- స్థానికంగానే అత్యవసర శస్త్రచికిత్సలు- వంద పడకల ఆస్పత్రి పూర్తయితే మరిన్ని సేవలు
- హర్షం వ్యక్తం చేస్తున్న పట్టణ ప్రజలు
నవతెలంగాణ-అశ్వారావుపేట
అశ్వారావుపేట ఏరియా ఆసుపత్రిలో జనరల్ సర్జరీ సేవలు అందుబాటులోకి వచ్చాయి.దీంతో ఇప్పటివరకు శస్త్రచికిత్సల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన రోగులకు స్థానికంగానే వైద్య సేవలు అందనున్నాయి. ఆసుపత్రిలో కొత్తగా ఐదుగురు నిపుణులైన వైద్యులు విధుల్లో చేరడంతో వైద్య సేవలు మరింత విస్తరించాయి.
జనరల్ సర్జన్ డాక్టర్ అంబటి శైలేంద్ర కుమార్ ఆధ్వర్యంలో బుధవారం దమ్మపేట మండలానికి చెందిన మొడియం జ్యోతికి మోకాలి పైభాగంలో ఉన్న కణితిని తక్కువ మోతాదులో మత్తుమందు ఇచ్చి విజయవంతంగా శస్త్రచికిత్స నిర్వహించారు. అనంతరం రోగి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.
ఏరియా ఆసుపత్రిలో జనరల్ సర్జరీ సేవలు ప్రారంభం కావడంపై స్థానికులు, రోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాధారుక్మిణి మాట్లాడుతూ ఆసుపత్రిలో వైద్య సేవలను మరింత విస్తరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. భవిష్యత్తులో ప్రజలకు మరిన్ని మెరుగైన వైద్య సేవలు అందించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు.
అశ్వారావుపేట ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు సహకరిస్తున్న స్థానిక ఎమ్మెల్యే జారే ఆదినారాయణ, జిల్లా కలెక్టర్ అంకిత్, డీసీహెచ్ఎస్ రవిబాబులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. వంద పడకల ఆసుపత్రి పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే ప్రజలకు మరిన్ని వైద్య సేవలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని ఆసుపత్రి వర్గాలు పేర్కొన్నాయి.
కార్యక్రమంలో జనరల్ సర్జన్ డాక్టర్ అంబటి శైలేంద్ర కుమార్, మత్తు వైద్య నిపుణురాలు డాక్టర్ మౌనిక, ఆర్ఎంఓ డాక్టర్ మౌనిక, హెడ్ నర్సింగ్ ఆఫీసర్ వర్ధిని, ఆపరేషన్ థియేటర్ నర్సింగ్ ఆఫీసర్ సుజాతతో పాటు ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.

