Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
అణుశక్తిపై దూకుడు.. వ్యర్థాల నిర్వహణపై మౌనం

అణుశక్తిపై దూకుడు.. వ్యర్థాల నిర్వహణపై మౌనం

శాశ్వత నిల్వ వ్యవస్థపై వెల్లువెత్తుతున్న ప్రశ్నలుపూర్తి సమాచారం అందించకుండానే ముందుకు!
కేంద్రంలోని మోడీ సర్కారు తీరు
ప్రతి మెగావాట్కు ఏటా 0.15 క్యూబిక్ మీటర్ల రేడియోధార్మిక ఘన వ్యర్థం

పర్యావరణవేత్తలు, నిపుణుల ఆందోళన

​న్యూఢిల్లీ : దేశంలో అణుశక్తి ఉత్పత్తిని భారీగా పెంచాలని మోడీ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నది. అయితే ఈ ప్రక్రియలో ఏర్పడే రేడియోధార్మిక వ్యర్థాల సురక్షిత నిర్వహణపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అణు విద్యుత్ను పరిశుభ్రమైన ఇంధనంగా ప్రచారం చేస్తున్న కేంద్రం.. దాని వల్ల ఉత్పత్తయ్యే ప్రమాదకర వ్యర్థాల దీర్ఘకాల నిర్వహణ, భద్రత, పారదర్శకతపై ప్రజలకు తగిన స్థాయిలో సమాచారం అందించడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పార్లమెంట్లో అణుశక్తి శాఖ వెల్లడించిన వివరాలు దేశంలో అణు వ్యర్థాల పరిమాణం, వాటి నిర్వహణపై మరోసారి చర్చకు దారితీశాయి.

​పరిమిత సమాచారమే!
కేంద్ర అణుశక్తి శాఖ (డీఏఈ) పార్లమెంట్లో తెలిపిన వివరాల ప్రకారం… దేశంలోని అణు విద్యుత్ కేంద్రాలు ప్రతి మెగావాట్ విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యానికి సంవత్సరానికి సగటున 0.15 క్యూబిక్ మీటర్ల (దాదాపు 150 లీటర్లు) రేడియోధార్మిక ఘన వ్యర్థాన్ని ఉత్పత్తి చేస్తున్నాయి. ఇందులో ప్లాంట్లు పనిచేసే సమయంలోనూ, వాటి సేవా కాలం పూర్తయిన తర్వాత వాటిని తొలగించే డీకమీషనింగ్ ప్రక్రియలోనూ ఏర్పడే వ్యర్థాలు ఉంటాయి. ఈ వ్యర్థాల వివరాలను అటామిక్ ఎనర్జీ రెగ్యులేటరీ బోర్డు (ఏఈఆర్బీ) వద్ద నమోదు చేస్తున్నామని ప్రభుత్వం తెలిపినప్పటికీ… వాటి భద్రత, పర్యావరణ ప్రభావంపై ప్రజలకు అందుబాటులో ఉండే సమాచారం పరిమితంగానే ఉందని నిపుణులు సూచిస్తున్నారు.

​శాశ్వత వ్యర్థాల నిర్వహణపై స్పష్టత కరువు
ఫిన్లాండ్ ఇప్పటికే భూమికి 430 మీటర్ల లోతులో 'ఒంకాలో' పేరుతో ప్రపంచంలోనే తొలి శాశ్వత అణు వ్యర్థాల నిల్వ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. అమెరికా కూడా వినియోగించిన ఇంధనాన్ని ప్రత్యేక కూలింగ్ పూల్స్, డ్రై క్యాస్క్లలో భద్రపరుస్తోంది. భారత్ మాత్రం అణుశక్తి విస్తరణను వేగవంతం చేస్తున్నప్పటికీ.. శాశ్వత వ్యర్థాల నిర్వహణపై భవిష్యత్ కార్యాచరణను మరింత స్పష్టంగా ప్రజల ముందుంచాల్సిన అవసరం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

​ప్రజల్లో విశ్వాసం కల్పించాలి
విద్యుత్ ఉత్పత్తి పెంపుపై మాత్రమే కాకుండా.. రేడియోధార్మిక వ్యర్థాల భద్రత, పర్యావరణ పరిరక్షణ, ప్రజారోగ్యంపై దీర్ఘకాల ప్రభావాలను కూడా సమాన ప్రాధాన్యంతో పరిగణించాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని పర్యావరణవేత్తలు అంటున్నారు. అణుశక్తి విస్తరణ విజయవంతం కావాలంటే విద్యుత్ ఉత్పత్తి మాత్రమే కాదనీ, వ్యర్థాల నిర్వహణలోనూ పూర్తి పారదర్శకత, శాస్త్రీయ ప్రమాణాలు, ప్రజల విశ్వాసం అత్యంత కీలకమని వారు సూచిస్తున్నారు.

సవాలుగా రేడియోధార్మిక వ్యర్థాల నిల్వ
​అణు విద్యుత్ కేంద్రాల్లో వాయు, ద్రవ, ఘన రూపాల్లో రేడియోధార్మిక వ్యర్థాలు ఉత్పత్తి అవుతాయి. వాయు, ద్రవ వ్యర్థాలను ప్రత్యేక శుద్ధి అనంతరం నియంత్రణ ప్రమాణాల మేరకు విడుదల చేస్తామనీ, ఘన వ్యర్థాలను రాతి గోడల కందకాలు, బలమైన కాంక్రీట్ నిర్మాణాలు వంటి ప్రత్యేక సౌకర్యాల్లో నిల్వ చేస్తామని ప్రభుత్వం తెలిపింది. అయితే దేశంలో అణుశక్తి సామర్థ్యాన్ని వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో… ఈ వ్యర్థాల శాశ్వత నిర్వహణకు ఎంత మేర సిద్ధంగా ఉన్నామనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ప్రస్తుతం భారత్ వినియోగించిన అణు ఇంధనాన్ని రీప్రాసెసింగ్ చేసి యురేనియం, ప్లూటోనియంను తిరిగి వినియోగించే విధానాన్ని అనుసరిస్తున్నప్పటికీ.. మిగిలిపోయే అధిక రేడియోధార్మిక వ్యర్థాల నిల్వ దీర్ఘకాల సవాలుగానే మిగులుతోందని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana