Tuesday, 11 Aug, 1.45 am నవ తెలంగాణ

జాతీయం
24 గంటలు.. 1007 మరణాలు

న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్‌ (కోవిడ్‌-19) విజృంభణ ఆగటంలేదు. రోజురోజుకూ వైరస్‌ బారినపడుతున్న వారితో పాటు మరణాల సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తున్నది. నిత్యం 60 వేలకు పైగా కొత్త కేసులతో పాటు 900లకు పైగా మరణాల చోటుచేసుకోవడం వైరస్‌ కోరలు విప్పుతున్నది. తాజాగా కేంద్రం ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించిన కరోనా వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1007 మందిని వైరస్‌ బలిగొన్నది. ఇదే సమయంలో 62,064 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కోవిడ్‌-19 బాధితుల సంఖ్య 22,15,074కు చేరింది. కరోనా రోగుల మరణాల సంఖ్య 44,386కు పెరిగింది. కరోనా బాధితుల మరణాల రేటు 2 శాతంగా ఉంది. ప్రస్తుతం 6,34,945 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకూ 15,35,744 మంది కరోనా రోగులు కోలుకున్నారు. దీంతో కరోనా రోగుల రికవరీ రేటు 69 శాతానికి పెరిగింది. కరోనా కేసులు అధికంగా నమోదవుతున్న దేశాల జాబితాలో భారత్‌ మూడో స్థానంలో ఉండగా, మరణాల విషయంలో ఐదో స్థానంలో ఉంది.
కాగా, దేశంలో 2,45,83,558 కరోనా పరీక్షలు నిర్వహించినట్టు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌) వెల్లడించింది. ఆదివారం ఒక్కరోజే 4,77,023 శాంపిళ్లను పరీక్షించినట్టు తెలిపింది.
సెప్టెంబర్‌ 30 వరకూ రైళ్లు బంద్‌
కరోనా వ్యాప్తి నేపథ్యంలో రైల్వేశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. సాధారణ మెయిల్‌, ఎక్స్‌ప్రెస్‌, సబర్బన్‌, ప్యాసింజర్‌ రైలు సర్వీసుల రద్దును వచ్చే నెల (సెప్టెంబర్‌) 30 వరకూ పొడిగించినట్టు తెలిపింది. ప్రస్తుతం నడుస్తున్న ప్రత్యేక రైళ్లు మాత్రమే నడుస్తాయని పేర్కొంది. ప్రయాణికులు కరోనా నేపథ్యంలో తప్పనిసరిగా ప్రయాణ సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని రైల్వేశాఖ సూచించింది. ఇంతకు ముందు ఆగస్టు 11 వరకు రైళ్ల రద్దును పొడిగించిన సంగతి తెలిసిందే.
ప్రణబ్‌కు పాజిటివ్‌
మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీకి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. సోమవారం ఆయన ఆస్పత్రికి వెళ్లి కరోనా పరీక్షలు చేయించకోగా పాజిటివ్‌ వచ్చిందని ప్రణబ్‌ తెలిపారు. గత వారం రోజుల నుంచి తనను కలిసినవారు సెల్ఫ్‌ ఐసొలేషన్‌ అవ్వాలనీ, అలాగే కోవిడ్‌-19 టెస్టు చేయించుకోవాలని ఆయన సూచించారు.
మహరాష్ట్రలో నెలాఖరు వరకూ లాక్‌డౌన్‌ పొడిగింపు
కరోనా ప్రభావం పెరుగుతున్న నేపథ్యంలో మహరాష్ట్రలో ఆగస్టు 31 వరకూ లాక్‌డౌన్‌ కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అధికంగా కరోనా కేసులు నమోదుకావడమే ఇందుకు కారణమనీ, వాటిని అదుపు చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రభుత్వం పేర్కొంది. పూణే, ముంబయి, సోలాపూర్‌, మాలేగావ్‌, ఔరంగాబాద్‌, నాసిక్‌, ధులే, జల్‌గావ్‌, అకోలా, అమరావతి, నాగ్‌పూర్‌లలో లాక్‌డౌన్‌ పొడిగించనున్నట్టు తెలిపింది. లాక్‌డౌన్‌ అమలులో ఉన్నప్పటికీ ప్రజల అవసరాల నిమిత్తం మాల్స్‌, షాపింగ్‌ కాంప్లెక్స్‌లు తెరిచేందుకు అనుమతిస్తున్నట్టు వెల్లడించింది. అయితే రెస్టారెంట్లు, సినిమా థియేటర్లకు మాత్రం అనుమతిలేదని ప్రకటించింది. కాగా, రాష్ట్రంలో ఇప్పటివరకూ ఐదు లక్షలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. అలాగే, 17,757 మంది మరణించారు.
మాస్కు లేకుంటే రూ.1000 ఫైన్‌ !
గుజరాత్‌లో కరోనా వ్యాప్తి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకూ మాస్కు ధరించకపోతే రూ.200గా ఫైన్‌ను ఇక నుంచి ఏకంగా రూ.1000కి పెంచింది. పెంచిన ఫైన్‌ ఆగస్టు 11 నుంచి అమల్లోకి వస్తుందని గుజరాత్‌ ముఖ్యమంత్రి విజరు రూపానీ వెల్లడించారు. కాగా, రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 70,965 చేరగా, మరణాల సంఖ్య 2,652 పెరిగింది.

ఈ మాస్క్‌ ధర 11.2 కోట్లు
కరోనా మహమ్మారి నేపథ్యంలో మాస్కు లేకుండా బయటకు వెళ్లే పరిస్థితి లేకపోవడంతో ప్రతిఒక్కరూ వారి వీలును బట్టి సాధారణ మాస్కుల నుంచి కొంచెం ఖరీదైన ఎన్‌-99 మాస్క్‌ లు, బంగారు, డైమండ్‌ మాస్క్‌లు ఇలా వారి వారి స్థాయిలను బట్టి ధరిస్తున్నారు. మాస్క్‌ ధరించడం కేవలం ఆరోగ్య సంరక్షణ మాత్రమే కాదు ఇపుడొక స్టేటస్‌ సింబల్‌గా మారింది. ఈ క్రమంలోనే ఇజ్రాయెల్‌ ఆభరణాల సంస్థ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఈ కరోనా వైరస్‌ మాస్క్‌ను తయారు చేస్తున్నది. టాప్‌-రేటెడ్‌ ఎన్‌-99 ఫిల్టర్లు, బంగారం, అతి ఖరీదైన వజ్రాలు పొదిగిన ఈ మాస్క్‌ ధర సుమారు రూ. 11.2 కోట్లు. అమెరికాలో ఉంటున్న చైనా వ్యాపారవేత్త దీనిని ఆర్డర్‌ చేశారు. 18 క్యారెట్ల గోల్డ్‌ తో రూపొందిస్తున్న మాస్క్‌ చుట్టూ, 3,600 తెలుపు, నలుపు వజ్రాలను అలంకరించనున్నామని డిజైనర్‌ ఐజాక్‌ లెవీ తెలిపారు. కొనుగోలుదారుడి అభ్యర్థన మేరకు ఈ స్పెషల్‌ మాస్కును తయారుచేస్తున్నట్టు చెప్పారు.0

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Navatelangana
Top