Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Zhang Yiming | ఆసియా కుబేరుల జాబితాలో అదానీ వెనక్కి.. అగ్రస్థానంలో టిక్‌టాక్ ఫౌండర్‌

Zhang Yiming | ఆసియా కుబేరుల జాబితాలో అదానీ వెనక్కి.. అగ్రస్థానంలో టిక్‌టాక్ ఫౌండర్‌

Zhang Yiming : ఆసియా కుబేరుల (Asia Billionaires) జాబితాలో అగ్రస్థానం మారింది. భారత పారిశ్రామిక దిగ్గజం గౌతమ్ అదానీ (Gautham Adani) ని వెనక్కి నెట్టి, ప్రముఖ సోషల్ మీడియా యాప్ (Social Media App) 'టిక్‌టాక్ (Tik Talk)' మాతృసంస్థ 'బైట్‌డ్యాన్స్ (Bite dance)' వ్యవస్థాపకుడు జాంగ్ యిమింగ్ (Zhang Yiming) ఆసియాలోనే అత్యంత ధనవంతుడిగా అవతరించారు.

బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం.. ఆయన నికర సంపద ప్రస్తుతం 105 బిలియన్ డాలర్లను దాటింది.

గత కొన్నేళ్లుగా జాంగ్ సంపద అనూహ్యంగా పెరుగుతూ వస్తోంది. 2019 మార్చిలో కేవలం 13 బిలియన్ డాలర్లుగా ఉన్న ఆయన ఆస్తి విలువ, ఇప్పుడు ఏకంగా ఎనిమిది రెట్లకుపైగా వృద్ధి చెందడం గమనార్హం. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగంలో బైట్‌డ్యాన్స్ దూకుడుగా విస్తరించడమే ఈ వృద్ధికి ప్రధాన కారణంగా నిలుస్తోంది. డౌబావో చాట్‌బాట్, సీడ్యాన్స్ వీడియో జనరేషన్ టూల్ వంటి ఏఐ ఉత్పత్తుల విజయంతో కంపెనీ విలువ భారీగా పెరిగింది.

ఈ నెలలోనే బ్లాక్‌రాక్, ఫిడెలిటీ వంటి అంతర్జాతీయ ఇన్వెస్ట్‌మెంట్ సంస్థలు బైట్‌డ్యాన్స్ వాల్యుయేషన్‌ను సవరించడంతో జాంగ్ సంపద మరో 12 బిలియన్ డాలర్ల మేర పెరిగింది. మరోవైపు గౌతమ్ అదానీ సంపద ఈ ఏడాది జూన్‌లో దాదాపు 120 బిలియన్ డాలర్ల గరిష్ఠ స్థాయికి చేరినప్పటికీ ఇటీవలి కాలంలో కొంతమేర క్షీణించింది. ఎంఎస్‌సీఐ ఇండెక్స్‌లో స్టాక్ రీబ్యాలెన్సింగ్, పెరుగుతున్న ముడి చమురు ధరలు, బాండ్ యీల్డుల వంటి అంతర్జాతీయ మార్కెట్ ఒత్తిళ్లు ఆయన సంపద తగ్గడానికి కారణమయ్యాయి.

ఈ పరిణామం ఆసియాలో సంపద సృష్టి స్వరూపాన్ని మారుస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇంధనం, మౌలిక సదుపాయాల వంటి సంప్రదాయ రంగాలను టెక్నాలజీ, ఏఐ ఆధారిత కంపెనీలు అధిగమిస్తున్నాయనడానికి ఇది నిదర్శనమని వారు పేర్కొంటున్నారు. ఇప్పటికే చైనాలో అత్యంత సంపన్నుడిగా ఉన్న జాంగ్, ఇప్పుడు ఆసియా అగ్రస్థానానికి చేరడం ఈ మార్పును స్పష్టంచేస్తోంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Namasthetelangaana