Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
బాలల రోడ్డు భద్రతపై ప్రత్యేక భేటీ

బాలల రోడ్డు భద్రతపై ప్రత్యేక భేటీ

2030కి కార్యాచరణ ప్రణాళిక• సురక్ష‍ిత పాఠశాల జోన్లు,
ప్రజల భాగస్వామ్యంపై దృష్టి
• పలు నిర్ణయాలు

నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్

పిల్లలు , యుక్తవయస్కులను రోడ్డు ప్రమాదాల నుంచి రక్షించేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. రవాణా శాఖ ఆధ్వర్యంలో 'రోడ్ సేఫ్టీ యాక్షన్ ప్లాన్ ఫర్ చిల్డ్రన్ 2030' పై రాష్ట్ర స్థాయి తొలి సంప్రదింపుల సమావేశం బుధవారం హైదరాబాద్లో నిర్వహించారు. బాలల రోడ్డు భద్రత కార్యాచరణ ప్రణాళిక రూపకల్పనకు తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా తొలి ప్రయత్నం చేసింది. ఈ సమావేశానికి తెలంగాణ రవాణా కమిషనర్ కె. ఇలంబరితి అధ్యక్షత వహించారు. పీహెచ్ఎఫ్ఐ-ఐపీహెచ్ఎస్ డిమ్డ్ యూనివర్సిటీ , యూనిసెఫ్ సంయుక్త సహకారంతో నిర్వహించిన ఈ సమావేశంలో రవాణా, పోలీస్, విద్య, వైద్య ఆరోగ్య, మున్సిపల్ పరిపాలన, రోడ్లు , భవనాలు, హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ, ఎన్హెచ్ఏఐ విద్యా సంస్థలు, పౌర సమాజ సంస్థల ప్రతినిధులు పాల్గొని బాలల రోడ్డు భద్రతపై సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపకల్పనకు చర్చోపచర్చలు నిర్వహించారు. ప్రపంచవ్యాప్తంగానేగాక భారతదేశంలో కూడా పిల్లలు, యుక్తవయస్కులలో మరణాలు వికలాంగులు కావడానికి ప్రధాన కారణాలలో రోడ్డు ప్రమాదాలు ప్రధానంగా ఉన్నాయి. ​పీహెచ్ఎఫ్ఐ-ఐపీహెచ్ఎస్ డిమ్డ్ యూనివర్సిటీ కార్యనిర్వాహక వైస్ ఛాన్సలర్ డా. ఎం. విష్ణువర్ధనరావు మాట్లాడుతూ పిల్లల రోడ్డు భద్రత లక్ష్యాలను సాధించడంలో బహుళ విభాగాల భాగస్వామ్యం ఎంతో కీలకమని పేర్కొన్నారు.

యూనిసెఫ్ ఆంధ్రప్రదేశ్, కర్నాటక, తెలంగాణ ఫీల్డ్ ఆఫీస్ చీఫ్ డా. జెలలెం బి. టాఫెస్సే మాట్లాడుతూ 'ప్రతి చిన్నారికి సురక్షిత ప్రయాణం హక్కుగా లభించాలి. వీరి ప్రయాణం తెలంగాణ భవిష్యత్తులో పెట్టుబడిగా భావించాలి. బాలల కేంద్రిత రోడ్డు భద్రత ప్రణాళిక, అమలులో తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలిచే సామర్థ్యం కలిగి ఉంది' అని అన్నారు. ఈ సమావేశంలో పాల్గొన్న నిపుణులు పిల్లలకు సురక్షితమైన రహదారులు అందరికీ సురక్షిత సమాజాన్ని నిర్మిస్తాయని అభిప్రాయపడ్డారు. రోడ్డు భద్రతను సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ , 2021-2030 ఐక్యరాజ్యసమితి రోడ్డు భద్రత దశాబ్ద కార్యాచరణ లక్ష్యాలతో అనుసంధానిస్తూ, రోడ్డు ప్రమాద మరణాలు గాయాలను 50 శాతం తగ్గించడమే లక్ష్యమని వివరించారు. ​సాంకేతిక ప్రదర్శనలో భాగంగా నిమ్హాన్సన్స్కు చెందిన డా. గౌతమ్ సుకుమార్ మాట్లాడుతూ పిల్లల రోడ్డు ప్రమాదాలను తగ్గించడంలో ప్రభావవంతమైన జాతీయ , అంతర్జాతీయ జోక్యాలపై వివరించారు. మాజీ వరల్డ్ బ్యాంక్ నిపుణుడు సీనియర్ ట్రాన్స్పోర్ట్ కన్సల్టెంట్ కృష్ణన్ శ్రీనివాసన్ మాట్లాడుతూ వ్యవస్థలో ఉన్న లోపాలు, పెరుగుతున్న ప్రమాదాలు ప్రాధాన్యతా అంశాలను వివరించారు.

యూనిసెఫ్ హెల్త్ స్పెషలిస్ట్ డా. శ్రీధర్ ర్యావంకి మాట్లాడుతూ 'రోడ్డు ప్రమాద మరణాలను 10 శాతం తగ్గిస్తే తలసరి జీడీపీ వృద్ధి 3.6 శాతం పెరిగే అవకాశం ఉందని అధ్యయనాలు సూచిస్తున్నాయి. ప్రమాదాల గుర్తింపు, ధోరణుల పరిశీలన, ఆధారాధారిత విధాన నిర్ణయాలకు బలమైన డేటా వ్యవస్థలు, పరిశోధనలు, మూల్యాంకనం అత్యంత అవసరం' అని పేర్కొన్నారు. జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ట్రాఫిక్) డి. జోయెల్ డేవిస్ బాల్య వాహనదారుల సమస్యపై ఆందోళన వ్యక్తం చేశారు. నిబంధనలను కఠిన అమలు చేయడం, బాలల అనుకూల చట్టపరమైన విధానాలు , యుక్తవయస్కుల కోసం సురక్షిత వినోద ప్రదేశాల అవసరాన్ని వివరించారు. ఈ కార్యక్రమ ప్రాధాన్యతను వివరిస్తూ రవాణా కమిషనర్ కె. ఇళంబరితి మాట్లాడుతూ 'పిల్లలను దృష్టిలో ఉంచుకొని భద్రతా వ్యవస్థలను నిర్మిస్తే, సమాజమంతటికీ భద్రతను నిర్మించినట్టే. ఒక చిన్నారికి సురక్షితమైన రహదారి ప్రతి పౌరుడికీ సురక్షితమేనని అన్నారు. ఈ సమావేశంలో రవాణా శాఖ సంయుక్త కమిషనర్లు రమేష్, చంద్రశేఖర్ గౌడ్, శివలింగయ్య వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana