Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
అగ్నిగుండంలో పంతుళ్లు

అగ్నిగుండంలో పంతుళ్లు

నగణన.. బడిబాటతో ఉక్కిరి బిక్కిరి !ఇంటర్ పరీక్షల్లో ఉంటూ జనగణనలో లెక్చరర్లు
45 డిగ్రీల భానుడి భగభగలు.. క్షేత్రస్థాయిలో ఉపాధ్యాయుల అగచాట్లు
పిలిచినా పలకని జనం, అడిగినా దొరకని వివరాలు

డిజిటల్ మ్యాపింగ్ల చిక్కులు.. అదనపు భారంతో బలి అవుతున్న గురువులు!

నవతెలంగాణ- 
కరీంనగర్ ప్రాంతీయ ప్రతినిధి
ఉదయం 8 గంటలకే సూర్యుడు అగ్నిగోళంలా మండుతున్నాడు. బయట కాలు పెట్టాలంటేనే జనం జంకుతున్నారు. కానీ, సమాజానికి అక్షరాలు నేర్పే ఉపాధ్యాయులు మాత్రం ఈ కరకుటెండలో వీధుల వెంట అల్లాడిపోతున్నారు. చేతిలో స్మార్ట్ఫోన్, నెత్తిన టోపీ, మొహనికి కర్చీఫ్ కట్టుకుని ఇల్లు ఇల్లూ తిరుగుతున్నారు. ఒకవైపు రాష్ట్రవ్యాప్తంగా 45 డిగ్రీలు దాటిన రికార్డు స్థాయి ఎండలు, మరోవైపు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'జనగణన-2027' మొదటి దశ విధులు.. వీటికి తోడు తాజాగా విద్యాశాఖ జారీ చేసిన 'ప్రొఫెసర్ జయశంకర్ బడి బాట' ఉత్తర్వులు.. ఈ రెండింటి మధ్య నలిగిపోతూ ఉపాధ్యాయులు అగ్నిపరీక్షను ఎదుర్కొంటున్నారు. అదేవిధంగా ఇంటర్ మీడియట్ పరీక్షల్లో విధులు నిర్వర్తిస్తూ.. మరోపక్క జనగణనలో ఉంటున్నారు. తమకు కేటాయించిన ప్రతి బ్లాక్లో సుమారు 200 ఇండ్లకు నంబర్లు వేయడం, లొకేషన్ మ్యాప్లు గీయడం, యాప్లో వివరాలు అప్లోడ్ చేయడం వంటి క్లిష్టమైన పనులతో సాయంత్రానికి ఉపాధ్యాయుల ముఖాలు మసిబొగ్గులా మారుతున్నాయి.

​ఒకేసారి రెండు పడవల ప్రయాణం
రాష్ట్రంలో దాదాపు 90 శాతం మంది ఉపాధ్యాయులు ప్రస్తుతం జనగణన (హౌస్ లిస్టింగ్) విధుల్లో నిమగ్నమై ఉన్నారు. 36 ప్రశ్నలతో కూడిన సుదీర్ఘ డిజిటల్ ఫారమ్ను నింపడం సవాలుగా మారింది. ఈ తరుణంలోనే సమగ్ర శిక్ష తెలంగాణ రాష్ట్ర ప్రాజెక్ట్ డైరెక్టర్ డాక్టర్ ఇ.నవీన్ నికోలస్.. మే 15న మెమో (నెం.1442/ఈఈ/టీ4/సీఈ/2020) జారీ చేశారు. జనగణన విధుల్లో లేని ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు వంద శాతం విద్యార్థుల నమోదు లక్ష్యంగా 'బడి బాట' కార్యక్రమంలో పాల్గొనాలని అందులో పేర్కొన్నారు. అయితే క్షేత్రస్థాయిలో మెజారిటీ ఉపాధ్యాయులు జనగణన విధుల్లోనే ఉండటం, మిగిలిన కొద్ది మందితో బడిబాట కింద ఇంటింటి ప్రచారం, గ్రామసభలు, ర్యాలీలు నిర్వహించడం అసాధ్యంగా మారింది. విద్యావారోత్సవాల పేరుతో జూన్ 19 వరకు ఈ కార్యక్రమాన్ని పొడగించడంతో రెండు పనులను ఎలా సమన్వయం చేయాలో అర్థం కాక ప్రధానోపాధ్యాయులు సైతం తలలు పట్టుకుంటున్నారు.

