Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఆర్థిక ప్రక్షాళన దిశగా క్యూబా

ఆర్థిక ప్రక్షాళన దిశగా క్యూబా

కీలక రంగాలు, సేవలను ప్రయివేటీకరించం : దేశాధ్యక్షుడు మిగుయెల్ డియాజ్ - కానెల్హవానా : అమెరికా ఆంక్షలు ఇబ్బంది పెడుతున్న సమయంలో ఆర్థిక వ్యవస్థను ప్రక్షాళన చేయడానికి క్యూబా నడుం బిగించింది.

ప్రభుత్వ అధీనంలోని కీలక రంగాలలోకి ప్రైవేటు పరిశ్రమలను అనుమతించేందుకు ఉద్దేశించిన ప్రణాళిక వివరాలను ప్రకటించింది. భూ వినియోగంపై ఆంక్షలను సడలించడం, ఇంధనం - ఔషధాల దిగుమతులకు వ్యాపార సంస్థలను అనుమతించడం, క్యూబా ద్వీపంలో పనిచేసేందుకు ప్రయివేటు పర్యాటక సంస్థలను అనుమతించడం వంటి చర్యలపై రెండు రోజుల పాటు జరిగిన జాతీయ అసెంబ్లీలో సభ్యులు చర్చించారు.

దోపిడీ పెట్టుబడిదారీ విధానాన్ని 
అమలు చేయం
అమెరికాను మెప్పించడానికి ఈ సంస్కరణలను అమలు చేయడం లేదని, ఆర్థిక వ్యవస్థలోని కీలక రంగాలను ప్రయివేటీకరించే ప్రశ్నే లేదని క్యూబా అధ్యక్షుడు మిగుయెల్ డియాజ్- కానెల్ స్పష్టం చేశారు. 'కొందరు భయపడుతున్న విధంగా మేము దోపిడీ పెట్టుబడిదారీ విధానాన్ని అమలు చేయబోవడం లేదు. జాతీయ ఆస్తులను పెద్ద ఎత్తున ప్రయివేటీకరించబోవడం లేదు' అని డియాజ్ - కానెల్ గురువారం ప్రకటించారు. ఆరోగ్య సంరక్షణ, శాస్త్ర - సాంస్కృతిక రంగాలను ప్రయివేటు పరం చేయం. వ్యూహాత్మక సేవల ప్రయివేటీకరణ కూడా జరగదు. ఈ విషయాన్ని చాలా స్పష్టంగా చెబుతున్నా' అని ఆయన తెలిపారు.

ఇంధనం, వ్యవసాయం, పర్యాటక రంగాలలో…
అమెరికా దిగ్బంధనం కారణంగా ఇంధన రంగంలోని కొన్ని భాగాలను క్యూబా ప్రయివేటీకరిస్తోంది. గత నెలలో చట్టసభ సభ్యులు 176 చర్యల ప్యాకేజీని ఏకగ్రీవంగా ఆమోదించారు. ఇంధనాన్ని దిగుమతి చేసుకొని విక్రయించేందుకు తొలిసారిగా విదేశీ సంస్థకు అనుమతి ఇచ్చామని, అలాగే ఇంధనాన్ని టోకుగా పంపిణీ చేసేందుకు సుమారు 200 దేశీయ సంస్థలు ఇప్పటికే అనుమతులు పొందాయని ప్రధాని మాన్యువల్ మారెరో క్రూజ్ రెండు రోజుల క్రితం జాతీయ అసెంబ్లీలో తెలిపారు. దేశంలో వ్యవసాయ, పర్యాటక రంగాల పునరుజ్జీవనానికి కూడా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రభుత్వ అధీనంలోని 80 శాతం భూమిని వినియోగించుకునేందుకు దేశంలోని ప్రజలు, ప్రయివేటు వ్యాపారులతో పాటు విదేశీయులకు అవకాశం కల్పించేందుకు వ్యవసాయ చట్టాన్ని ఆమోదించింది. అమెరికా ఆంక్షలతో కుదేలైన పర్యాటక రంగంలో జీవం నింపేందుకు చట్టసభ సభ్యులు 10 చర్యలను ఆమోదించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana