Thursday, 29 Jul, 1.51 am నవ తెలంగాణ

రాష్ట్రీయం
అమ్మిన ధాన్యంలోనూ కోతలే

- చిత్తుకాగితంగా రసీదు
- అధికారులూ, రైస్‌మిల్లర్లు చేతివాటం
- 5 నుంచి10 శాతం జమకానీ వైనం
- రూ 1700 కోట్లు నష్టపోయిన అన్నదాత
- గుడిగ రఘు
రైతుకు అన్నీ కష్టాలే. మార్కెట్‌లో ధాన్యం అమ్మిన రసీదుకు విలువలేకుండాపోయింది. దాని ప్రకారం రైతులకు డబ్బు చెల్లించ కుండా కోత పెడుతున్నారు. రైతును దగా చేస్తున్నారు. ముఖ్యంగా అధికారులు, రైస్‌మిల్లర్లు కుమ్మక్కై తమ చేతివాటం ప్రదర్శిస్తున్నారు. రసీదు చూపించినా, దాంట్లోనుంచి 5 నుంచి 10శాతాన్ని నొక్కేస్తు న్నారు. ఇలాంటి అక్రమాలతో రూ 1700 కోట్లు రైతన్నలు నష్టపో యారు. ఒకవైపు ప్రకృతి వైఫరీత్యాలు, మరోవైపు ప్రభుత్వాల నిస్సా యత వెరసీ రైతులు కష్టాల ఊబిలో కొట్టుమిట్టాడుతున్నారు. దుక్కి దున్నింది మొదలు...ధాన్యం అమ్ముకునే దాకా రైతుకు ఇబ్బందులు తప్పడం లేదు. ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికొచ్చాక దాన్ని అమ్ముకోవడం కూడా పెనుభారంగా మారింది. ధాన్యం అమ్ముకునేందుకు రైతు ఎన్నో ప్రయాసలకోర్చాల్సి వస్తున్నది. ధాన్యం మార్కెట్‌కు తీసుకెళ్లాక వడ్లు పచ్చిగా ఉన్నాయి. తాలు, మట్టి పెళ్లలు ఎక్కువగా ఉన్నాయి. వడ్లను ఆరబోయాలంటూ షరతు విధిస్తు న్నారు. 44 కేజీల బస్తాలో నాలుగైదు కేజీల తరుగు తీస్తామంటూ రెండో షరతు పెడతారు. సుదూర ప్రాంతం నుంచి ప్రయాణించి మార్కెట్‌కు వచ్చిన రైతుకు రాగానే ఇలాంటి చేదు అనుభవం ఎదురవుతున్నది. రవాణా ఖర్చులు, ఆరబెట్టానికి స్థలం ఉండదు. చినుకులు పడితే టార్ఫాలిన్‌ కవర్లు ఉండవు. రెండు రోజులపాటు రైతులు ఉండాలంటే సరైన సౌకర్యాలు ఉండవు.దీంతో రైతు పరిస్థితి అడకత్తెరలో పోక చెక్క మాదిరిగా తయారైంది. వీటన్నింటిని తట్టుకుని ధాన్యం అమ్ముకుని రసీదు పొందినా, దాని ప్రకారం రైతు ఖాతాల్లో డబ్బు జమ అవుతుందనే గ్యారంటీ లేదు. అందులో ఐదుశాతం నుంచి 10శాతం వరకు కోతలుపెడుతున్నట్టు తెలంగాణరైతు సంఘం వెలుగులోకి తీసుకొచ్చింది. ఇప్పటికే రైతులకు జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించింది.
అవాక్కయిన రైతులు
మార్కెట్లో వడ్లు అమ్మినం. బ్యాంకు అకౌంట్లో డబ్బులు పడతాయనే రైతుల ఆశలు గల్లంతయ్యాయి. తమ ఖాతాల్లో డబ్బులు చూసుకుని అవాక్కయ్యారు. కొత్తగూడెం జిల్లాలో రైతులు అమ్మిన ధాన్యానికి డబ్బులు జమ కాలేదు. అధికారులు, రైస్‌మిల్లర్లు కుమ్మక్కై ధాన్యానికి నిధుల చెల్లింపులో కోతలు పెట్టారు. ఈ లెక్కన ఆ జిల్లా రైతులు రూ 13కోట్లు నష్టపోయారని రైతు సంఘం పేర్కొంది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా కోతలు విధించినట్టు వెలుగులోకి వచ్చింది.
కొనుగోళ్లపై పర్యవేక్షణేది?
రాష్ట్ర ప్రభుత్వం ఇందిరా క్రాంతి పథకం(ఐకేపీ), సహకార సంఘాల ద్వారా ధాన్యం కొనుగోలు చేస్తున్నది. రాష్ట్రంలో యాసంగిలో రికార్డు స్థాయిలో ధాన్యం వచ్చింది. 52 లక్షల ఎకరాల్లో వరి సాగైంది. దీంతో 1.32 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యంఉత్పత్తి అయింది. అందులో 93 లక్షల టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం సేకరించింది. క్వింటా రూ 1885 చొప్పున రైతులకు రూ 17వేల కోట్లు ప్రభుత్వం చెల్లించింది. అందులోనూ రూ 1700 కోట్లు రైతులకు ఖాతాల్లో జమ కాలేదు. పెద్ద ఎత్తున అక్రమాలు జరిగినట్టు విమర్శలొస్తున్నాయి. మరోవైపు తరుగులు, తాలు పేరుతోనూ రైతుకు చుక్కలు చూపిస్తున్నారు. అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో ఇష్టానుసారం వ్యవహరిస్తున్నాయి.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Navatelangana
Top