​క్షేత్రస్థాయిలో 'నరకప్రాయం'.. ఎన్యూమరేటర్ల వెతలు
జనగణన విధుల్లో ఉన్న ఉపాధ్యాయులకు ఎండల కన్నా ఘోరమైన అవమానాలు, ఇబ్బందులు క్షేత్రస్థాయిలో ఎదురవుతున్నాయి. ఉపాధ్యాయులు పడుతున్న బాధలు వర్ణనాతీతంగా ఉన్నాయి. ముఖ్యంగా 'తలుపు తట్టి పిలిస్తే జనం పలకడం లేదు. ఆధార్, ఫోన్ నంబర్లు అడిగితే దొంగల్లా చూస్తూ, రాళ్లతో కొట్టినట్టు కటువుగా మాట్లాడుతున్నారు. మా పిల్లలను మీ ప్రభుత్వ స్కూళ్లలో చేర్పించం' అంటూ మొహం మీదే తలుపులు వేస్తున్నారని ఉపాధ్యాయులు వాపోతున్నారు. ఎండలో కిలోమీటర్ల దూరం నడిచి వెళ్తే సగానికి పైగా ఇండ్లకు తాళాలు దర్శనమిస్తున్నాయి. తెరిచి ఉన్న ఇండ్లలో అద్దెకు ఉండేవారు 'ఓనర్ ఎక్కడో ఉంటారు, మాకేం తెలియదు' అని దాటవేస్తున్నారు. కాగిత రహిత డిజిటల్ జనగణన కోసం ప్రవేశపెట్టిన యాప్లు ఎండ వేడికి సరిగ్గా పనిచేయడం లేదు. ఇండ్ల హద్దులు తెలియక, లోకేషన్ మ్యాప్లు తెలియక ఉపాధ్యాయులు సగం చస్తున్నారు. 'కాలనీల్లో గేటు ముట్టుకుంటే కుక్కలు మీద పడుతున్నాయి, కోతులు కీచుమంటూ వెంటాడుతున్నాయి. మధ్యాహ్నం వేళల్లో కొత్త భాషల్లో తాగుబోతులు మాట్లాడే బూతులు భరించాల్సి వస్తోంది' అంటూ పేరు చెప్పేందుకు ఇష్టపడని ఓ ఉపాధ్యాయురాలు 'నవతెలంగాణ'తో వాపోయారు.

​ముంచుకొస్తున్న ఓటర్ల సవరణ!
కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలోనే 66 డివిజన్లను 666 బ్లాకులుగా విభజించి, ఎన్యూమరేటర్లతో జూన్ 10 వరకు ఈ హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. ఇక రూరల్ ప్రాంతాలు కలిపి మొత్తం 1,893 బ్లాకుల్లో 1,967 మంది ఎన్యూమరేటర్లు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని తిరుగుతున్నారు. ఇదిలా ఉంటే, కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం జూన్ 25 నుంచి జులై 24 వరకు ఓటర్ల జాబితా ప్రత్యేక ప్రక్షాళన కార్యక్రమం ప్రారంభం కానుంది. ఉమ్మడి కరీంనగర్లోని నాలుగు జిల్లాలు జగిత్యాల జిల్లాలో 7,20,803, పెద్దపల్లి జిల్లాలో 7,18,043, రాజన్నసిరిసిల్ల జిల్లాలోని 4,76,604, కరీంనగర్ జిల్లాలో 10,83,365 ఓటర్లు ఉండగా.. మొత్తంగా సుమారు 29.98 లక్షల మంది వరకు ఉన్నారు. ఆ ఓటర్ల ఇండ్లకు వెళ్లి బోగస్, డబుల్ ఓట్లను ఏరివేయడానికి మళ్లీ ఈ ఉపాధ్యాయులనే రంగంలోకి దించనున్నారు. ఒకదాని వెనుక ఒకటిగా వస్తున్న ప్రభుత్వ విధులతో ఉపాధ్యాయులకు సెలవులు లేవు సరికదా, కనీసం మనశ్శాంతి కూడా కరువైంది.

​45 డిగ్రీల ఎండలో తిరగడం కష్టంగా ఉంది
శ్రీనివాస్, సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయుడు, కరీంనగర్ 'ఉదయం 8 గంటలకే ఎండ దంచికొడు తోంది. చేతిలో ఆండ్రాయిడ్ ఫోన్ పట్టుకుని 11 అంకెల సెల్ఫ్ ఎన్యూమరేషన్ ఐడీలు ఎంటర్ చేయాలి.. గూగుల్ లొకేషన్ మార్క్ చేయాలి. హౌస్ మ్యాప్ గీయాలి. ఎండ వేడికి మొబైల్ ఫోన్లు హీటెక్కి స్విచ్ఛాఫ్ అవుతున్నాయి. దీనికి తోడు జనాలు ఇచ్చే సమాధానాలు మనోవేదనకు గురిచేస్తున్నాయి.

మేము ప్రభుత్వ ఉద్యోగులమా, లేక కూలీలమా అనే అనుమానం వస్తోంది.'
​రెండు పడవల ప్రయాణం సాధ్యం కాదు శారద, స్కూల్ అసిస్టెంట్, కరీంనగర్ జనగణనలో 36 రకాల ప్రశ్నలతో కూడిన వివరాలు సేకరించడమే ఒక పెద్ద యజ్ఞం. దీనికి తోడు 'బడి బాట'లో పిల్లలను చేర్పించాలని ప్రచారం చేయాలంటున్నారు. ఒకేసారి రెండు పనులను సమాంతరంగా చేయడం వల్ల ఏ ఒక్కదానికీ న్యాయం జరగదు. అధికారులు సాయంత్రం కాగానే 'ఇంకా అవ్వలేదా?' అంటూ వేధిస్తున్నారు. మానవతా దక్పథంతో ఆలోచించి ఎండ తీవ్రత తగ్గే వరకు ఈ విధుల్లో కొంత సడలింపు ఇవ్వాలి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana