Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఆస్పత్రుల్లో ఫార్మసీలను అందుబాటులో ఉంచాలి

ఆస్పత్రుల్లో ఫార్మసీలను అందుబాటులో ఉంచాలి

త్యవసరమైతే 1800 599 6969ను సంప్రదించాలి నేటి బంద్ నేపథ్యంలో ప్రజలు ఆందోళన చెందొద్దు :
తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్
నవతెలంగాణ-సిటీబ్యూరో

ప్రజలకు అసౌకర్యం కలగకుండా ఉండేందుకు, మందుల సరఫరా కోసం ఆస్పత్రులకు అనుబంధంగా ఉన్న ఫార్మసీ దుకాణాలను అందుబాటులో ఉంచాలని తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ పేర్కొంది. ఆలిండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్స్ అండ్ డ్రగ్గిస్ట్స్ బుధవారం ఒక్క రోజు దేశవ్యాప్త బంద్ పిలుపు దృష్ట్యా డీసీఏ 'ఏఐఓసీడీ' తెలంగాణ చాప్టర్తో జరిగిన సమావేశంలో మంగళవారం కొన్ని నిర్ణయాలు తీసుకున్నది. అత్యవసర పరిస్థితుల్లో స్థానిక దుకాణాల నుంచి ఏవైనా మందులను అందుబాటులో ఉంచడానికి, ఏఐఓసీడీ జిల్లా చాప్టర్లు డ్రగ్ ఇన్స్పెక్టర్లతో నిరంతరం సంప్రదింపులు జరుపుతాయని తెలిపింది. అదనంగా అపోలో, మెడ్పల్స్ వంటి కార్పొరేట్ మెడికల్ స్టోర్లు తమ దుకాణాలను తెరిచి ఉంచాలని కోరింది. నేడు నిత్యావసర లేదా అత్యవసర మందుల్లో ఏదైనా ఇబ్బంది ఎదురైతే, ప్రజలు సహాయం కోసం వెంటనే సంబంధిత స్థానిక డ్రగ్స్ ఇన్స్పెక్టర్ను లేదా డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అసిస్టెంట్ డైరెక్టర్ను సంప్రదించొచ్చని తెలిపింది.
రాష్ట్రవ్యాప్తంగా అత్యవసర, ప్రాణరక్షక మందుల కోసం పరిస్థితిని పర్యవేక్షిస్తున్నట్టు అధికారులు చెప్పారు. మందుల విషయంలో ఏవైనా సమస్యలు లేదా ప్రజల ఫిర్యాదులపై అప్రమత్తంగా ఉండి, తక్షణమే స్పందించాలని శాఖలోని క్షేత్రస్థాయి అధికారులందరికీ సూచించినట్టు తెలిపారు. ఔషధ నియంత్రణ పరిపాలన విభాగం అధికారుల నెంబర్లు, కార్యాలయ చిరునామాలు, తెలంగాణ ఔషధ నియంత్రణ పరిపాలన విభాగం అధికారిక వెబ్సైట్లోని ''కీ కాంటాక్ట్స్'' విభాగంలో అందుబాటులో ఉన్నట్టు తెలిపింది. ఆస్పత్రుల లోపల ఉండే మెడికల్ షాపులు యథావిధిగా పని చేస్తాయని, ఆస్పత్రులు, అత్యవసర వైద్య సేవలు సాధారణంగానే అందుబాటులో ఉంటాయని వివరించారు. బయట ఉండే రిటైల్ మెడికల్ షాపుల్లో మందుల లభ్యతకు అంతరాయం కలగొచ్చని, ప్రజలెవరూ ఆందోళన చెందొద్దని, అధికారులకు సహకరించాలని కోరారు. ఏదైనా అత్యవసర పరిస్థితిలో లేదా మందులు దొరకడం కష్టమైతే, సమీపంలోని ఆస్పత్రులను సంప్రదించొచ్చని సూచించారు. మందుల సహాయం లేదా సమాచారం కోసం ప్రజలు డీసీఏ తెలంగాణ టోల్-ఫ్రీ నంబర్ 1800 599 6969ను సంప్రదించాలన్నారు. నేడు బంద్ సమయంలో ప్రజలకు మందులు నిరంతరాయంగా అందేలా చూడటానికి సహకరించాలని డీసీఏ విజ్ఞప్తి చేసింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana