Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
అధికారుల చేతులు కట్టేస్తుందెవ్వరు..!?

అధికారుల చేతులు కట్టేస్తుందెవ్వరు..!?

- కళ్ళముందు సాక్ష్యాలున్న ఎక్సైజ్, ఫుడ్ సేఫ్టీ అధికారులు కదలకపోవడంలో మతలాబేంటి..?- వైన్స్ సిండికేట్ వ్యవహారంపై అధికార యంత్రాంగంపై సర్వత్ర విమర్శలు..

నవతెలంగాణ - పరకాల: పరకాల పట్టణంలో వైన్స్ సిండికేట్ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోంది. దీనికి అధికార యంత్రాంగం వంతపాడుతుందా..? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. లేకుంటే వేళాపాళా లేకుండా వైన్స్ నిర్వహణ, ఎలాంటి అనుమతులు లేకుండా పర్మిట్ రూముల పేరుతో క్యాంటీన్లు, కనీస సౌకర్యాలు లేకుండా పర్మిట్ రూముల నిర్వహణ ఎలా సాధ్యమంటూ పలు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారంపై 'నవతెలంగాణ' పత్రిక వరుస కథనాలు ప్రచురిస్తున్నా ఎక్సైజ్, ఫుడ్ సేఫ్టీ అధికారులు తమకేమీ పట్టనట్లు వ్యవహరించడం పలు అనుమానాలకు తావిస్తుంది.

పట్టణంలోని పలు మద్యం దుకాణాల యజమానులు సిండికేట్గా మారి ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కుతున్నారు. ఉదయం నిర్ణత సమయానికంటే ముందే గుట్టుచప్పుడు కాకుండా విక్రయాలు సాగిస్తున్నా, రాత్రి వేళల్లో 11 గంటల సమయం దాటినా దుకాణాలు తెరిచే ఉంచుతున్నా అధికారులు చూసీచూడనట్లు వ్యవహరించడం వెనుక ఉన్న మతలబు ఏంటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇక పర్మిట్ రూముల పేరిట నడుస్తున్న క్యాంటీన్లలో నాణ్యతా ప్రమాణాలు లోపించడమే కాకుండా, కనీస పరిశుభ్రత కరువైంది.

ఫుడ్ సేఫ్టీ అధికారులు ఇటువైపు కన్నెత్తి కూడా చూడకపోవడంపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పత్రికల్లో వరుసగా వార్తలు వస్తున్నా, కళ్ళముందే నిబంధనల ఉల్లంఘనలు కనిపిస్తున్నా ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడం వెనుక ఏ శక్తుల ఒత్తిళ్లు ఉన్నాయో, ఎవరు ఎక్కడ చేతులు చాచుతున్నారోననే చర్చ పరకాల పట్టణంలో జోరుగా సాగుతోంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ఈ సిండికేట్ వ్యవహారంపై విచారణ జరిపి, బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana