Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఆలూతో కరకరలాడే స్నాక్స్

ఆలూతో కరకరలాడే స్నాక్స్

ఇంట్లో కూరగాయలు ఉన్నాయంటే అందులో ఆలుగడ్డలు కంపల్సరీ. ఎందుకంటే పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా చాలా మంది ఇష్టంగా తింటుంటారు. ఇక ఆలూతో కేవలం కర్రీలు మాత్రమే కాకుండా రకరకాల స్నాక్స్​ తయారు చేసుకోవచ్చు.

ఇక పిల్లలైతే బయట దొరికే ఆలూ చిప్స్ కోసం తెగ అల్లరి చేస్తుంటారు. బయట పాకింగ్ చేసిన ఆహారం అస్సలు మంచిది కాదు. అందుకే ఈ వేసవి సెలవల్లో పిల్లల కోసం ఆలూతో చేసే కొన్ని వంటకాల గురించి ఈరోజు తెలుసుకుందాం…

జంతికలు
కావల్సిన పదార్థాలు : ఆలు - రెండు, బియ్యప్పిండి - రెండు కప్పులు, శనగపిండి - కప్పు, కారం - చెంచా, పసుపు - పావు చెంచా, జీలకర్ర - అర చెంచా, వెన్న - చెంచా, ఉప్పు - తగినంత, నూనె - వేయించడానికి సరిపడా
తయారీ విధానం : ముందుగా ఆలూను ఉడికించుకుని పైన పొట్టు తీసేసుకోవాలి. మిక్సీ జార్లో ఉడికించిన ఆలు వేసుకొని అవసరాన్ని బట్టి నీళ్లు పోసుకుంటూ మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. పేస్టు మరీ జారుగా అయ్యిందంటే జంతికలు చేయడం సాధ్యం కాదు. ఆలూ మిశ్రమంలో శనగపిండి, బియ్యప్పిండి, ఉప్పు, కారం, జీలకర్ర, వెన్న వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా జంతికలకు అవసరమైన పిండిని సిద్ధం చేసుకోవాలి. ఈ లోపు స్టౌ మీద కడాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని వేడెక్కనివ్వాలి. జంతికల గొట్టం తీసుకొని అందులో ఈ పిండి వేసుకొని వేడి వేడిగా కాగుతున్న నూనెలో చక్రాల్లా ఒత్తుకోవాలి. ఎర్రగా రెండు వైపులా వేయించుకుని తీసుకుంటే సరిపోతుంది. కరకరలాడే ఆలూ జంతికలు రెడీ.

ఫింగర్ చిప్స్
కావల్సిన పదార్థాలు : ఆలు - అరకేజీ, అటుకులు - కప్పు, రెడ్ చిల్లీఫ్లేక్స్ - చెంచా, కొత్తిమీర తురుము - అరకప్పు, మయొనైజ్ - నాలుగు చెంచాలు, షెజ్వాన్ సాస్ - రెండు చెంచాలు, నూనె - వేయించడానికి సరిపడా, ఉప్పు - తగినంత.
తయారీ విధానం : ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో అటుకులు వేసుకుని మెత్తని పొడిలాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ లోపు ఆలూను కుక్కర్లో వేసి ఉడికించుకోవాలి. తర్వాత ఆలూను తడిలేకుండా మిక్సీ జార్లో వేసుకోవాలి. అదే మిక్సీ జార్లో కొత్తిమీర తురుము, చిల్లీఫ్లేక్స్ వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇందులో ఉప్పు, అటుకుల పొడిని కొద్దికొద్దిగా వేసుకుంటూ చపాతీపిండి ముద్దలాగా కలుపుకోవాలి. పిండిని కాస్త మందంగా చపాతీలాగా ఒత్తుకుని చాకుతో సన్నగా పొడవుగా ఉండేలా ఫ్రెంచ్ఫ్రైస్ షేప్​లో కట్ చేసుకోవాలి. ఈలోగా స్టౌ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టి వేడెక్కిన తర్వాత డీప్ ఫ్రై చేసుకుంటే సరి. కరకరలాడే పొటాటో ఫింగర్ చిప్స్ రెడీ అయిపోతాయి. ఆ తర్వాత షెజ్వాన్ సాస్, మయొనైజ్ రెండూ మిక్స్ చేసుకుంటే డిప్ చేసుకోవడానికి సాస్ రెడీ అయిపోతుంది.

పొటాటో, సగ్గుబియ్యం స్టిక్స్

కావాల్సిన పదార్థాలు: ఆలుగడ్డలు - రెండు, చిల్లీ ఫ్లేక్స్​ - అర టీస్పూన్​, ఉప్పు - రుచికి సరిపడా, కొత్తిమీర తరుగు - కొద్దిగా, సగ్గుబియ్యం - కప్పు.
తయారీ విధానం: ముందుగా ఆలూను నాలుగు భాగాలుగా కట్​ చేసుకోవాలి. వీటిని ఓ గిన్నెలోకి తీసుకుని అవి మునిగేంతవరకు నీళ్లు పోసుకోవాలి. స్టవ్​ ఆన్​ చేసి ఆలూ ఉన్న గిన్నె పెట్టి మీడియం ఫ్లేమ్​లో మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఈలోపు కొత్తిమీరను సన్నగా తురుముకోవాలి. మిక్సీజార్​లోకి సగ్గుబియ్యం వేసి వీలైనంత మెత్తని పొడిలా గ్రైండ్​ చేసుకోవాలి. ఆలూ చల్లారిన తర్వాత వాటిపై ఉండే పొట్టు తీసేసి మెత్తగా మెదుపుకుని మిక్సింగ్​ బౌల్​లోకి తీసుకోవాలి. ఇందులో చిల్లీ ఫ్లేక్స్​, రుచికి సరిపడా ఉప్పు, కొత్తిమీర తరుగు, గ్రైండ్​ చేసిన సగ్గుబియ్యం వేసి సాఫ్ట్​ ముద్దలాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దిగా పిండి తీసుకొని చపాతీ పీటపై కాస్త పొడి పిండి చల్లి చపాతీ కర్రతో కాస్త మందంగా వత్తుకోవాలి. తర్వాత స్క్వేర్​ షేప్​ వచ్చేలా ఎడ్జ్​లను కట్​ చేసి ఫ్రైంచ్​ ఫ్రైస్​ మాదిరిగా పొడవుగా చాకుతో కట్​ చేసుకోవాలి. ఇలా అన్నీ పొటాటో స్టిక్స్​ కట్​ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోండి. స్టవ్​ ఆన్​ చేసి కడాయి పెట్టి డీప్​ఫ్రైకి సరిపడా నూనె పోసి వేడి చేసుకోవాలి. కాగిన నూనెలో పొటాటో స్టిక్స్​ వేసి మీడియం ఫ్లేమ్​లో దోరగా వేయించుకోవాలి. ఈ స్టిక్స్​ పర్ఫెక్ట్​గా వేగిన తర్వాత ఓ ప్లేట్​లోకి తీసుకోవాలి. మిగిలిన వాటిని కూడా ఇలానే నూనెలో వేసి వేయించుకోవాలి. ఇలా అన్నింటినీ వేయించుకున్న తర్వాత టమాట కెచప్​తో తింటే ఎంతో బాగుంటుంది.

ఆలూ బైట్స్
కావాల్సిన పదార్థాలు: ఉడికించిన ఆలు - మూడు, బియ్యం పిండి - మూడు టీ స్పూన్స్, కార్న్ ఫ్లోర్ - రెండు టీ స్పూన్స్, ఉప్పు - రుచికి సరిపడినంత, చిన్నగా తరిగిన ఉల్లిగడ్డ - ఒకటి, కారం - టీ స్పూన్, గరం మసాలా - అర టీ స్పూన్, మిరియాల పొడి - పావు టీస్పూన్, తరిగిన కొత్తిమీర, కరివేపాకు - కొద్దిగా, బ్రెండ్ క్రంబ్స్ - అర కప్పు, నూనె -
డీప్ ఫ్రైకి సరిపడినంత.
తయారీ విధానం: ముందుగా కళాయిలో నూనె పోసుకుని వేడి చేసుకోవాలి. ఈలోపు ఉడికించిన ఆలూను తురిమి ఒక గిన్నెలోకి వేసుకోవాలి. ఇందులో కార్న్ ఫ్లోర్, బ్రెడ్ క్రంబ్స్ తప్పించి.. మిగతా అన్ని పదార్థాలు, తగిననన్ని నీళ్లు పోసి.. బైట్స్ వచ్చేలా కలుపుకోవాలి. ఇప్పుడు చేతికి నూనె లేదా నెయ్యి రాసుకుంటూ మీకు నచ్చిన ఆకారంలో బైట్స్ ని సిద్ధం చేసుకోండి. ఆ తర్వాత వీటిని కార్న్ ఫ్లోర్ వాటర్ లో ముంచిన తర్వాత బ్రెడ్ క్రంబ్స్ లో కోటింగ్ చేసుకోవాలి. ఇలా అన్నింటిని తయారు చేసుకున్న వాటిని నూనెలో వేసి బాగా వేగాక ప్లేట్ లోకి తీసుకోవాలి. అంతే ఎంతో టేస్టీగా ఉండే క్రిస్పీ ఆలూ బైట్స్ రెడీ. వీటిని టమాటా సాస్ తో తింటే భలే రుచిగా ఉంటాయి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana