Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
అసంపూర్తిగా ఫ్లైఓవర్ అప్రోచ్ పనులు..

అసంపూర్తిగా ఫ్లైఓవర్ అప్రోచ్ పనులు..

భారీ గుంతతో పోంచిఉన్న ప్రమాదంనవతెలంగాణ-సిర్పూర్ (టి )

కాగజ్నగర్-సిర్పూర్ ప్రధాన రహదారిలో నిర్మాణంలో ఉన్న రైల్వే ఓవర్బ్రిడ్జి (ఆర్ఓబీ) అప్రోచ్ వర్క్ ఇప్పటికీ పూర్తి కాలేదు.

రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి-భీమన్న గుడి మధ్య మార్గంలోని రహదారిపై భారీ గుంత ఏర్పడి ప్రమాదాలకు నిలయంగా మారింది. ఇటీవల కురుస్తున్న వర్షాలతో గుంతలో నీరు నిల్వ ఉండటంతో దాని లోతు కనిపించకుండా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఈ రహదారి తెలంగాణ-మహారాష్ట్రను అనుసంధానించే ప్రధాన మార్గం కావడంతో ప్రతిరోజూ ఇతర రాష్ట్రాల నుంచి భారీ లోడుతో కూడిన లారీలు, ట్రక్కులు, బస్సులు, ఇతర వాహనాల రాకపోకలు అధికంగా కొనసాగుతున్నాయి. వర్షాకాలంలో భారీ వాహనాల రాకపోకలతో గుంత మరింత విస్తరించి ఎప్పుడైనా ఘోర ప్రమాదం సంభవించే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ముఖ్యంగా ద్విచక్రవాహనదారులు, ఆటో డ్రైవర్లు గుంతను తప్పించుకునే క్రమంలో ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ప్రయాణిస్తున్నారు. రాత్రి వేళల్లో, వర్షం సమయంలో గుంత కనిపించకపోవడంతో ప్రమాద ముప్పు మరింత పెరుగుతోందని వాహనదారులు వాపోతున్నారు.

గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో రైల్వే ఓవర్బ్రిడ్జి నిర్మాణ పనులు చేపట్టినప్పటికీ, అప్రోచ్ వర్క్ మాత్రం పూర్తికాలేదు. సదరు కాంట్రాక్టర్కు బిల్లులు చెల్లింపులు జరగకపోవడంతో అప్రోచ్ పనులు అసంపూర్తిగానే నిలిచిపోయాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో రహదారి పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాకపోవడంతో నేడు ప్రజలు, వాహనదారులు నిత్యం ప్రమాదకర పరిస్థితులను ఎదుర్కొంటున్నారు.

ప్రస్తుతం అధికారంలో ఉన్న ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుని నిలిచిపోయిన రైల్వే ఓవర్బ్రిడ్జి అప్రోచ్ వర్క్ను తక్షణమే పూర్తి చేయడంతో పాటు, ఫ్లైఓవర్ బ్రిడ్జి-భీమన్న గుడి మధ్య ఏర్పడిన భారీ గుంతను వెంటనే పూడ్చి రహదారిని మరమ్మతు చేయాలని ప్రజలు కోరుతున్నారు. అలాగే ఈ సమస్యపై సంబంధిత శాఖ అధికారులు తక్షణమే స్పందించి శాశ్వత పరిష్కారం చూపాలని, ప్రమాదం జరిగే వరకు వేచి చూడకుండా ముందస్తు చర్యలు చేపట్టి ప్రజల ప్రాణాలను కాపాడాలని ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana