Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
అట్టుడికిన పార్లమెంట్

అట్టుడికిన పార్లమెంట్

భ లోపలా బయటా ప్రతిపక్షాల ఆందోళనమహాత్మా గాంధీ విగ్రహం నుంచి మకర ద్వార్ వరకు మార్చ్
'అమిత్ షా దాక్కోవద్దు… పార్లమెంటులో సమాధానం చెప్పాలి' అంటూ ప్లకార్డులు

విద్యార్థుల పట్ల అమానుషంగా ప్రవర్తించినందు వల్లే ముఖం చాటేశారు : రాహుల్ గాంధీ
అమిత్ షా సభకు ఎందుకు రావడం లేదు : మల్లికార్జున ఖర్గే

నవతెలంగాణ - న్యూ ఢిల్లీ బ్యూరో
అయోధ్య రామమందిరం విరాళాల చోరీ, విద్యార్థులపై ఢిల్లీ పోలీసుల దాడిపై కేంద్ర హోం మంత్రి సమాధానం చెప్పాలని ప్రతిపక్షాలు చేపట్టిన ఆందోళనతో పార్లమెంట్ అట్టుడికింది. బుధవారం పార్లమెంట్ ఉభయ సభల్లోనూ, పార్లమెంట్ ఆవరణలోనూ ప్రతిపక్షాల ఆందోళన జరిగింది. పార్లమెంట్ ఆవరణలో ప్రతిపక్ష పార్టీల ఎంపీలు ప్రేరణా స్థల్లోని మహాత్మా గాంధీ విగ్రహం నుంచి మకర ద్వార్ వరకు మార్చ్ చేపట్టారు. 'దాక్కోవద్దు.. పార్లమెంటులో సమాధానం చెప్పండి' అంటూ కేంద్ర హోం మంత్రి అమిత్ షాకి వ్యతిరేకంగా ప్లకార్డులు చేబూని నినాదాల హోరెత్తించారు. ''విద్యార్థుల పట్ల అమానుషంగా ప్రవర్తించినందు వల్లే హోం మంత్రి ముఖం దాక్కుంటున్నారు'' అని లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ విమర్శించారు. విద్యార్థులపై పోలీసుల దురాగతాల పట్ల హోం మంత్రి అమిత్ షా ప్రకటన, రామ మందిర విరాళాల దుర్వినియోగంపై చర్చ, జమ్మూ కాశ్మీర్కు రాష్ట్ర హోదా కల్పించాలని డిమాండ్ చేశారు. రాజ్యసభ ప్రతిపక్షనేత మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ అమిత్ షా సభకు ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు.

'వారు పార్లమెంటును అగౌరవపరుస్తున్నారు. ఇన్ని రోజులు గడిచినా వారు సభలోకి అడుగు పెట్టడం లేదు. సభకు వచ్చి ప్రకటన ఇవ్వడంలో సమస్య ఏమిటి?' అని ప్రశ్నించారు. అమిత్ షా చెవిటివారా, మూగవారా? అని ప్రశ్నించారు. మరోవైపు బుధవారం కూడా ప్రతిపక్షాల ఆందోళనతో పార్లమెంట్ ఉభయ సభలు వాయిదాల పర్వం తొక్కాయి. రెండు సభల్లో ప్రతిపక్ష ఎంపీలు వెల్లోకి దూసుకెళ్లి ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా లోక్సభలో రామ మందిర విరాళాల కుంభకోణంపై నిరసన తెలిపిన ప్రతిపక్ష పార్టీలపై పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్, సీపీఐ, సమాజ్వాదీ పార్టీలు ఎల్లప్పుడూ శ్రీరాముడిని వ్యతిరేకిస్తున్నాయని, పార్లమెంట్ ప్రాంగణంలో వారు ప్రదర్శించిన 'చందా చోరీ' స్కిట్ ప్రజల మనోభావాలను దెబ్బతీసిందని ఆయన పేర్కొన్నారు. అంతేకాకుండా, సభ సజావుగా పనిచేయడాన్ని ప్రతిపక్షం కోరుకోవడం లేదని ఆరోపించారు. ''కేసీ వేణుగోపాల్ మంచి మనిషే, కానీ ఆయన తన పార్టీ సభ్యులకు మర్యాద పాటించాలని అర్థమయ్యేలా చెప్పలేకపోతు న్నారు'' అని అన్నారు. ప్రభుత్వం చర్చకు సిద్ధంగా ఉందని తెలిపారు. అయితే కేంద్ర మంత్రి ప్రకటనపై ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ప్రభుత్వమే సభను నిర్వహించేందుకు సిద్ధంగా లేదని, ప్రధాని మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా పార్లమెంట్కు హాజరు కావడం లేదని అన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana