Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
బోనులో వ్యవస్థలు -సరికొత్త కుట్రలు

బోనులో వ్యవస్థలు -సరికొత్త కుట్రలు

బొద్దింకల యుద్ధం తొలి విజయం దేశ రాజకీయాల చరిత్రలో కొత్త అధ్యాయం రచించింది. ఎన్నికల సంఘాన్ని సాధనంగా చేసుకుని 'సర్' తొలగింపులు, ఈవిఎం అవకతవకలతో రాష్ట్రాల్లో గెలుపొంది 2024 ఎదురుదెబ్బను తిరగేసినట్టు గొప్పలు పోతున్న బీజేపీ-ఆరెస్సెస్లను ఒక్కసారిగా హడల గొట్టింది.

తలతిరిగితే గానీ తత్వం బోధపడదన్నట్టు ప్రధానమంత్రి వీడియోలు విడుదల చేస్తూ యువత పట్ల తన అభిమానాన్ని చెప్పుకోవలసి వచ్చింది. నెలల తరబడి పట్టించుకోని పరీక్షల అవకతవకలపై చెంపలేసుకోవలసి వచ్చింది. ససేమిరా కుదరదని తిరస్కరించిన ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండును అంగీకరించవలసి వచ్చింది. కంటితుడుపుగా ఏదో లీకేజీలకు శిక్షలు, జరిమానాలు పెంచుతూ ఆగమేఘాల మీద బిల్లు తేవలసి వచ్చింది. బొద్దింకలనే వారి నిరసన ప్రభావం తెలియడానికి ఇవన్నీ ఉదాహరణలు. మొదటిసారిగా నిరుద్యోగ యువతను బొద్దింకలని పిలిచి నొప్పించిన ప్రధాన న్యాయమూర్తిగారే నిరసనపై నిర్బంధాన్ని విచారించడానికి సమయం లేదని నిరాకరించి మళ్లీ తన మాటలను వక్రీకరించారిని ఒకటికి రెండుసార్లు సంజాయిషీ ఇచ్చు కోవలసి వచ్చింది. నెలన్నర రోజులు నిరసనలు, నిరాహారదీక్షలు జరిగినా ప్రైంటైమ్లో చూపేందుకు మనసు రాని బడా మీడియా పతాక శీర్షికల్లో చోటు కల్పించాల్సి వచ్చింది.

విద్యార్థులు కొన్ని మీడియా సంస్థలపై దాడి చేయడం సమర్థనీయం కాకున్నా అందుకు వాటి వైఖరి వల్లనే అలాంటి పరిస్థితి వచ్చిందని ప్రపంచమంతా భావించక తప్పలేదు. ప్రముఖ ఛానళ్లు పత్రికలు తొక్కిపట్టాలని చూసినా ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో ఇతర ప్రచార పద్ధతులతో ప్రజా ఉద్యమాలను ముందుకు తీసుకుపోవచ్చని తేలిపోయింది. హిందీ తారల్లా ఈ ఉద్యమానికి నైతిక మద్దతునివ్వని తెలుగు హీరోలు కూడా విమర్శ ఎదుర్కొవలసి వచ్చింది. సంఘ పరివార్ను నిరంతరం నిలదీసే ప్రకాశ్రాజ్ వంటివారు ధైర్యంగా ఉద్యమకారులతో కలసి పాల్గొనడం వారి గౌరవం పెంచింది. గోడమీద పిల్లుల్లా వుండిపోయిన కొన్ని పార్టీలు చివరకు ఏదో ఒక రూపంలో బలపర్చినట్టు కనిపించడానికి తంటాలు పడ్డాయి. ఉద్యమాలను బలపర్చడంలో ముందుండే ఎస్ఎఫ్ఐ, ఎఎస్ఎఐ, ఎఐఎస్ఎఫ్ వంటి విద్యార్థి సంస్థల నాయకులు కూడా నిరాహారదీక్షలో పాలు పంచుకుని ఉద్యమానికి ఊపునివ్వడంలో కీలకపాత్ర వహించిన తీరు దానికి బలం చేకూర్చింది. ఉద్యమానికి నాయకత్వం వహించిన అభిజిత్ దీప్కే, సౌరవ్దాస్, అశుతోష్ రాంకాలు కూడా క్రమక్రమంగా దృఢమైన రీతిలో మాట్లాడటం చూశాం. ఉద్యమాలకు ఊపునివ్వడానికి విభిన్న శక్తులు వ్యక్తుల పాత్ర ఏమిటో సోనమ్ వాంగ్చుక్ నిరాహారదీక్ష తోడవడం బట్టి విదితమైంది.

యూపీ బీజేపీ మాజీ ఎమ్మెల్యే విక్రమ్ సింగ్ కుమార్తె యశస్విని రాజ్సింగ్ కూడా లీకేజికి వ్యతిరేకంగా ఆందోళనను బలపర్చడం, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను కూడా అపహాస్యం చేయడం, అస్సాం రెవెన్యూ మంత్రి కేశవ్ కుమార్తె మిలింద కూడా ఉద్యమంలో పాల్గొనడంపై ముఖ్యమంత్రి హిమంత బిస్వాశర్మ సమర్థించుకోలేకపోవడం మరో అంశం. యువత కాలాన్ని బట్టి తలిదండ్రుల మాట వినకుండా అనుకున్నట్టు చేస్తుందని ఆయన అంగీకరించవలసి వచ్చింది. ఒకరిద్దరు కూటమి నాయకుల పిల్లలు కూడా పాల్గొన్నట్టు వార్తలొచ్చాయి.మోడీ మాటల గారడీప్రజల నాడిని పసిగట్టడంలో ప్రజ్ఞగల తెలివిమంతుడు గనకే ప్రధాని మోడీ అటు నుంచి నరుక్కు వచ్చారు. పిల్లలపై తనకెంతో సానుభూతి వుందని, లీకేజి మహాపాపమని పార్లమెంటు సమావేశాల మొదట్లోనే గొంతు మార్చారు. కానీ ఆ మాటలు సోషల్ మీడియా ద్వారా వదలడం తప్ప పార్లమెంటు వేదికపై చెప్పడానికి సిద్ధం కాలేదు. ఎందుకంటే అధికారిక వేదికలపై చెబితే ప్రపంచమంతా చూస్తుంది. ఈ ఉద్యమం కారణంగా మోడీకి గతంలో ఉన్న పట్టు సడలిందని ఇప్పటికే అంతర్జాతీయ వార్తాసంస్థలు భారీగా కథనాలు ఇస్తున్నాయి. కనకనే ఇటు బుజ్జగింపు మాటలు, అటు సాయుధ బలాల ప్రయోగం ద్వంద్వక్రీడగా సాగించారు. ఆఖరుకు రాజీనామా చేసిన ప్రధాన్ కూడా తన తప్పులేకున్నా ఏదో బాధతో బాధ్యత గల ఆరెస్సెస్ వాదిగా పదవి వదులకున్నాననే బిల్డప్ ఇచ్చారు.

ఆయనకు జయజయ ధ్వానాలు పలికిన బీజేపీ పెద్దలు దాన్ని కొనసాగించే ప్రయత్నం చేశారు. ఇదంతా వ్యూహాత్మకంగా జరిగింది. సర్కారుకు అతి కీలకమైన మోడీతోపాటు హోం మంత్రి అమిత్ షా కూడా సభకు ముఖం చాటేసి లీకులతో కాలం గడిపారు. గతంలో పెద్ద నోట్లరద్దు, రైతు ఉద్యమం వంటి సందర్భాల్లోనూ ఇదే చూశాం. వేడీ పెరిగాక పథకం ప్రకారం సభలో మాట్లాడి ఎదురు దాడి చేయడం మోడీ స్టయిల్. పని విభజనలో దానికి రంగం సిద్ధం చేయడం అమిత్ షా పాత్ర. కచ్చితంగా ఇప్పుడూ అదే జరుగుతున్నది. ఇద్దరు నేతలూ సభకు రాకుండా రాజకీయ బాధ్యత దాటేశారు. ఉత్తుత్తి చట్టం ఒకటి తెచ్చి వీడియోలతో కాలక్షేపం చేస్తారు. రాహుల్గాంధీనో, ప్రియాంకనో మాట్లాడిన వాటిపై రాద్ధాంతం చేస్తూ కాలం గడుపుతారు. వీటిని మీడియాలో విస్తారంగా ప్రచారం చేసి ప్రతిపక్షాలదే తప్పు అన్న వాతావరణం కల్పిస్తారు. అంటే మొదటి దశలో తిన్న దెబ్బను వీటిద్వారా సరిచేసుకోవడానికి తంటాలు పడతారన్నమాట. రైతాంగ ఉద్యమం సమయంలోనూ కేంద్రం, మోడీషాలు అనుసరించిన వ్యూహం ఇదే. ఇప్పుడు ఆ రెండు కలసి వస్తున్నాయనేది వారిని మరింత భయపెడుతున్నది. అమిత్షాకు గురిమోడీ గారి వీడియోల గొంతుకలోనే ఈ మార్పు కనిపిస్తుంది. సానుభూతి, మహాపాపం అంటూ బయలుదేరిన ప్రధానమంత్రి- ఇప్పుడు ఎవరో ఎక్కడో తనను అవమానించే వీడియో చేశారనేది చెబుతూ పిల్లలను క్షమించాలంటున్నారు. మోడీనే గాక ఆయన తల్లిని కూడా అందులో కించపర్చారని బడా మీడియా కథలు మొదలు పెట్టింది.

వాటిని ఎవరూ సమర్థించరు గానీ దాన్ని ముందుకు తేవడమంటే ఉద్యమ స్వభావంపై మళ్లీ బురదచల్లే ప్రయత్నం కొనసాగించడమే. సీపీఐ(ఎం) కార్యాలయంలో నేరుగా ప్రవేశించి జేఎన్యూ నేత ఐషీ ఘోష్ను అరెస్టు చేయడానికి బరితెగించడం కూడా విద్యార్థులను భయపెట్టే ప్రయత్నం. కోర్టులు కూడా నిరసన హక్కు వుందంటూనే ఎఫ్ఐఆర్లు వుంటే తప్పు చేసినవారిపై చర్యలు తీసుకోవచ్చని చెబుతున్నాయి. అంతకంటే కీలకంగా ఢిల్లీ పోలీసుల నివేదికలు ఉద్యమంలో నేర నేపథ్యం గలవారున్నారనే కథనాలు భారీగా ప్రచారం చేస్తున్నాయి, మీకు తోడు నేనుంటానని సీఐఆర్ఎఫ్ అధినేత సూటిగా భరోసా ఇస్తున్నారు. శాంతిభద్రతల పరిరక్షణలో బుల్లెట్లనే వాడుతున్నప్పుడు పెల్లెట్ తుపాకులు వాడకుండా ఎలా నిషేదించ గలమని సీజేఐ సూర్యకాంత్ ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఇవన్నీ కేంద్రం ఆలోచనా ధోరణిని ప్రతిబింబిస్తు న్నాయి.మరి ఇంత పకడ్బందీగా అ దేశాలిచ్చింది అమిత్ షా అంటే మళ్లీ ఒప్పుకోవడం లేదు, ఢిల్లీ శాంతి భద్రతలు కేంద్రం బాధ్యతయినప్పుడు హోంమంత్రిదే పాత్ర కదా? ఆయనెందుకు సభకు రావడం లేదు? ఏతావాతా ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ తర్వాత షా క్షమాపణ చెప్పాలన్నదే నినాదంగా మారుతున్నది గనక మెరుపు వీరుడులా వచ్చి ఎదురుదాడి చేస్తారన్నమాట. జంతర్ మంతర్ నిరసనలపై అత్యాధునిక నిఘా పరి కరాల ద్వారా సేకరించిన పుటేజీని నెమ్మదిగా విడుదల చేస్తూ మార్ఫింగ్లతో ఒక వాతావరణాన్ని కలుషితం చేస్తారనే సూచనలు కనిపిస్తున్నాయి.

ఉద్యమాల్లో పాల్గొంటే భవిష్యత్తు వుండదని భయపెట్టడమే జేఎన్యూ ఘటనల నాటి నుంచి మోడీ సర్కారు ప్రధాన వ్యూహం. ఇప్పుడు అది ఇంకా తీవ్రమవ్వొచ్చు. కానీ బొద్దింకల యుద్ధం ఇచ్చిన ఉత్సాహం వాటిని వమ్ముచేయగలగాలి.రాజకీయ రహస్యంబీజేపీ-ఆరెస్సెస్ లెక్క చాలా సూటిగానే వుంది. యూపీ ఎన్నికల తరుణంలో రాజకీయంగా ఎదురు కొట్టే ప్రమాదం రాకుండా చూసుకోవాలి. అందుకే దేశాన్ని ఉడికించిన రామమందిరం నిధుల కుంభ కోణంపై మాట్లాడటం లేదు. మరోవైపున అఖిలేశ్ యాదవ్ వంటివారు చొరవగా ముందుకొచ్చే అవకాశం ఇవ్వకూడదు. మరోవైపు నుంచి వందేమాతరం వంటిబిల్లులతో తన దేశభక్తి పార్ములాను మోతమోగించాలి. విదేశాంగ విధాన సమస్యలను ముందుకు తేవాలి. ఆక్రమిత కాశ్మీర్లో ఘటనలను ఎక్కువగా ప్రచారంలో పెట్టాలి. బ్రిక్స్ సమావేశాల వంటివి రానున్నాయి గనక మీడియాను అటు మరల్చాలి. విద్యార్థులపైన , సిజెపి పైన ప్రత్యక్ష దాడి ప్రచార దాడి కూడా పెంచి విశ్వగురు ఇమేజ్కు ఇటీవల కాలంలో ఎదురైన సవాళ్లను సరిచేసుకోవాలి. ముంచుకొస్తున్న రైతాంగ ఉద్యమం పైనా గురిపెట్టాలి. ఏతావాతా విషప్రచారాలు 2.0 తీవ్రం చేయాలి. పార్లమెంటులోనూ బయటా కూడా జరగబోయేది అదేనన్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రతిపక్ష నేతలపై హక్కుల నోటీసులివ్వడం కూడా అందులో భాగమే. మరోవైపున పంజాబ్లో బీజేపీ, ఆప్ సర్కారులో లీకులు జరిగాయని, తెలంగాణలో లీకయ్యాయని విమర్శలు గుప్పిస్తున్నది.

ఏపీలోనైతే వైసీపీ కేంద్రం బాధ్యతగా వ్యవహరించిందని కితాబునిస్తూ డీఎస్సీపైనా అదే తరహాలో ఉద్యమం చేస్తానంటున్నది. అవకవతవకలపై విచారణ, దిద్దుబాటు అవసరమే గానీ దేశంలో విద్యావ్యవస్థ కార్పొరేటీకరణ, కాషాయికరణ కేంద్రీకరణలో భాగంగా జరిగిన ఆ పరిణామాల నేపథ్యం వేరుగా చూడవలసి వుంటుంది, ఆరెస్సెస్కు విద్యావ్యవస్థ అప్పగిం చారంటూ ప్రతిపక్ష నేతలు ఉభయసభల్లో చేసిన విమర్శలు మౌలికంగా సరైనవే. సిలబస్లో విప్లవోద్యమాల చరిత్ర తగ్గించి మనువాదాన్ని జొప్పించడం సూటిగానే జరుగుతున్నది. విద్యను నేరుగా కార్పొరేట్కు అప్పగించి లక్షల విద్యాలయాలు మూసివేయడం జరిగిపోతున్నది. విద్యావ్యవస్థ మొత్తం కేంద్రం గుప్పిట్లోకి పోతుండగా రాష్ట్రాలు వీక్షకులుగా మారిపోతున్నాయి. ఈ పరిణామాల మధ్య గల సంబంధాన్ని సూటిగా వినిపించకుండా చేయడం మోడీ సర్కారు వ్యూహం. పార్లమెంటులో జరుగుతున్న ప్రహసనం అదే. బంతి మళ్లీ ఇటు వైపు విసిరే విఫలయత్నం. సిజెపి నేతల స్పందనలు ఎలా వుంటాయనేది కూడా ఆచరణలో చూడవలసిందే. రిజర్వేషన్ వ్యతిరేక ఆందోళన, ఇథనాల్ పెట్రోల్ మిక్సింగ్పై ఆందోళన అంటూ కలిపి కొందరు ఊహాగానాలు విడుదల చేస్తున్నారు. ఇందులో కొన్ని పక్కదోవ పట్టించే ప్రయత్నాలు. దీన్ని మామూలు స్థానిక రాజకీయాలతో కలగాపులగం చేస్తే పక్కదోవ పడుతుంది. కొత్తరూపంలో సాగే కుట్రలను వమ్ముచేస్తేనే జంతర్మంతర్ ప్రభావం జయప్రదమవుతుంది.

తెలకపల్లి రవి

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana