Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
అమ్మ తరువాత..!

అమ్మ తరువాత..!

గోడకున్న అమ్మ ఫొటో తీసి తుడుస్తున్నప్పుడు, ఈసారెందుకో చేతులు బాగా వణికాయి! ఓ కొడుకుగా నాకిదేమీ కొత్త కాదు. ఎప్పటిలానే అమ్మది మరో సంవత్సరికం! కానీ మనసెందుకో పొద్దున లేచిన నుంచి ఈ రోజంతా మనసు అమ్మ చుట్టూనే తిరుగుతుంది!

జీవితంలో కొన్ని ఖాళీలు ఎవరూ పూడ్చలేరు! కొన్ని భారాలు ఎప్పటికీ ఎవరూ దించలేరు! నాన్న కాలం చేసిన పదేళ్ళకు ఉన్నట్టుండి హఠాత్తుగా అమ్మ ఆరోగ్యంగా ఉండగానే కాలం చేసింది! తల్లి అదష్ట వంతురాలో! పిల్లలమో?! ఎవరితో ఏమీ చేయించుకునే అవసరం ఆమెకు పడలేదు! చెయ్యాల్సిన పరిస్థితి మాకూ రాలేదు! ఈ రోజు నాల్గవ సంవత్సరికం! అమ్మ తరువాత ఈ నాల్గేళ్ళలో, చూస్తుండగానే రోజులు ఎంత మారిపోయాయో !! పండగకో పున్నానికో అప్పుడప్పుడు అమ్మని చూడడానికి ఊరొచ్చే తమ్ముడి కాళ్ళకి అమ్మ తరువాత, ఆస్తుల పంపకాల గొలుసులు కట్టేసాయో లేదా అమ్మని కూడా చూడడానికి రావా అని లోకులు కాకులు అయ్యే అవకాశం లేకపోవడం వలనో లేదా మరో కారణమో తెలియదు గాని, తమ్ముడు ఎప్పుడో నల్లపూస అయిపోయాడు! వాడింకా ఇటు రావాలంటే కాలం ఇంట్లో ఏ పెద్ద సందడో తేవాల్సిందేనేమో!! ఎప్పటికప్పుడు వచ్చీ పోయే రైలులా ఉండే చెల్లికి, ఇప్పుడు ఎవరితోనూ పంచుకోలేని బాధని పంచుకోవడానికి అమ్మ లేక పోయేసరికి, ఆ విషయంలో తన కంటూ సొంత స్టేషన్ లేని దానిలా అయిపోయిందేమో! అప్పుడప్పుడు వచ్చినా, అమ్మ అంత ఆప్యాయత దొరకలేదనుకుందేమో, ఈ మధ్య రావడం బాగా తగ్గిపోయింది. ఆడపిల్లకి అమ్మ కాలం చేసిన తరువాత, దాదాపుగా పుట్టిల్లు కూలిపోయినట్టేనేమో కదా! అప్పుడప్పుడూ వచ్చినా, తల దాచుకునేంత లోపలికి రాలేరేమోకదా?! ఎప్పుడో ఏడాదికోసారి, సంక్రాంతికి అమ్మకి చీర తీసివ్వడాని మేనమామ మా ఊరు వచ్చేవాడు. ఎందుకో తెలీదు, బాల్యాన్నంతా మోసుకొస్తాడేమో మామ, అప్పుడు చూడాలి అమ్మ ముఖం, చిన్న పిల్లలా వెలిగి పోయేది! పోతూ పోతూ, వాళ్ళ అమ్మ, నాన్నని గుర్తు చెస్తాడేమో, కళ్ళలో నీళ్ళు తిరిగి పోయేవి అమ్మకి! ఇప్పుడూ సంక్రాంతులు అయితే వస్తున్నాయి గాని, మామే! పండగ రోజు అమ్మని గుర్తు చేసుకొని బాధ పడడం ఎందుకని మర్చి పోయాడో ఏమో, అమ్మకే తెలియాలి!! అమ్మ ఉన్నన్నాళ్ళూ, గుర్తుపెట్టుకొని మరీ మనవరాల్లు, మనవల్ల పుట్టిన రోజు నాడు పొద్దున్నే లేచి గుడికి వెళ్ళి అర్చన చేయించి, ఊరంత చెప్పుకునేది ఈ రోజు మా మనవ(డు)రాల పుట్టిన రోజని. పాపం వాళ్ళకి నాన్నమ్మ సంవత్సరికం తేదీ కూడా గుర్తుందో లేదో! తాతయ్య నాన్నమ్మలు, బతికున్నప్పుడే జ్ఞాపకాలుగా మిగిలిపోతున్న రోజులు ఇవి! ఎవరిని నిందించగలం, ఒక్క మన పెంపకాన్ని తప్ప!! అప్పుడప్పుడు మా పిల్లలకి నేను వాళ్ళ అమ్మని ఏదో అన్నారని, మాత దేవో భవ, పిత దేవో భవ క్లాసులు తీసుకుంటున్నప్పుడు, గోడకు మూలన ఉన్న ఫొటో ఫ్రేములో చిన్నగా అమ్మ నవ్వు తున్నట్టు కనిపిస్తుంది! కాకపోతే నేనే తలెత్తుకొని చూడడానికి సిగ్గు పడతాను! బహుశా లోపం నాలో లోపించిన నిజాయితే కావొచ్చు! అమ్మ చనిపోయిన రోజు వచ్చిన చుట్టాలు బంధువులందరూ, బతికున్నప్పుడు, రోజు కొకరు చొప్పున వచ్చి పలకరించినా, సంవత్సరంలో ఏ ఒక్క రోజూ అమ్మకి 'ఒంటరితనమనే' భావన నాన్న పోయక కలగక పోయుండేదేమో! ఎవరినని నిందించను, నేనూ ఇప్పుడు ఎవరనీ పలకరించడానికి బతికుండగా వెళ్ళడం లేదుగా! స్వర్గంలోనైనా అమ్మ, వాళ్ళ అమ్మ నాన్నలతో ఉందో లేదో?! ఎక్కడో పుట్టి పెరిగి, జీవితాంతం ఇంక ఎక్కడో జీవించి, ఉన్నన్నాళ్ళు తన కోసం కాకుండా, భర్త కోసం, పిల్లలకోసం బతుకంతా అర్పించడం అంటే మాటలా? ఇంత చేసిన 'అమ్మ'కి, స్వర్గంలో వాళ్ళ 'అమ్మ' పక్కన కాసింత చోటు దొరకదా? ఎందుకో ఈ రోజు ఒకదాని తరువాత ఒకటి, ఆలోచనలన్నీ అమ్మ చుట్టే తిరుగుతున్నాయి! నాకు తెలుసు 'అమ్మ ఉంటే అన్నీ ఉన్నట్టే! అమ్మే లేకుంటే ఏమున్నా లేకున్నా ఒకటే!' అయినా ఏదో వెలితి వెంటాడుతునే ఉంది! మరల అమ్మ ఒడికి చేరే వరకు అంతేనేమో!!

తిప్పాన హరి రెడ్డి, 9493832412

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana