తెచ్చిన యాప్‌
  • ఇప్పుడు కేంద్రం నుంచి ఎఫ్‌ఎఫ్‌ఎస్‌
  • అన్ని ఎరువులు అందులోనే బుకింగ్‌
  • 6 నుంచి రాష్ట్రవ్యాప్తంగా అమల్లోకి
  • రైతులను గోస పెడుతున్న ప్రభుత్వాలు
  • కొరతను కప్పిపుచ్చేందుకు ఎత్తులు

హైదరాబాద్‌, ఆగస్టు 1(నమస్తే తెలంగాణ): యూరియా యాప్‌తో రైతులు పడుతున్న ఇబ్బందులు చాలవన్నట్టుగా ఇప్పుడు మరో కొత్త యాప్‌ తీసుకొచ్చేందుకు రంగం సిద్ధమైంది. ఇకపై ఎరువుల విక్రయానికి వ్యవసాయ శాఖ కొత్త యాప్‌నే అమలు చేయనున్నది. యూరియాతోపాటు అన్నిరకాల ఎరువులను ఇకపై ఈ యాప్‌ ద్వారానే విక్రయించనున్నది. ఈ మేరకు కొత్తగా ఫ్రేమ్‌వర్క్‌ ఫర్‌ ఫెర్టిలైజర్‌ సేల్‌(ఎఫ్‌ఎఫ్‌ఎస్‌) అనే యాప్‌ను అందుబాటులోకి తీసుకురానున్నది. ఈ నెల 6 నుంచి అన్నిరకాల ఎరువులను ఈ యాప్‌ వేదికగానే విక్రయించనున్నట్టుగా తెలిసింది.

ఈ మేరకు యాప్‌ వినియోగంపై రెండు రోజుల క్రితం ఏఈవోలకు వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో శిక్షణ ఇచ్చింది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న యాప్‌తో వేగలేక ఇబ్బందులు పడుతున్న రైతులుపై ఇప్పుడు కేంద్రం మరో యాప్‌ను రైతులు నెత్తిపై రుద్దుతున్నది. ఎరువుల విక్రయానికి మరో కొత్త యాప్‌ను అమలు చేయాలని వ్యవసాయ శాఖను ఆదేశించినట్టుగా తెలిసింది. ఇకపై అన్నిరకాల ఎరువులను ఎఫ్‌ఎఫ్‌ఎస్‌ యాప్‌ ద్వారా మాత్రమే విక్రయించాలని ఆదేశించినట్టుగా తెలిసింది.

ఈ నేపథ్యంలో ఎఫ్‌ఎఫ్‌ఎస్‌ యాప్‌ను అమలు చేసేందుకు రాష్ట్ర వ్యవసాయ శాఖ చర్యలు చేపట్టింది. రైతులకు యూరియా పంపిణీ చేయలేక, కొరత తీర్చలేక ఇటు కేంద్రం, అటు రాష్ట్ర ప్రభుత్వాలు ఎత్తులు, జిత్తులు వేస్తున్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. యాప్‌ల పేరుతో రైతులను పక్కదారి పట్టించి కుట్రలు చేస్తున్నాయనే ఆరోపణలున్నాయి. షాపుల్లో లేని యూరియా.. యాప్‌లలో ఎలా వస్తుందంటూ రైతులు ప్రశ్నిస్తున్నప్పటికీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం వారి కుట్రలను ఆపడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. యాప్‌ పేరుతో ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం రైతులను తీవ్ర ఇబ్బందులు పెట్టగా, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం సైతం అదే దారిలో నడుస్తున్నది.

Urea

రాష్ట్ర యాప్‌తో రైతులకు చుక్కలు
యూరియా పంపిణీ చేయలేక చేతులెత్తెసిన రాష్ట్ర సర్కార్‌.. ఆ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు యాప్‌ పేరుతో కొత్త డ్రామాను రక్తి కట్టించింది. యూరియా పంపిణీకి యాప్‌ను తీసుకొచ్చింది. తద్వారా ఎరువుల దుకాణాల ముందు రైతుల క్యూలైన్లు, చెప్పుల క్యూలైన్లు లేకుండా చేసింది. కానీ యూరియా కొరత సమస్యను పరిష్కరించలేకపోయింది. సదరు యూరియా యాప్‌తో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నేటికి కూడా ఆ యాప్‌లో యూరియాను బుక్‌ చేసుకోలేక నానా తంటాలు పడుతున్నారు. అందుకే యూరియా యాప్‌ను రద్దు చేయాలంటూ రాష్ట్రవ్యాప్తంగా రైతులు డిమాండ్‌ చేస్తున్నారు. రోడ్డెక్కి ఆందోళనలు కూడా చేస్తున్నారు. అయినా రాష్ట్రప్రభుత్వం మొండిగా యూరియా యాప్‌నే కొనసాగిస్తుండటంపై రైతులు మండిపడుతున్నారు.

'ఎఫ్‌ఎఫ్‌ఎస్‌’తోనే ఎరువులన్నీ విక్రయం
ప్రస్తుతం యూరియా పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా యూరియా యాప్‌ను అమలు చేస్తున్నది. ఇందులో కేవలం ఒక్క యూరియాను మాత్రమే పంపిణీ చేస్తున్నది. మిగతా ఎరువులను యథావిధిగా ఎరువులు షాపుల్లో విక్రయిస్తున్నది. తాజాగా కొత్తగా అమలు చేయనున్న ఎఫ్‌ఎఫ్‌ఎస్‌ యాప్‌ ద్వారా యూరియాతోపాటు అన్ని ఎరువులను కూడా విక్రయించనున్నారు. దీంతో ఎరువుల విక్రయాలు దుకాణాల్లో ఉండబోదు. యాప్‌లో బుక్‌ చేసుకుంటేనే.. షాపుల్లో ఇస్తారు.

ఇదిలా ఉంటే యాప్‌ల వినియోగంపై ఏఈవోలకు స్పష్టత ఇవ్వలేదని తెలిసింది. రెండు యాప్‌లను వినియోగిస్తారా? లేక ప్రస్తుతమున్న యూరియా యాప్‌ను రద్దుచేసి ఎఫ్‌ఎఫ్‌ఎస్‌ యాప్‌ను ఒక్కదాన్నే అమలు చేస్తారా? అనేదానిపైనా స్పష్టత లేదని తెలిసింది. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన యాప్‌లో విడతల వారీగా యూరియా పంపిణీకి అవకాశం ఉన్నది. కానీ ఎఫ్‌ఎఫ్‌ఎస్‌ యాప్‌లో మాత్రం ఒకేసారి పంపిణీ చేసేందుకు అవకాశం ఉన్నది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం యూరియాను పాత పద్ధతిలో విక్రయిస్తుందా? లేక కొత్త పద్ధతిలోనా? అనేది తేలాల్సి ఉన్నది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Namasthetelangaana