Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఏసీబీ వలలో అవినీతి తిమింగలం

ఏసీబీ వలలో అవినీతి తిమింగలం

​మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా 
డిప్యూటీ కలెక్టర్ ఆస్తులపై దాడులు

దాదాపు రూ.200 కోట్ల పైనే ఉన్నట్టు అంచనా
నిందితుడు వంశీమోహన్ అరెస్టు

నవతెలంగాణ -ప్రత్యేక ప్రతినిధి

ఏసీబీ వలకు మరో భారీ అవినీతి తిమింగలం చిక్కింది. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా డిప్యూటీ కలెక్టర్ అక్రమాస్తులపై శుక్రవారం అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు దాడులు జరిపి అక్రమాస్తుల గుట్టును రట్టు చేశారు. వాటి ప్రస్తుత మార్కెట్ విలువ దాదాపు రూ.200 కోట్లపైనే ఉంటుందని అంచనా వేశారు. ఏసీబీ డైరెక్టర్ జనరల్ చారు సిన్హా ఆదేశాల మేరకు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా డిప్యూటీ కలెక్టర్ వంశీమోహన్ కు చెందిన ఆస్తులపై ఏసీబీ ప్రత్యేక టీమ్లు ఉదయం నుంచే మెరుపుదాడులు సాగించాయి. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో ఉన్న వంశీమోహన్ నివాసాలు, ప్లాట్లు, ఫామ్హౌజ్, వ్యవసాయ భూములపై ఏకకాలంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. వంశీమోహన్ బంధవులు, బినామీల నివాసాల్లోనూ ఏసీబీ సోదాలు కొనసాగాయి. ఈ సోదాల్లో మొత్తం రూ.4.40 కోట్ల విలువచేసే 19 ఓపెన్ ప్లాట్లు బయటపడ్డాయి. అలాగే వనస్థలిపురంలో ఒక ఇల్లు, మసీదుబండలో మరో ఇల్లు, మణికొండలో ఇంకో ఇంటిని వంశీమోహన్ కలిగి ఉన్నట్లు గుర్తించారు. వీటి విలువ కోట్లల్లోనే ఉంటుందని ఏసీబీ అధికారులు తెలిపారు. అలాగే ఇంట్లో 122 తులాల బంగారు నగలు, రూ.20 లక్షల నగదు, బ్యాంకు లాకర్లలో మరో రూ.10 లక్షల నగదును కూడా ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

రూ.32 లక్షల విలువైన రెండు ఖరీదైన కార్లను కూడా నిందితుడు కల్గి ఉన్నట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు. వీటితో పాటు భూములకు సంబంధించిన దస్తావేజులను కూడా ఇంట్లో కనుగొన్నారు. వీటికి సంబంధించి ప్రస్తుత అధికారిక విలువ రూ.6 కోట్లా 55 లక్షలా 25 వేలు కాగా బహిరంగ మార్కెట్లో వీటి విలువ రూ.200 కోట్లకు పైనే ఉంటుందని అంచనా వేస్తున్నట్టు ఏసీబీ అధికారులు తెలిపారు. ఇవేకాక అబ్దుల్లాపూర్ మెట్లో అతని మామ విజయకుమార్ పేరిట 8 ఎకరాల భూమి కలిగి ఉన్నాడని, ఇది వంశీ బినామీ ఆస్తులే అనే అనుమానం తమకుందని, వాటిపై లోతైన విచారణ జరుపుతున్నామని అధికారులు తెలిపారు. మొత్తం మీద డిప్యూటీ కలెక్టర్ వంశీమోహన్ ను అరెస్టు చేసిన ఏసీబీ అధికారులు ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరుపరిచి న్యాయమూర్తి ఆదేశాల మేరకు నిందితున్ని చంచల్గూడ జైలుకు తరలించారు. కోర్టు అనుమతితో తిరిగి వంశీమోహన్ను తమ కస్టడీకి తీసుకుని మరింత లోతుగా విచారణ జరుపుతామని ఏసీబీ అధికారులు తెలిపారు. ​

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana