Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
అ'నిర్ధారిత` భాష

అ'నిర్ధారిత` భాష

దేశ యువకులను, సమాచార హక్కు కార్యకర్తలను 'బొద్దింకలు, పరాన్న జీవులు' అని అభివర్ణించారు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి. మరుసటి రోజు ఆయన వివరణ ఇచ్చినప్పటికీ…ఆయన మాటలు జనం మదిలోంచి చెరిగిపోయే అవకాశం లేదు.

అంతటి అత్యున్నత న్యాయపీఠంపై ఉన్న వ్యక్తి నుంచి ఇలాంటి చౌకబారు మాటలు అసలు ఊహించలేం. ఆ విపరీత వ్యాఖ్యలకు శుక్రవారం సుప్రీంకోర్టు మౌనసాక్ష్యంగా నిలిచింది. దేశ భవిష్యత్తుకు వెన్నెముకగా నిలిచే యువతను, వారి హక్కుల కోసం పోరాడే శక్తులను అత్యున్నత పీఠాలపై కూర్చున్నవారు చూసే విధానానికి ఈ మధ్యకాలంలో వస్తున్న ఇలాంటి వ్యాఖ్యలే నిదర్శనం. ఒక న్యాయవాది తనకు సీనియర్ న్యాయవాదిగా గుర్తింపు ఇవ్వకపోవడాన్నికి ప్రశ్నిస్తూ దాఖలు చేసిన పిటిషన్ ప్రస్తావనకు వచ్చినప్పుడు సీజేఐ వ్యవస్థ మీద నోరు పారేసుకున్నారు.

'ఏ ఉద్యోగమూ దొరకని బొద్దింకల్లాంటి యువకులు ఉన్నారు. వీరిలో కొందరు మీడియాలో దూరతారు. కొంతమంది సామాజిక మాధ్యమాలలో ఏవో రాస్తుంటారు. కొందరు సమాచారహక్కు (ఆర్టీఐ)కార్యకర్తల అవతారం ఎత్తుతారు. వారు అందరినీ తప్పు పడ్తుంటారు' అని ప్రశ్నించే వారందరినీ బొద్దింకలు అనేశారు. ప్రజాస్వామ్యానికి రక్షణ కవచంగా ఉండాల్సిన న్యాయవ్యవస్థ ఉన్నత పీఠాలపై కూర్చున్న కొందరు వ్యక్తులు, పెట్టుబడిదారీ వర్గాల భాషను, ఫ్యూడల్ అహంకారాన్ని ప్రదర్శించడం దేశంలో పెరుగుతున్న సామాజిక అసమానతలకు, అణచివేత ధోరణికి అద్దం పడుతోంది. వీరు ఉపయోగించే భాష, చేసే వ్యాఖ్యలు కేవలం వ్యక్తిగత అభిప్రాయాలుగా మిగిలిపోవు.

అవి సమాజంపై, ముఖ్యంగా దేశ భవిష్యత్తును నిర్ణయించే యువతరంపై తీవ్ర ప్రభావం చూపుతాయి. చారిత్రకంగా శ్రామికవర్గం, విద్యార్థి లోకం, యువత సాగించే పోరాటాలను అణచివేయడానికి పాలకవర్గాలు ఎప్పుడూ ఒక నిర్ధారితమైన భాషను, అణచివేత ధోరణిని ఉపయోగిస్తూనే ఉంటాయి. నేడు దేశంలో నిరుద్యోగం రికార్డు స్థాయికి చేరింది. చదువుకున్న యువతకు ఉపాధి లేదు, కార్మిక చట్టాలు నీరుగారిపోతున్నాయి, విద్యావ్యవస్థ వ్యాపారీకరణ చెందుతోంది. ఇలాంటి సంక్షోభ సమయాల్లో యువత వీధుల్లోకి వచ్చి తమ హక్కుల కోసం, ఉపాధి కోసం, ప్రజాస్వామ్య రక్షణ కోసం గొంత్తెత్తుతోంది. యువత ఎదుర్కొంటున్న ఆర్థిక, సామాజిక సంక్షోభాలకు పరిష్కారం చూపాల్సింది పోయి, వారి ఆవేదనలను, నిరసనలను క్రమశిక్షణా రాహిత్యంగా ప్రధాన న్యాయమూర్తి చిత్రీకరించడం ఎంత శోచనీయం! సమాజంలో వ్యవస్థను ప్రశ్నించేవారిని అమానవీయమైన పదాలతో సంబోధించడం అనేది ప్రజాస్వామ్య స్ఫూర్తికే విరుద్ధం.

'భారత ప్రజలకు సమాచార హక్కు అనేది పార్లమెంటు ఉదారంగా ఇచ్చిన వరం కాదు. అది రాజ్యాంగం కల్పించిన భరోసా' అని సుప్రీంకోర్టే గతంలో చరిత్రాత్మక తీర్పులు వెలువరించింది. కానీ, నేడు రాజ్యాంగాన్ని గౌరవిస్తూ…చట్టాన్ని అమలు చేయాల్సిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తే సమాచార హక్కు కార్యకర్తలపై వ్యాఖ్యలు చేయడాన్ని ఏమనాలి? ఈ వాస్తవిక పరిస్థితుల్లో సమాచార హక్కు నీరుగారిపోతోందా? అనే సందేహాలు తలెత్తుతున్నాయి. పౌరుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే హక్కు ఏ వ్యవస్థకూ లేదు. కోర్టుల్లో ప్రజాస్వామిక విలువలు, కార్మిక-శ్రామిక వర్గాల పట్ల గౌరవం పెంపొందేలా తగిన సంస్కరణలు చేపట్టాలి. అహంకార పూరిత వ్యాఖ్యలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి.

భారత న్యాయవ్యవస్థ తక్షణమే ఈ ఫ్యూడల్ మనస్తత్వం నుండి బయటపడాలి. న్యాయమూర్తులు తాము పాలకులం కాదని, రాజ్యాంగానికి లోబడి పనిచేసే సేవకులమని గుర్తించాలి. వ్యవస్థలో లోపాలు ఉన్నప్పుడు వాటిని సరిదిద్దడానికి విమర్శలు అవసరమే కావచ్చు, కానీ ఆ విమర్శ యువతను సన్మార్గంలో పెట్టేలా, వారిని ప్రోత్సహించేలా ఉండాలి కానీ వారి ఆత్మగౌరవాన్ని, సామాజిక స్పృహను దెబ్బతీసేలా ఉండకూడదు. యువతరం తమ హక్కుల కోసం పోరాడుతున్నప్పుడు, వారిని అభినందించాల్సింది పోయి అవమానించడం అంటే వ్యవస్థ తన సొంత భవిష్యత్తును తాను తిరస్కరించుకోవడమే. న్యాయవ్యవస్థ అయినా, కార్యనిర్వాహక వ్యవస్థ అయినా రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛను, సమానత్వాన్ని కాపాడాలి. యువతను కించపరిచే విధంగా, వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా సాగే ఎలాంటి వ్యాఖ్యలైనా ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు వంటివి.

యువతరం అనేది ఒక దేశానికి కేవలం జనాభా మాత్రమే కాదు, అది ఆ దేశ ప్రగతికి చోదక శక్తి. ఈ సమాజాన్ని నడిపించే చైతన్య రథసారథులు. చరిత్రలో ఏ విప్లవమైనా, మార్పైనా యువతరం త్యాగాలు, పోరాటాల ద్వారానే సాధ్యపడింది. పాలకుల, ఉన్నతాధికారుల అహంకారపూరిత వ్యాఖ్యలు యువత చైతన్యాన్ని ఆపలేవు. ఇప్పటికైనా పాలకవర్గాలు తమ శైలిని మార్చుకుని, యువతకు కావలసిన ఉపాధి, హక్కులు, గౌరవాన్ని అందించడంపై దృష్టి పెట్టాలి. యువతను కేవలం ఒక 'సమస్య'గా చూడటం మానేసి, వారిని దేశ నిర్మాణంలో భాగస్వాములను చేయడమే నేటి అవసరం. అత్యున్నత స్థానాల్లో ఉన్నవారు యువత ఆవేదనను, వారి నిరసనల్లోని న్యాయాన్ని అర్థం చేసుకుని, మరింత సంయమనంతో, గౌరవప్రదమైన భాషతో సంబోధించినప్పుడే ప్రజాస్వామ్య విలువలు కాపాడబడతాయి. యువతను కించపరిచేలా సాగే ఎలాంటి వ్యాఖ్యలైనా ఆధునిక ప్రజాస్వామ్య సమాజంలో ఎంతమాత్రం సమర్థనీయం కావు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana