Monday, 25 Jan, 3.46 am నవ తెలంగాణ

రాష్ట్రీయం
26న ట్రాక్టర్, వాహనాల ర్యాలీలు

- నూతన వ్యవసాయ చట్టాలు రద్దు చేయాల్సిందే
- విద్యుత్‌ సవరణ బిల్లునూ ఉపసంహరించుకోవాలి
- ఫిబ్రవరిలో రైతు పోరాటానికి మద్దతుగా యాత్ర :తొమ్మిది రాజకీయ పార్టీల తీర్మానం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
నూతన వ్యవసాయ చట్టాలు రద్దు, విద్యుత్‌ సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేస్తూ ఢిల్లీలో రైతులు చేస్తున్న పోరాటానికి మద్దతుగా రిపబ్లిక్‌ డే నాడు హైదరాబాద్‌తో పాటు జిల్లా కేంద్రాల్లో ట్రాక్టర్‌, వాహనాలు, బైక్‌, సైకిల్‌ ర్యాలీలు చేపట్టనున్నట్టు సీపీఐ(ఎం), సీపీఐ, కాంగ్రెస్‌, టీజేఎస్‌, సీపీఐ(ఎంఎల్‌)న్యూడెమోక్రసీ, టీడీపీ, సీపీఐ(ఎంఎల్‌) న్యూడెమోక్రసీ, ఎంసీపీఐ, సీపీఐ(ఎంల్‌) పార్టీల సమావేశం తీర్మానించింది. ఈ ర్యాలీలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చింది. పంటలకు మద్దతు ధర దక్కేలా చట్టం చేయాలని డిమాండ్‌ చేసింది. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తొమ్మిది రాజకీయ పార్టీల సమావేశం ఆదివారం జరిగింది. అనంతరం ఆయా పార్టీల ప్రతినిధులు మీడియాతో మాట్లాడారు.
రైతుల కోసం ఫిబ్రవరిలో రాష్ట్రంలో యాత్ర : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం
మూడు నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలనీ, విద్యుత్‌ సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేస్తూ ఫిబ్రవరి నెలలో వారం నుంచి 10 రోజుల పాటు యాత్ర చేస్తామనీ, ఆయా పార్టీలతో చర్చించి తేదీలను ఒకటెండ్రు రోజుల్లో ప్రకటిస్తామని తమ్మినేని చెప్పారు. ఇక భవిష్యత్‌లో పంటల కొనుగోలు కేంద్రాలుండవనీ, ప్రభుత్వం రైతుల నుంచి కొనబోదని సీఎం కేసీఆర్‌ వ్యాఖ్యానించడం సరిగాదని అన్నారు. రైతులు, ప్రజల కోసం సీఎం తన వైఖరిని మార్చుకోవాలనీ, కేంద్రంలోని బీజేపీ సర్కారుకు వ్యతిరేకంగా నిలబడాల్సిన అవసరం ఉందని సూచించారు. కొనుగోలు కేంద్రాల కోసం భవిష్యత్‌లో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని ప్రకటించారు. ఏఐకేఎస్‌సీసీ పిలుపులను సమన్వయం చేసుకుంటూ రాష్ట్రంలో ముందుకు సాగుతామని చెప్పారు. పోడు భూముల సమస్యను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. ఫార్మాసిటీ కోసం అడ్డుగోలుగా భూములు సేకరించడాన్ని నిలిపేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. రైతుల ఉంచి సేకరించిన భూములకు ఇచ్చే పరిహారం విషయంలోనూ తేడాలున్నాయనీ, దీనిపైనా పోరాటం చేస్తామని చెప్పారు.
విదేశీ పెట్టుబడుల కోసం వ్యవసాయం విధ్వంసం : సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి
కేంద్ర ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవసాయ రంగంలోకి విదేశీ పెట్టుబడులను తేవాలనీ, వ్యవసాయాన్ని ధ్వంసం చేయాలని చూస్తున్నదని చాడ వెంకట్‌రెడ్డి విమర్శించారు. ఢిల్లీలో జరిగే ర్యాలీకి ఆయా రాష్ట్రాల నుంచి పెద్దఎత్తున ట్రాక్టర్లుగా వెళ్లాయన్నారు. అసెంబ్లీ సమావేశాలను తక్షణమే ఏర్పాటు చేసి మూడు వ్యవసాయక చట్టాలను, విద్యుత్‌ సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ తీర్మానం చేయాలని డిమాండ్‌ చేశారు. కేసీఆర్‌ యూటర్న్‌ తీసుకోవడం సబబుకాదనీ, రైతులను రోడ్డున పడేసే చర్యలను మానుకోవాలని సూచించారు. రెవెన్యూ వ్యవస్థలోని లోపాలను సవరించాలని కోరారు. భూసేకరణ చట్టానికి కేసీఆర్‌ సర్కారు తూట్లు పొడుస్తున్నదని విమర్శించారు.
ప్రధాని, కేంద్ర మంత్రులవి బాధ్యాతారాహిత్య మాటలు : కాంగ్రెస్‌ సీనియర్‌ నేత కోదండరెడ్డి
రైతుల విషయంలో ప్రధానమంత్రి, కేంద్ర మంత్రులు బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారని కోదండరెడ్డి విమర్శించారు. మద్దతు ధర కోసం రైతులు పట్టుబట్టడంలో న్యాయముందన్నారు. కేంద్ర ప్రభుత్వం మొండిగా ముందుకెళ్తే రాష్ట్రంలో ప్రత్యామ్నాయంగా రైతుల మేలు కోసం చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.
కార్పొరేటీకరణకు దోహదం చేసే చట్టాలు వద్దు : జీజేఎస్‌ అధ్యక్షులు కోదండరామ్‌
కార్పొరేట్ల కోసం మోడీ సర్కారు చేసిన చట్టాలను వెంటనే ఉపసంహరించుకోవాని కోదండరామ్‌ డిమాండ్‌ చేశారు. 2013 చట్టాన్ని పక్కనబెట్టి ఫార్మాసిటీల కోసం భూములు కేటాయించడం దుర్మార్గమన్నారు. న్యాయం కోసం అన్నదాతలు అడిగితే దాడులు చేయించడం, అరెస్టులు చేయించడాన్ని మానుకోవాలని హితవు పలికారు.
రైతు ఉద్యమాన్ని అణచివేసే కుట్రను మానుకోవాలి : సీపీఐ(ఎంఎల్‌) న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి డివి కృష్ణ
రైతుల ఉద్యమాన్ని అణచివేసే, పక్కదారి పట్టించే కుట్రలను మోడీ సర్కారు మానుకోవాలని డివి కృష్ణ హితవు పలికారు. బలవంత భూసేకరణలను ఆపేయాలన్నారు. కొనుగోలు కేంద్రాలను నిలిపేయడం సరిగాదన్నారు. ఏఐకేఎస్‌సీసీ పిలుపులను జయప్రదం చేయాలని కోరారు.
కేసీఆర్‌వన్నీ ఒట్టిమాటలే : సీపీఐ(ఎంల్‌) న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి సాధినేని వెంకటేశ్వర్‌రావు
తాను రైతుబంధుననీ, రైతుపక్షపాతిని అని కేసీఆర్‌ చెప్పుకునేది ఒట్టి మాటలేనని ప్రస్తుత పరిస్థితులను చూస్తే అర్థమవుతున్నదని సాధినేని వెంకటేశ్వర్‌రావు అన్నారు. ఆదివాసీ, గిరిజనుల పోడుభూములను లాక్కునే ప్రయత్నం జరు గుతున్నదనీ, దీనికి వ్యతిరేకంగా పోరాటం చేస్తామని చెప్పారు. భూమి సమస్యను కీలకంగా తీసుకుని పోరాటం చేస్తామన్నారు.
ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు ఎల్‌.రమణ, సీపీఐ(ఎంల్‌) రాష్ట్ర నాయకులు ప్రసాద్‌, ఎంసీపీఐ రాష్ట్ర నాయకులు రవి, సీపీఐ జాతీయ నాయకులు అజీజ్‌పాషా, సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు డీజీ నర్సింహారావు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పశ్యపద్మ, బాలమల్లేశ్‌, సీపీఐ(ఎంల్‌) నాయకులు రమాదేవి, అచ్యుతరావు, టీజేఎస్‌ నాయకులు శ్రీశైల్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Navatelangana
Top