- టీయుఎంహెచ్‌ఇయూ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
104 ఫిక్స్ డే హెల్త్ సర్వీసులను యధావిధిగా కొనసాగిస్తూ పని చేస్తున్న డ్రైవర్లు, ఫార్మసిస్టులు, ల్యాబ్ టెక్నీషియన్లు, డాటా ఎంట్రీ ఆపరేటర్లు, సెక్యూరిటీ గార్డులతో పాటు ఇతర సిబ్బందికి ఉద్యోగ భద్రత కల్పించాలని తెలంగాణ యునైటెడ్ మెడికల్, హెల్త్ ఎంప్లాయిస్ యూనియన్ (టీయుఎంహెచ్‌ఇయూ) డిమాండ్ చేసింది. ఆదివారం హైదరాబాద్‌లోని యూనియన్ రాష్ట్ర కార్యాలయంలో 104 ఉద్యోగుల అత్యవసర సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు భూపాల్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.యాదానాయక్ మాట్లాడుతూ, 104 సిబ్బంది రోగులకు ఇంటి వద్దనే వైద్యసేవలందించడంతో ప్రభుత్వానికి మంచి పేరు వచ్చిందని గుర్తుచేశారు.
వెంటనే వాహనలకు మరమ్మతులు చేయించి, అన్ని గ్రామాలకు సేవలందించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఉద్యమాన్ని ఉధతం చేస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో రాష్ట్ర నాయకులు బలరాం, విజయవర్దన్ రాజు, ఫసీయేద్దీన్, మరియ, కవిత, హరిశంకర్, శ్రీనివాస్, నవీన్, మతీన్, మల్లేశ్, అనిల్, రామారావు, బీచుపల్లి తదితరులు పాల్గొన్నారు.
