Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
అశ్వారావుపేటలో బాలికలదే పైచేయి

అశ్వారావుపేటలో బాలికలదే పైచేయి

- పదోతరగతి ఫలితాల్లో మెరిసిన విద్యార్థినులునవతెలంగాణ - అశ్వారావుపేట

శ్వారావుపేట మండలంలో 2026 ఏప్రిల్ నెలలో వెలువడిన పదో తరగతి ఫలితాల్లో బాలికలు స్పష్టమైన ఆధిక్యాన్ని చాటారు.

మండల వ్యాప్తంగా పలు యాజమాన్యాలకు చెందిన 23 ఉన్నత పాఠశాలల నుంచి పరీక్షలకు హాజరైన 703 మంది విద్యార్థుల్లో 696 మంది ఉత్తీర్ణత సాధించగా, కేవలం 7 మంది మాత్రమే అనుత్తీర్ణులయ్యారు. ఈ 7 మంది కూడా బాలికలే కావడం గమనార్హం. మండల మొత్తం ఉత్తీర్ణత శాతం 99.84గా నమోదై విద్యా ప్రగతికి అద్దం పట్టింది.

మండల వ్యాప్తంగా పరీక్షలకు హాజరైన వారిలో 320 మంది బాలురు, 383 మంది బాలికలు ఉన్నారు. ఉత్తీర్ణులలో 320 మంది బాలురు కాగా, 376 మంది బాలికలు ఉత్తీర్ణత సాధించారు. బాలుర ఉత్తీర్ణత శాతం 100 శాతం నమోదు కాగా, బాలికల ఉత్తీర్ణత శాతం 97 శాతంగా నిలిచింది. అయినప్పటికీ సంఖ్యాపరంగా బాలికలే అధికంగా ఉండటం, మెరుగైన ప్రతిభ కనబరచడం ప్రత్యేకతగా నిలిచింది.

ప్రభుత్వ పాఠశాలల విభాగంలో మొత్తం 236 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరై 233 మంది ఉత్తీర్ణులయ్యారు.ఇందులో 3 మంది మాత్రమే అనుత్తీర్ణులయ్యారు. ఏడు ఆశ్రమ ఉన్నత పాఠశాలల నుంచి 184 మంది హాజరై 180 మంది ఉత్తీర్ణులై 99 శాతం ఫలితాన్ని నమోదు చేశాయి. గురుకుల పాఠశాలలు శాతం 100 ఫలితంతో ఆదర్శంగా నిలిచాయి. ప్రైవేట్ పాఠశాలల నుంచి పరీక్షలకు హాజరైన 129 మంది విద్యార్థులందరూ ఉత్తీర్ణత సాధించి 100 శాతం ఫలితాన్ని నమోదు చేశారు.

మండలంలోని పాఠశాలల వారీగా పరిశీలిస్తే అనేక పాఠశాలలు శాతం 100 ఫలితాలు సాధించాయి. ముఖ్యంగా జడ్పీహెచ్ఎస్ అశ్వారావుపేట (బాలురు), జడ్పీహెచ్ఎస్ గుమ్మడవల్లి, జడ్పీహెచ్ఎస్ నారాయణపురం, ఏహెచ్ఎస్ పీవీ ప్రాజెక్ట్, ఏహెచ్ఎస్ సున్నంబట్టి,ఎంజేపీటిబిసి గురుకులం (బాలురు, బాలికలు), టీఎంఆర్ఐఈఎస్ బాలికల పాఠశాల, గుడ్ న్యూస్ స్కూల్, జవహర్ స్కూల్, గౌతమి స్కూల్, సూర్య స్కూల్లు 100 శాతం ఫలితాలు సాధించి ప్రత్యేక గుర్తింపు పొందాయి.

ఈ ఏడాది 500 కు పైగా మార్కులు సాధించిన విద్యార్థులు 19 మంది ఉండటం మండల విద్యా ప్రమాణాలను ప్రతిబింబిస్తోంది. వీరిలో జడ్పీహెచ్ఎస్ అశ్వారావుపేట (బాలురు)కి చెందిన డి. సహస్ర 556 మార్కులతో ప్రభుత్వ పాఠశాలల విభాగంలో ప్రతిభ కనబరిచింది. ఏహెచ్ఎస్ పీవీ ప్రాజెక్ట్ కు చెందిన ఎన్. బాల తరుణ్ 528 మార్కులు, ఎంజేపీటిబిసి గురుకులం బాలుర విభాగానికి చెందిన ఎం.ఎం సాయి కుమార్ 561 మార్కులు, టీఎంఆర్ఐఈఎస్ బాలికల పాఠశాలకు చెందిన ఎస్.కే బహేరా 569 మార్కులతో ప్రతిభ చాటారు.

ప్రైవేట్ పాఠశాలల్లో జవహర్ స్కూల్ కు చెందిన ఎం. కాత్యాయని 574 మార్కులతో అత్యధిక మార్కులు సాధించింది. మండలంలో మొత్తం ఫలితాలు విశేషంగా రావడం పట్ల మండల విద్యాశాఖ అధికారి (ఎంఈఓ) ప్రసాదరావు హర్షం వ్యక్తం చేశారు. ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను, కృషి చేసిన ప్రధానోపాధ్యాయులను, ఉపాధ్యాయులను అభినందించారు. విద్యార్థుల విజయంలో తల్లిదండ్రుల సహకారం, ఉపాధ్యాయుల కృషి, విద్యార్థుల పట్టుదల ప్రధాన పాత్ర పోషించాయని పేర్కొన్నారు.

అశ్వారావుపేట మండలంలో ఈ ఏడాది పదో తరగతి ఫలితాలు విద్యా ప్రమాణాలు మెరుగుపడుతున్నాయనే విషయాన్ని మరోసారి రుజువు చేశాయి. ముఖ్యంగా బాలికలు సంఖ్య లోనూ, ప్రతిభ లోనూ ముందంజలో నిలవడం ఈ ఫలితాల ప్రత్యేకతగా నిలిచింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana