Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
భారత్కు ఎల్పీజీ కటకట

భారత్కు ఎల్పీజీ కటకట

రోజుకు 4 లక్షల బ్యారెళ్ల ఇంధన కొరతసగానికి పడిపోయిన దిగుమతులు
ప్రత్యామ్నాయ మార్గాల్లో రవాణా ఆలస్యం

న్యూఢిల్లీ : అమెరికా సామ్రాజ్యవాదంతో పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ వాతావరణం దేశీయంగా వంటగ్యాస్ (ఎల్పీజీ) సరఫరాపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది.

ఇరాన్పై అమెరికా, ఇజ్రాయిల్ జరిపిన దాడుల అనంతరం ఇంధన రవాణాకు అత్యంత కీలకమైన హార్మూజ్ జలసంధి గుండా రాకపోకలు నిలిచిపోవడంతో భారతదేశంలో రోజుకు దాదాపు 4 లక్షల బ్యారెళ్ల ఎల్పీజీ కొరత ఏర్పడింది. ప్రముఖ విశ్లేషణాత్మక సంస్థ కెప్లర్ గణాంకాల ప్రకారం.. ఫిబ్రవరి నెలలో రోజుకు సగటున 8.5 లక్షల బ్యారెళ్లుగా ఉన్న దిగుమతులు.. ఏప్రిల్ నాటికి సగానికి పైగా పడిపోయి కేవలం 3.7 లక్షల బ్యారెళ్లకు పరిమితమయ్యాయి. దేశీయంగా ఎల్పీజీ ఉత్పత్తి రోజుకు 75,000 బ్యారెళ్ల మేర పెంచినప్పటికీ.. దేశ అవసరాలకు అది ఏమాత్రం సరిపోవడం లేదు. భారత్ తన మొత్తం వంటగ్యాస్ అవసరాలలో మూడింట రెండు వంతులు దిగుమతులపైనే ఆధారపడుతోంది. ఇందులో 80 శాతం సరఫరా యూఏఇ, ఖతార్, కువైట్, సౌదీ అరేబియా దేశాల నుంచే వస్తుంది.

అయితే.. యుద్ధం కారణంగా అక్కడి ఇంధన మౌలిక సదుపాయాలపై దాడులు జరగడంతో, ఆయా ప్రధాన దేశాల నుంచి భారత్కు వచ్చే దిగుమతులు ఏకంగా 75 శాతం మేర పడిపోయాయి. ఇవి తిరిగి సాధారణ స్థితికి రావడానికి చాలా సమయం పట్టేలా కనిపిస్తోంది. ​ఈ సంక్షోభాన్ని అధిగమించడానికి భారతీయ ఇంధన సంస్థలు ఆస్ట్రేలియా, అర్జెంటీనా, అమెరికా వంటి ప్రత్యామ్నాయ దేశాల నుంచి ఎల్పీజీని కొనుగోలు చేయడానికి ప్రయత్నిస్తున్నాయి. అయితే పశ్చిమాసియా దేశాల నుంచి భారత్కు రావడానికి కేవలం 5 నుంచి 6 రోజుల సమయం పడితే.. ఆస్ట్రేలియా నుంచి 20 రోజులు, అమెరికా లేదా అర్జెంటీనా నుంచి నౌకలు రావడానికి 35 నుంచి 45 రోజుల సుదీర్ఘ సమయం పడుతోంది. పైగా ఈ దేశాల నుంచి అందుతున్న ఇంధన పరిమాణం కూడా చాలా తక్కువగా ఉండటంతో మార్కెట్లో డిమాండ్కు తగ్గ సరఫరా సాధ్యం కావడం లేదు. ప్రభుత్వం ప్రత్యామ్నాయంగా పైప్డ్ గ్యాస్ (పీఎన్జీ) కనెక్షన్లను వేగంగా పెంచుతున్నప్పటికీ.. అది కేవలం 1.6 కోట్ల ఇండ్లకు మాత్రమే పరిమితమైంది. కానీ దేశంలో ఎల్పీజీ సిలిండర్లపై ఆధారపడే ఇండ్లు 33 కోట్లకు పైగా ఉన్నాయి. ఈ భారీ సరఫరా కొరత కారణంగానే ఈ నెల ప్రారంభంలో సిలిండర్పై ధరను ఏకంగా రూ.993 పెంచారు. ఫలితంగా బ్లాక్ మార్కెట్ దందా కూడా పెరిగింది. అధిక ధరలు ద్రవ్యోల్బణం ఎగిసిపడటానికి దారి తీస్తున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana