Tuesday, 21 Jan, 12.45 am నవ తెలంగాణ

క్రీడలు
ఆ జోన్ నుంచి బయటపడ్డాం

- టాస్‌పై కెప్టెన్‌ కోహ్లి
నవతెలంగాణ-బెంగళూర్‌
2020 ఏడాదిలో బలమైన ప్రత్యర్థితో భారత్‌ మెరుగైన ఆరంభం అందుకోలేదు. కానీ ఆడిన మూడు మ్యాచుల్లోనే టీమ్‌ ఇండియా విలువైన ఆత్మవిశ్వాసం సంపాదించింది. గడిచిన ఐదారు నెలలు భారత క్రికెట్‌లో సరికొత్త కోణాలను ఆవిష్కరించిందని కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి అభిప్రాయపడ్డాడు. ఆస్ట్రేలియాపై 2-1తో వన్డే సిరీస్‌ సాధించిన అనంతరం విరాట్‌ కోహ్లి మీడియాతో మాట్లాడాడు. 2019 వరల్డ్‌కప్‌ సెమీఫైనల్స్‌ పరాజయం తర్వాత టీమ్‌ ఇండియా చర్చించిన అంశాలను గుర్తు చేస్తూ విరాట్‌ ఇలా అన్నాడు. ' ప్రతిసారీ టాస్‌పై ఆధారపడుతూ, అనుకూల పరిస్థితుల కోసం ఎదురుచూడలేం. జట్టుగా భారత్‌ లక్ష్య ఛేదన ఇష్టపడుతుంది. అలాగని టాస్‌ ఓడగానే ఆందోళన చెందాల్సిన అవసరం ఏమాత్రం లేదు. బలమైన ప్రదర్శనలతో మ్యాచ్‌ను నిలబెట్టుకోగలం. ఈ ఐదారు నెలల్లో జట్టుగా అదే పని చేశాం. జట్టు ప్రణాళికల నుంచి టాస్‌ను తీసివేశాం. ప్రత్యర్థి విసిరిన సవాల్‌ను స్వీకరించేందుకు అనుగుణంగా సిద్ధమయ్యాం. ఈ కొంత సమయంలో జట్టులో వచ్చిన మార్పు అది. టాస్‌ ఓడినా, ఆకట్టుకునే ప్రదర్శనలతో మ్యాచ్‌లు నెగ్గగలమనే నమ్మకం మాకుంది. చివరి 6-8 నెలల్లో ఇది వెల్లడైంది. యువ క్రికెటర్లు ముందుకొచ్చి బాధ్యత తీసుకోవటం భారత క్రికెట్‌కు మంచి సంకేతం' అని విరాట్‌ కోహ్లి పేర్కొన్నాడు. గత ఏడాది ఆస్ట్రేలియాపై 2-0 ఆధిక్యంలో ఉండగా, మిగిలిన మూడింటిలో ఏదో ఒక మ్యాచ్‌ కచ్చితంగా నెగ్గుతామనే భావన ఉన్నది. భారత పరిస్థితులను గొప్పగా అర్ధం చేసుకున్నామని ఆస్ట్రేలియా నిరూపించింది. ఐపీఎల్‌, వరుస ద్వైపాక్షిక సిరీస్‌లు ఆసీస్‌కు ఇక్కడి పరిస్థితులపై అవగాహన కలిగించాయి. గత పర్యటనతో పోల్చితే ఈ సిరీస్‌కు వచ్చిన జట్టు బలమైనది. మా బాడీ లాంగ్వేజ్‌, సిరీస్‌పై ఆసక్తి అదే స్థాయిలో ఉండేలా చూసుకున్నామని కోహ్లి అన్నాడు.
ముంబయిలో పది వికెట్ల ఘోర పరాజయం తర్వాత వరుస రెండు మ్యాచుల్లో భారత్‌ నెగ్గింది. బెంగళూర్‌ నిర్ణయాత్మక వన్డేలో శిఖర్‌ ధావన్‌ను ముందుగానే కోల్పోయాం. బ్యాటింగ్‌ లైనప్‌లో ఓ బ్యాట్స్‌మన్‌ తగ్గిపోయాడు. సీనియర్లు జట్టులో ఉండటంతో బ్యాటింగ్‌ ఆర్డర్‌ మార్పు సులువైంది. రాహుల్‌ నిష్క్రమించిన తర్వాత రోహిత్‌తో కలిసి నేను నిర్మించిన భాగస్వామ్యం గతంలో కంటే భిన్నమైనది. వికెట్ల మధ్య సింగిల్‌ పరుగు తీయటంలోనూ మా ఉద్దేశం చాటిచెప్పాం. ముంబయిలో నిరాశపరిచిన జశ్‌ప్రీత్‌ బుమ్రా తర్వాతి రెండు మ్యాచుల్లో స్వీయ సవాల్‌తో ముందుకొచ్చాడు. కొత్త బంతితో, డెత్‌ ఓవర్లలో బుమ్రా లైన్‌ అండ్‌ లెంగ్త్‌ అద్భుతం. బుమ్రా సృష్టించిన ఒత్తిడితోనే మిగతా బౌలర్లు సులువుగా వికెట్లు ఖాతాలో వేసుకున్నారు అని విరాట్‌ కోహ్లి తెలిపాడు. 2020లో కోహ్లిసేన తొలి విదేశీ పర్యటనకు బయల్దేరింది. సోమవారం ఉదయం న్యూజిలాండ్‌కు భారత జట్టు పయనమైంది. జనవరి 24 నుంచి ఆరంభమయ్యే కివీస్‌ టూర్‌లో ఐదు టీ20, మూడు వన్డేలు, రెండు టెస్టులు ఆడాల్సి ఉంది.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Navatelangana
Top