Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఎబోలా పై కేంద్రం హై అలర్ట్

ఎబోలా పై కేంద్రం హై అలర్ట్

భారత్కు వచ్చే విదేశీ ప్రయాణికులకు అడ్వైజరీ జారీఇండియా, ఆఫ్రికా సదస్సు వాయిదా

న్యూఢిల్లీ : ప్రపంచవ్యాప్తంగా ఎబోలా వైరస్ కలకలం రేపుతున్న వేళ కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది.

ఎబోలా తీవ్రత ఎక్కువగా ఉన్న ఆఫ్రికా దేశాల నుంచి భారతదేశానికి వచ్చే ప్రయాణికుల కోసం కేంద్ర ఆరోగ్య శాఖ అడ్వైజరీ జారీ చేసింది. ఈ మేరకు ఆరోగ్య శాఖ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ కీలక ఆరోగ్య మార్గదర్శకాలను విడుదల చేసింది. ఎబోలా ప్రభావిత దేశాల నుంచి భారత్కు వచ్చే ప్రయాణికులు, ఇమ్మిగ్రేషన్ తనిఖీలకు ముందే ఆరోగ్య అధికారులను సంప్రదించాలని కోరింది. ముఖ్యంగా డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో (డీఆర్సీ), ఉగాండా, దక్షిణ సూడాన్ దేశాల నుంచి వచ్చే ప్రయాణికులు ఎబోలా లక్షణాలు కనిపిస్తే వెంటనే ఎయిర్పోర్ట్ ఆరోగ్య అధికారులకు సమాచారం ఇవ్వాలని స్పష్టం చేసింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ఇటీవల కాంగో, ఉగాండాలో వైరస్ వ్యాప్తిపై 'గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీ' ప్రకటించిన నేపథ్యంలో కేంద్రం ఈ చర్యలు చేపట్టింది. అయితే ఇది ప్రపంచవ్యాప్త మహమ్మారి కాదని డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అథనామ్ గెబ్రియేసస్ స్పష్టం చేశారు.

అడ్వైజరీలోని సూచనలు
కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన అడ్వైజరీ ప్రకారం, ఎబోలా ప్రభావిత దేశాల నుంచి భారత్కు చేరుకునే ప్రయాణికులు జ్వరం, తీవ్ర అలసట, నీరసం, తలనొప్పి, కండరాల నొప్పులు, వాంతులు, విరేచనాలు, గొంతు నొప్పి, శరీరంలో అనూహ్య రక్తస్రావం వంటి లక్షణాలు ఉంటే వెంటనే విమానాశ్రయంలోని ఆరోగ్య విభాగానికి సమాచారం ఇవ్వాలి. ఇమ్మిగ్రేషన్ క్లియరెన్స్కు ముందే తమ ఆరోగ్య పరిస్థితిని వెల్లడించాలని అధికారులు సూచిం చారు. అలాగే ఎబోలా అనుమానితులు లేదా నిర్థారిత రోగుల రక్తం, శరీర ద్రవాలతో నేరుగా సంబంధం కలిగిన ప్రయాణికులు కూడా వెంటనే ఆరోగ్య అధికారులను సంప్రదించాలని డీజీహెచ్ఎస్ పేర్కొంది. ఇది ఇతర ప్రయాణికుల భద్రత దృష్ట్యా అత్యంత కీలకమని పేర్కొంది. అదేవిధంగా, భారత్కు వచ్చిన తర్వాత 21 రోజుల లోపు ఎవరైనా పైన చెప్పిన లక్షణాలతో బాధపడితే వెంటనే వైద్యులను సంప్రందించాలని, తమ ప్రయాణ చరిత్రను అధికారులకు వెల్లడించాలని సూచించింది.

ప్రయాణికుల భద్రత, అంతర్జాతీయ ఆరోగ్య నిబంధనలు (ఐహెచ్ఆర్) ప్రకారం స్క్రీనింగ్, ఆరోగ్య పరీక్షలు, ప్రజారోగ్య చర్యలకు సహకరించాలని కోరింది. ఇదిలా ఉండగా, దేశంలో ఇప్పటివరకు ఎబోలా కేసులు ఏమీ నమోదు కాలేదని కేంద్ర ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. అయినప్పటికీ ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని కేంద్ర ఆరోగ్య కార్యదర్శి పుణ్య సలిలా శ్రీవాస్తవ పేర్కొన్నారు. ఈ క్రమంలో రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా విమానాశ్రయాల్లో స్క్రీనింగ్, క్వారంటైన్ విధానాలు, నమూనాల పరీక్షలు, రోగుల చికిత్స వంటి పరీక్షలకు సంబంధించిన వివరణాత్మక కార్యచరణ విధానాలను ఇప్పటికే రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు పంపినట్టు తెలిపారు. ఎబోలా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే వారం ఢిల్లీలో జరగాల్సిన 4వ భారత్- ఆఫ్రికా ఫోరమ్ సదస్సును తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్టు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ గురువారం అధికారికంగా ప్రకటించింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana