Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
బరువులతో దోస్తీ.

బరువులతో దోస్తీ.

కామన్వెల్త్ గేమ్స్ 2026 వేదికగా స్కాట్లాండ్లోని గ్లాస్గోలో జరుగుతున్న పోటీల్లో భారత క్రీడాకారులు రికార్డుల మోత మోగిస్తున్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్కు చెందిన 22 ఏండ్ల యంగ్ వెయిట్లిఫ్టర్ వల్లూరి అజరు బాబు అద్భుత ప్రదర్శనతో దేశానికి రజత (సిల్వర్) పతకాన్ని అందించాడు.

పురుషుల 79 కేజీల విభాగంలో బరిలోకి దిగిన అజయ్ బాబు, మొత్తం 330 కిలోల బరువును విజయవంతంగా ఎత్తి రెండో స్థానంలో నిలిచాడు. ఇందులో స్నాచ్ రౌండ్లో 149 కిలోలు, క్లీన్ అండ్ జెర్క్ రౌండ్లో 181 కిలోల బరువు ఎత్తాడు. 2010 ఢిల్లీ కామన్వెల్త్ క్రీడల్లో వెయిట్లిఫ్టింగ్లో తండ్రి కాంస్యం సాధిస్తే.. ఆ బాటలోనే అడుగులు వేసిన అజయ్ బాబు 2026లో అవే క్రీడల్లో అదే క్రీడాంశంలో రజతం గెలిచాడు. అంతర్జాతీయ వేదికపై తెలుగుకేతనం ఎగురవేస్తూ అతను సాధించిన ఈ విజయంపై దేశవ్యాప్తంగా ప్రశంసల వర్షం కురుస్తోన్న నేపథ్యంలో 'జోష్' ప్రత్యేక కథనం…

అజయ్ బాబు 2004 నవంబర్ 22న ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం జిల్లా కొండవెలగాడ గ్రామంలో జన్మించాడు. తండ్రి శ్రీనివాసరావు వెయిట్లిఫ్టర్ కావడంతో అతడిపై మొదటి నుంచి ఆ ప్రభావం పడింది. క్రమంగా అది ఆసక్తిగా మారింది. సైన్యంలో పని చేసే శ్రీనివాసరావు భోపాల్లో ఉన్న సమయంలో తనతో పాటు తనయుడిని కూడా వెయిట్లిఫ్టింగ్ శిబిరానికి తీసుకెళ్లేవాడు. అలా వెళ్లడమే అజరు బాబులో ఈ ఆటపై ఇష్టాన్ని మరింత పెంచింది. అది గమనించిన శ్రీనివాసరావు స్వయంగా కొడుకుకు శిక్షణ ఇచ్చి వెయిట్లిఫ్టింగ్ మెళకువలు నేర్పించాడు. ఆరంభంలో తీవ్ర ఒత్తిడికి గురై జాతీయ టోర్నీల్లో విఫలమైనా.. 2024లో మోచేతి గాయంతో ఆటకు దూరమైనా తండ్రి అందించిన మనోధైర్యంతో మళ్లీ పుంజుకున్నాడు. గతేడాది కామన్వెల్త్ చాంపియన్షిప్లో 335 కేజీలు ఎత్తి స్వర్ణం సాధించి సత్తా చాటాడు. ఇప్పుడు కామన్వెల్త్ గేమ్స్ రజతంతో మరో మెట్టుఎక్కాడు. ప్రతిష్టాత్మక క్రీడోత్సవంలో పతకాలు నెగ్గిన తండ్రీ కొడుకులుగా శ్రీనివాస్-అజరు అరుదైన ఘనత సాధించారు.

వెయిట్లిఫ్టర్ల గని… కొండవెలగాడ!
ఈ గ్రామానికి క్రీడల్లో ఒక ప్రత్యేకమైన చరిత్ర ఉంది. ఏకంగా 33 మంది వెయిట్లిఫ్టర్లను దేశానికి అందించిన ఘనత ఈ ఊరి సొంతం. అందులో 22 మంది జాతీయ స్థాయిలో ఆడగా, 13 మంది అంతర్జాతీయ వేదికలపై తమ ముద్ర వేశారు. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలతో కూడిన ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని వెయిట్లిఫ్టర్ల గని అని కూడా పిలుస్తారు. కొండవెలగాడతో పాటు గోడాలం, ఆముదాలవలస వంటి గ్రామాల నుంచి ఇప్పటివరకు ఎంతో మంది నేషనల్, ఇంటర్నేషనల్ వెయిట్లిఫ్టర్లు తయారయ్యారు.

రికార్డులతో మొదలైన పతకాల ప్రయాణం
అజయ్ బాబు క్రీడా ప్రస్థానంలో 2023 ఖేలో ఇండియా గేమ్స్ అతిపెద్ద మలుపుగా నిలిచాయి. ఆ పోటీల్లో తన కేటగిరీలో నేషనల్ రికార్డు సాధిస్తూ గోల్డ్ మెడల్ గెలుచుకున్నాడు. దాంతో భారత జట్టులో చోటు లభించింది. 2024లో జరిగిన కామన్వెల్త్ వెయిట్లిఫ్టింగ్ ఛాంపియన్షిప్లో జూనియర్, సీనియర్ విభాగాల్లో ఏకకాలంలో స్వర్ణాలు సాధించి సంచలనం సష్టించాడు. అదే ఏడాది ఏషియన్ యూత్ అండ్ జూనియర్ ఛాంపియన్షిప్లో రజతం గెలిచాడు. ఇక 2025లో అహ్మదాబాద్లో జరిగిన కామన్వెల్త్ ఛాంపియన్షిప్లో 335 కేజీలు ఎత్తి ఆల్టైమ్ ఛాంపియన్షిప్ రికార్డుతో గోల్డ్ కొట్టాడు. ఆ రికార్డు విజయమే అతనికి నేడు 2026 గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్ టికెట్ అందించడమే కాకుండా, దేశం గర్వించేలా సిల్వర్ మెడల్ తెచ్చిపెట్టింది.

కఠిన సాధన… తిరుగులేని పట్టుదల!
వెయిట్లిఫ్టింగ్ అనేది కేవలం శారీరక బలం మాత్రమే కాదు… మానసిక ఏకాగ్రత కూడా చాలా అవసరం.
నిరంతర శిక్షణ: రోజుకి గంటల తరబడి కఠినమైన ప్రాక్టీస్.
ఆహార నియమావళి: కచ్చితమైన డైట్ ఫాలో అవుతూ శరీరాన్ని ఎప్పుడూ సిద్ధంగా ఉంచుకోవడం.
దృష్టి: ప్రతి ఈవెంట్లోనూ పతకమే లక్ష్యంగా రింగ్లోకి అడుగుపెట్టడం.

- అనంతోజు మోహన్కృష్ణ 88977 65417

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana