Dailyhunt
బాసర ఐఐఐటిలో విద్యార్థులకు నైపుణ్యాత్మక బోధన అందించాలి: కలెక్టర్

బాసర ఐఐఐటిలో విద్యార్థులకు నైపుణ్యాత్మక బోధన అందించాలి: కలెక్టర్

వతెలంగాణ -ముధోల్ బాసర ఐఐఐటీలో చదువుతున్న విద్యార్థులకు నైపుణ్యాలతో కూడిన నాణ్యమైన విద్య అందించాలని నిర్మల్ జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా పేర్కొన్నారు.

మంగళవారం సాయంత్రం కలెక్టర్ ఐఐఐటి క్యాంపస్ను సందర్శించి, యూనివర్సిటీ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా యూనివర్సిటీకి సంబంధించిన విభాగాలు, మొత్తం విద్యార్థుల సంఖ్య, అందిస్తున్న విద్యా విధానం, అధ్యాపకుల వివరాలు, వసతి సౌకర్యాలు, సదుపాయాలు, విద్యార్థులు సాధించిన విజయాలను అధికారులు కలెక్టర్కు వివరించారు.

అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ, క్యాంపస్ విద్యార్థులను ప్రపంచంతో పోటీపడే స్థాయికి తీర్చిదిద్దాలని సూచించారు. విద్యా బోధనలో ఆధునిక, సులభతర పద్ధతులను అనుసరిస్తూ విద్యార్థులకు సులువుగా అర్థమయ్యే విధంగా బోధన సాగించాలని తెలిపారు. భవిష్యత్తులో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు అధికంగా ఉన్న రంగాల్లో విద్యార్థులను ప్రోత్సహించాలని సూచించారు.

విద్యార్థులందరికీ ఆహ్లాదకరమైన వాతావరణంలో అన్ని సౌకర్యాలు కల్పిస్తూ, ఎటువంటి ఇబ్బందులు లేకుండా విద్యను అందించాలని పేర్కొన్నారు. నాణ్యమైన ఆహారం, సురక్షితమైన త్రాగునీరు అందించాలని ఆదేశించారు. యూనివర్సిటీ అభివృద్ధి, మౌలిక వసతుల కల్పనకు అవసరమైన సహకారం అందిస్తామని కలెక్టర్ తెలిపారు.

అనంతరం యూనివర్సిటీ అధికారులు జిల్లా కలెక్టర్ ను, భైంసా సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్ కుమార్లను శాలువాలతో సన్మానించి జ్ఞాపికలు అందజేశారు. ఈ సమావేశంలో వర్సిటీ ఉపకులపతి గోవర్ధన్, డిఆర్డిఓ విజయలక్ష్మి, తహసీల్దార్ పవన్ చంద్ర, యూనివర్సిటీ అధికారులు, అధ్యాపకులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana