పవన్ కళ్యాణ్కు తెలంగాణలో ఏం పని ?: రౌండ్టేబుల్ సమావేశంలో
కల్వకుంట్ల కవితనవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఆంధ్ర ప్రదేశ్ ప్రజలతో తమకు ఎలాంటి ఇబ్బంది లేదని టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత అన్నారు.
సోమవారం హైదరాబాద్ బంజారాహిల్స్ లోని తెలంగాణ రక్షణ సేన కార్యాలయంలో జరిగిన 'ఉద్యమకారుల ఆకాంక్షలు - సాధన' పై నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ ఆంధ్రా రాజకీయ నాయకులతోనే సమస్య అని చెప్పారు. తాము అధికారంలోకి రాగానే ఆంధ్రా నాయకుల విగ్రహాలు పార్సల్ పంపుతామన్నారు. తెలంగాణ అస్తిత్వంపై దాడి చేస్తూ వారి సంస్కృతిని రుద్దుతామంటే ఊరుకోబోమని హెచ్చరించారు.
పీవీ, ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాలను అమరావతిలో పెడతారా?అని ప్రశ్నించారు. సీఎం రేవంత్రెడ్డి ఆంధ్రా రాజకీయ నాయకుల ఏజెంట్ అని ఎద్దేవా చేశారు. రాజధాని కట్టడం చేతకాకే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని అన్నారు. తెలంగాణ ఇస్తే 11 రోజులు అన్నం మానేసిన పవన్ కళ్యాణ్ కు ఇప్పుడు ఇక్కడేం పని?అని ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షలను రాష్ట్ర ప్రభుత్వం నెరవేర్చాలని డిమాండ్ చేశారు. వారికి ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరారు. హైదరాబాద్లో జయశంకర్ విగ్రహాన్ని పెట్టడం చారిత్రక అవసరమని అన్నారు.

