Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
బొద్దింకల గర్జన -'కాక్రోచ్ జనతా పార్టీ' కథ!

బొద్దింకల గర్జన -'కాక్రోచ్ జనతా పార్టీ' కథ!

ప్రపంచ రాజకీయాల్లో ఇప్పుడు ఒక కొత్త దశ ప్రారంభమైంది. పాతకాలం లాగా పార్టీ కార్యాలయాల ముందు క్యూలు కట్టి సభ్యత్వాలు తీసుకునే యువత కంటే, సోషల్ మీడియా మీమ్స్, సెటైర్లు, వైరల్ వీడియోలు, డిజిటల్ ప్రచారాల ద్వారా తమ అసంతృప్తిని వ్యక్తం చేసే తరం ముందుకు వస్తోంది.

భారతదేశంలో 'కాక్రోచ్ జనతా పార్టీ' వంటి వ్యంగ్య రాజకీయ ధోరణులు ఎలా వెలుగులోకి వచ్చాయో చూస్తే, దానికి సమాంతరంగా నేపాల్లో జరిగిన జెన్జీ యువజన ఉద్యమాలు గుర్తుకొస్తాయి. అక్కడ యువత అవినీతి, నిరుద్యోగం, పాత రాజకీయ కుటుంబాల ఆధిపత్యంపై తిరుగుబాటు చేస్తే., ఇక్కడ యువత సోషల్ మీడియా వ్యంగ్యాన్ని రాజకీయ ఆయుధంగా మార్చుకుంటోంది.నేపాల్లో గత కొన్నేళ్లుగా యువత సంప్రదాయ పార్టీలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. రాజ్యాంగ మార్పుల తర్వాత కూడా ప్రజల జీవితాల్లో గణనీయమైన మార్పు రాకపోవడం, ఉద్యోగ అవకాశాల కొరత, భారీ ఎత్తున విదేశీ వలసలు ,ఇవన్నీ యువతలో తీవ్ర అసహనాన్ని పెంచాయి. కాఠ్మాండూ కేంద్రంగా పెరిగిన డిజిటల్ యాక్టివిజం, టిక్టాక్, ఫెసుబుక్ లైవ్, యూ ట్యూబ్ వంటి వేదికలు రాజకీయ చర్చలకు కేంద్రాలయ్యాయి.

పాత పార్టీలు ప్రజల సమస్యలను పట్టించుకోవడం లేదనే భావన బలపడింది. దీంతో యువత సంప్ర దాయ రాజకీయ భాషను తిరస్కరించి, వ్యంగ్యం, మీమ్స్, వీధి నిరసనలు, డిజిటల్ ప్రచారాలను ప్రధాన ఆయుధాలుగా ఉపయోగించడం ప్రారంభించింది. భారతదేశంలోనూ పరిస్థితి అంత భిన్నంగా లేదు. విద్య ప్రైవేటీకరణ, నిరుద్యోగం, పరీక్షా పత్రాల లీకులు, కార్పొరేట్ ఆధిపత్యం, మీడియా కార్పొరేటీ కరణ ,ఇవన్నీ యువతలో తీవ్ర అసంతృప్తిని పెంచుతున్నాయి. అయితే ఆ అసం తృప్తి నేరుగా రాజకీయ పార్టీల రూపంలో కాకుండా, ముందుగా డిజిటల్ వ్యంగ్య రూపంలో బయటపడుతోంది. 'కాక్రోచ్ జనతా పార్టీ' వంటి పేర్లు కేవలం నవ్వు కోసం పుట్టినవి కావు. అవి పాలక వ్యవస్థల వైఫల్యాలపై యువత వేసిన రాజకీయ ఆరోపణలు.

ప్రజాస్వామ్యంలో ప్రజలే యజమానులు అంటారు. కానీ, అధికార కుర్చీలపై కూర్చున్నవారి భాష చూస్తే మాత్రం ప్రజలు యజమానులు కాదు,పాలకుల దృష్టిలో కేవలం 'సహించాల్సిన భారాలు' అన్న భావన స్పష్టంగా కనిపిస్తోంది. నిరుద్యోగం, విద్యా సంక్షోభం, పరీక్షల అవినీతి, కార్పొరేట్ దోపిడీ, సామాజిక అసమానతలతో అల్లాడుతున్న యువత ప్రశ్నిస్తే ,సమాధానాలు చెప్పాల్సిన వ్యవస్థలు వారినే 'బొద్దింకలు', 'పారసైట్లు' అంటూ అవమానించే స్థాయికి దిగజారడం దేశ ప్రజాస్వామ్యానికి ప్రమాద ఘంటికలే.అత్యున్నత న్యాయస్థాన పీఠం నుంచే ఇటువంటి వ్యాఖ్యలు రావడం యాదృచ్ఛికం కాదు. ఇది ఈ దేశ పాలక వర్గాల మానసిక స్థితికి ప్రతిబింబం. ప్రశ్నించే యువతను దేశ భవిష్యత్తుగా కాకుండా, ఇబ్బందికరమైన 'కీటకాలు'గా చూసే అహంకారం పెరుగుతూనే ఉంది. ఆర్టీఐ కార్యకర్తలు, ఉద్యమకారులు, నిరుద్యోగులు, హక్కుల కోసం పోరాడేవారిని వ్యవస్థకు శత్రువుల్లా చిత్రీకరించడం ఇప్పుడు కొత్తేమీ కాదు. కానీ, ఈసారి యువత కూడా మౌనంగా ఉండలేదు. డిజిటల్ యుగానికి తగ్గట్టు అదే వ్యంగ్యాన్ని ఆయుధంగా మార్చుకుంది.

'అవును..,మేమే బొద్దింకలం. మీ అవినీతి, మీ అహంకారం, మీ కుళ్లిన రాజకీయాల మధ్య కూడా బతికి పోరాడగల జాతి మాది' అంటూ సోషల్ మీడియాలో యువత తిరుగుబాటు మొదలుపెట్టింది. అణుబాంబు పడ్డా బతికే జీవిగా బొద్దింకకు ఉన్న గుర్తింపునే ప్రతిఘటన చిహ్నంగా మలచుకోవడం వెనుక ఒక లోతైన రాజకీయ సందేశం ఉంది. వ్యవస్థ ఎంత అణచివేసినా యువత పూర్తిగా మౌనమవదనే హెచ్చరిక అది. ఇదే సమయంలో మహారాష్ట్రలోని శంభాజీనగర్కు చెందిన యువకుడు అభిజీత్ దీప్కే సోషల్ మీడియాలో వ్యంగ్యంగా విసిరిన 'కాక్రోచ్ జనతా పార్టీ' ఆలోచన ఒక్కసారిగా దేశవ్యాప్తంగా వైరల్ కావడం గమనార్హం. సాధారణంగా సోషల్ మీడియాలో ట్రెండ్లు వచ్చి పోతుంటాయి. కానీ, ఈసారి పరిస్థితి భిన్నంగా మారింది. కేవలం సరదా వ్యంగ్యంగా మొదలైన ఈ ప్రయోగం వేలాది మంది యువత ఆవేదనకు వేదికగా మారింది.కొద్ది గంటల్లోనే వేలాది మంది సభ్యత్వం కోసం దరఖాస్తు చేయడం, వెబ్సైట్ సర్వర్లు క్రాష్ కావడం, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ వంటి వేదికల్లో భారీ స్పందన రావడం., ఇవన్నీ కేవలం 'మీమ్ కల్చర్'గా తీసిపారేయలేని పరిణామాలు. ప్రధాన రాజకీయ పార్టీలపై యువతలో పెరిగిపోతున్న అసహనం, నిస్పృహ, విసుగు ఈ స్పందన వెనుక కనిపిస్తున్న అసలు కారణాలు.

ఇంకా ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ పార్టీ మ్యానిఫెస్టో కూడా యువతను ఆకర్షించేలా ఉండటం. న్యాయవ్యవస్థలో పారదర్శకత, పదవీ విరమణ చేసిన న్యాయమూర్తులకు రాజకీయ పదవుల రూపంలో ఇచ్చే 'రివార్డుల' సంస్కృతికి వ్యతిరేకత, మహిళలకు యాభై శాతం రిజర్వేషన్లు వంటి అంశాలను వ్యంగ్యంతో కలిపి ప్రస్తావించడం వల్ల ఇది కేవలం ట్రోల్ స్థాయిలోనే ఆగిపోలేదు. వ్యవస్థలపై యువతకు ఉన్న అసంతృప్తి రాజకీయ రూపం దాల్చే అవకాశం కూడా ఉందనే సంకేతాలు ఇచ్చింది. ఈ పరిణామం చూసిన తర్వాత సంబంధిత న్యాయమూర్తి 'నా వ్యాఖ్యలను మీడియా వక్రీకరించింది', 'ఫేక్ డిగ్రీలు ఉన్నవాళ్లనే అలా అన్నాను' అంటూ వివరణ ఇవ్వడం మరింత హాస్యాస్పదంగా మారింది. మొదట అవమానించడం. తర్వాత ప్రజా వ్యతిరేకత పెరిగాక మాట మార్చడం,ఇది అధికార వ్యవస్థల పాత రాజకీయమే. కానీ, సోషల్ మీడియా యుగంలో ప్రజలు అంత తేలికగా మర్చిపోవడం లేదు. ప్రతి వ్యాఖ్య, ప్రతి అవమానం వెంటనే ప్రజా చర్చగా మారుతోంది.

ఈ దేశంలో యువత ఎదుర్కొంటున్న అసలు సమస్యలు మాత్రం రోజురోజుకీ తీవ్రమవుతున్నాయి. చదువుకున్నా ఉద్యోగం లేదు. ఉద్యోగం వచ్చినా భద్రత లేదు. పరీక్షలు రాస్తే పేపర్ లీకులు. ప్రభుత్వ రంగం క్షీణత. ప్రైవేటీకరణ దాడులు. మరోవైపు కార్పొరేట్ అనుకూల విధానాలు. ఈ పరిస్థితుల్లో యువతలో పెరుగుతున్న కోపం ఇప్పుడు వ్యంగ్య రాజకీయాల రూపంలో బయటపడుతోంది. ప్రపంచవ్యాప్తంగా కూడా ఇలాంటి ధోరణులు కనిపిస్తున్నాయి. సంప్రదాయ రాజకీయాలపై విసుగు చెందిన కొత్తతరం వ్యంగ్యం, మీమ్స్, డిజిటల్ క్యాంపెయిన్ల ద్వారా నిరసన తెలుపుతోంది. అధికార భాషను తిరగరాసి అదే ఆయుధంగా మార్చుకుంటోంది. 'కాక్రోచ్ జనతా పార్టీ' కూడా అదే తరహా డిజిటల్ తిరుగుబాటు.బొద్దింకల బొమ్మలతో టీషర్టులు వేసుకుని యువత వీధుల్లోకి రావడం, నీటి శుద్ధి కార్యక్రమాలు చేయడం, మీమ్స్ ద్వారా వ్యవస్థలను ఎండగట్టడం,ఇవన్నీ చూస్తే ఇది కేవలం సరదా కాదని అర్థమవుతోంది. ప్రజల సమస్యలపై స్పందించని రాజకీయ పార్టీలకు, ప్రజలను అవమానించే అధికార వర్గాలకు ఇది స్పష్టమైన హెచ్చరిక. ఈ 'కాక్రోచ్ జనతా పార్టీ' నిజంగా రాజకీయ శక్తిగా ఎదుగుతుందా? లేక డిజిటల్ ఆగ్రహంగా మిగిలిపోతుందా? అనేది కాలమే నిర్ణయిస్తుంది. కానీ ఒక విషయం మాత్రం స్పష్టం. సామాన్యుడిని కీటకంగా చూడడం మొదలుపెట్టిన వ్యవస్థలు చివరకు ప్రజల కోపానికే బలవుతాయి. చరిత్ర కూడా అదే చెబుతోంది. ప్రశ్నించే యువతను బొద్దింకలు అంటున్న పాలక వర్గాలు గుర్తుంచుకోవాలి, కుళ్లిన వ్యవస్థలను ముందుగా గుర్తించేది కూడా బొద్దింకలేనని!

టి.నాగరాజు
9490098292

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana