Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఎండపోటు.. కుక్కకాటు..!

ఎండపోటు.. కుక్కకాటు..!

గ్రేటర్ పరిధిలో 
వీధి కుక్కల వీరంగం నల్లకుంట ఫీవర్ ఆస్పత్రికి బాధితుల క్యూ
ప్రతిరోజూ 
350-400 మంది రాక
ఐపీఎంకు 150 వరకు 
బాధితుల పరుగు
నవతెలంగాణ-సిటీబ్యూరో

గ్రేటర్ హైదరాబాద్లో వీధి కుక్కల బెడద ఎక్కువవుతోంది. కుక్కలు వీధుల్లో ఎక్కడ చూసినా గుంపులు గుంపులుగా తిరుగుతున్నాయి. ఇంటి ముందు ఆడుకునే పిల్లల నుంచి, రోడ్డు మీద వెళ్లే పెద్దల వరకూ అందరిపైనా దాడి చేస్తున్నాయి. మోటారు సైకిల్పై వెళ్లే వారిని వెంబడిస్తున్నాయి. ఇటీవల కుక్కకాటు బాధితుల సంఖ్య భారీగా పెరుగుతోంది. నల్లకుంట ఫీవర్ ఆస్పత్రికి రోజుకు సగటున 350-400 వరకు బాధితులు క్యూ కడుతున్నారు. మిగతా ప్రభుత్వ, ప్రయివేటు ఆస్పత్రులకు చేరేవారి సంఖ్య అదనం.

వేసవిలో బాధితుల సంఖ్య ఎక్కువే..!
గ్రేటర్ హైదరాబాద్లో ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరిగాయి. ఈ వేడికి జనంతోపాటు, జంతుజాలం కూడా అల్లాడుతోంది. వీధి కుక్కలపై వేసవి ప్రభావం తీవ్రంగా ఉంటోందని వైద్యులు చెబుతున్నారు. సాధారణ సమయంలో ఎక్కడ పడితే అక్కడ నీరు లభిస్తుంది.. కానీ ఎండాకాలంలో మాత్రం లభించడం కష్టం. వీధి కుక్కలకు ఇది చాలా సంకట సమయం. నగరంలో ఈ పరిస్థితి మరీ ఎక్కువ. ఒకవైపు నీళ్లు దొరక్క.. మరోవైపు ఎండ వేడితో వీధి కుక్కలు అల్లాడిపోతుంటాయి. మనుషులకు శరీరం వేడెక్కినప్పుడు చల్లబర్చడానికి చెమట పడుతుంది. కుక్కలకు ఆ పరిస్థితి ఉండదు. దీంతో అవి త్వరగా వడదెబ్బకు గురవుతుంటాయి. వాటి ప్రవర్తనలో మార్పు వస్తుంది. ఈ సమయంలో వాటి దగ్గరకు వెళ్లినా, కవ్వించినా.. దాడి చేస్తుంటాయి.

ఫీవర్ ఆస్పత్రిలో లైఫ్ సేవింగ్ టీకా
నగరంతోపాటు చుట్టుపక్కల జిల్లాల్లో కుక్కకాటు బాధితులకు నట్లకుంట ఫీవర్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఇక్కడికి సాధారణ రోజుల్లో 150 వరకు బాధితులు వస్తుంటే.. వేసవిలో దాదాపు 400 మంది వరకు కుక్కకాటు బాధితులు చికిత్స కోసం వస్తున్నారు. దీంతో బాధితుల కోసం లైఫ్ సేవింగ్ టీకా ఇమ్యునోగ్లోబిన్ వ్యాక్సిన్ను అందుబాటులో ఉంచుతున్నారు. అవసరాలకు అనుగుణంగా వ్యాక్సినేషన్ ఇస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, కుక్క కాటుకు గురైన వెంటనే చికిత్స తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

నారాయణగూడ ఐపీఎంకు బాధితుల క్యూ
మహానగరం చుట్టుపక్కల ప్రాంతాల్లో కుక్కకాట్లు పెరుగుతున్నాయి. నారాయణగూడలోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ (ఐపీఎం)ను ఈ ఏడాది జనవరిలో 3,897 మంది, ఫిబ్రవరిలో 3,759 మంది, మార్చిలో 3,713 మంది రేబిస్ టీకాల కోసం సంప్రదించారు. ఏప్రిల్లో మరో 3వేల మందికిపైగా టీకా తీసుకున్నారు. మొత్తంగా నాలుగు నెలల్లో బాధితుల సంఖ్య 12 వేలు దాటింది. మరో 25వేల మందికిపైగా ఇప్పటికే టీకాలు తీసుకుంటున్నారు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 వరకు ఐపీఎంలో టీకా అందుబాటులో ఉంటుంది. ఉచితంగా అందిస్తారు. వీధి లేదా పెంపుడు కుక్క కరిచిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయకూడదని వైద్యులు సూచిస్తున్నారు. కరిచినప్పుడు సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే.. ప్రాణాంతకమైన రేబిస్ వ్యాధి వచ్చే ముప్పు ఉందని హెచ్చరిస్తున్నారు.

కుక్క కరిస్తే నిర్లక్ష్యం చేయొద్దు : 
డాక్టర్ శివలీల, డైరెక్టర్, ఐపీఎం, నారాయణగూడ
వేసవిలో కుక్క కాట్లు పెరుగుతాయి. ఎండ వేడికి వాటిలో వచ్చే శారీరక మార్పుల వల్ల కుక్కలు గందరగోళంగా ఉంటాయి. వాటి సమీపంలోకి వెళ్లినప్పుడు దాడి చేస్తాయి. కుక్క కరిస్తే నిర్లక్ష్యం చేయొద్దు. వెంటనే చికిత్స చేయించుకోవాలి. వెంటనే యాంటీ రేబిస్ టీకా తీసుకోవాలి. ఐపీఎంలో ఈ టీకాలను ఉచితంగా అందిస్తున్నాం. 0, 3, 7, 14, 28వ రోజుల్లో 5 డోసులు ఇస్తాం. పెంపుడు కుక్కలకు ముందే యాంటీరేబిస్ టీకాలు ఇప్పించాలి. అవి కరిచినా సరే వైద్యులను సంప్రదించాలి. పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana