Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఏటా భూముల ధరలు పెంపు

ఏటా భూముల ధరలు పెంపు

సర్కారు సమాలోచన ఇతర రాష్ర్టాల్లో ఇదే విధానం అమలు
రాష్ట్రంలో 4 ఏండ్ల నుంచి సవరించని ప్రభుత్వం

ప్రభుత్వానికి ఏటా రూ.1,200 కోట్ల నుంచి రూ.1,500 కోట్ల ఆదాయం

నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో ప్రతి ఏటా భూముల ధరలను పెంచాలని ప్రభుత్వం భావిస్తున్నది. 2022లో భూముల ధరలను ప్రభుత్వం సవరించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ధరలను పెంచలేదు. ఈ ఏడాది భూముల ధరలను పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఇతర రాష్ట్రాల్లో ఏటా భూముల ధరలు పెరిగే పద్ధతి అమలవుతున్నదని రెవెన్యూ శాఖ అధికారులు చెప్తున్నారు. మార్కెట్ ధరలకు, ప్రభుత్వ భూమి విలువకు వ్యత్యాసం కూడా ఎక్కువగా ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తున్నది. భూముల ధరల పెంపుతో ఏటా రూ.1,200 కోట్ల నుంచి రూ.1,500 కోట్ల ఆదాయం సమకూరుతుందని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేస్తున్నది. అయితే భూముల ధరల సవరణకు సంబంధించి ఈనెల 23 లేదా 25న జిల్లా స్థాయిలో అదనపు కలెక్టర్లు సమావేశాలను నిర్వహించి ఆ తర్వాత వాటిని ఖరారు చేసే అవకాశమున్నది. అనంతరం ప్రభుత్వ ఆమోదం పొందిన వెంటనే భూముల ధరల పెంపునకు సంబంధించిన ఉత్తర్వులను విడుదల చేయాలని అధికారులు భావిస్తున్నారు. సవరించిన భూముల ధరలను ఈనెల 26 లేదా 28 నుంచి అమల్లోకి తేవాలని ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది.

​సర్వే నెంబర్ల వారీగా భూముల విలువ
రాష్ట్రంలో వ్యవసాయ, వ్యవసాయేతర భూములు, వాటి ఆస్తుల విలువకు సంబంధించిన వివరాలను ఆన్లైన్లో అప్లోడ్ చేసే ప్రక్రియ పూర్తయ్యింది. గ్రామాల వారీగా వచ్చిన వ్యవసాయ భూముల విలువలను సర్వే నెంబర్ల వారీగా అధికారులు సిద్ధం చేస్తున్నారు. ఈ వివరాలను భూభారతి పోర్టల్తో అనుసంధానం చేస్తున్నారు. సర్వే నెంబర్ ఆధారంగా భూమి విలువ ఉండడంతో రాష్ట్రంలో ఎక్కడినుంచైనా వాటిని చూసుకోవడానికి అవకాశముంటుంది.

హైదరాబాద్లో 
ఎకరా భూమి విలువ రూ.30 కోట్లు
హైదరాబాద్ నగరంలో భూముల మార్కెట్ విలువ భారీగానే ఉన్నది. ఎకరా భూమి విలువ రూ.30 కోట్ల నుంచి రూ.150 కోట్ల వరకు ఉన్నది. ప్రభుత్వ విలువ మాత్రం రూ.రెండు కోట్ల నుంచి రూ.2.5 కోట్ల వరకే ఉన్నది. దీన్ని రూ.నాలుగు కోట్ల వరు పెంచాలని ప్రభుత్వం భావిస్తున్నది. ఇంకోవైపు వ్యవసాయ భూములు, అపార్ట్మెంట్ల ఫ్లాట్ల విషయంలో కనిష్ట, గరిష్ట విలువల్లో పెద్దగా మార్పు లేనట్టే కనిపిస్తున్నది. హైదరాబాద్లో కొన్ని ప్రాంతాల్లో చదరపు అడుగు గరిష్ట ధర రూ.1.20 లక్షల లోపే ఉన్నది. అపార్ట్మెంట్లలో చదరపు గజం గరిష్ట విలువ రూ.7,500 నుంచి రూ.7,800 వరకు ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. అన్ని ప్రాంతాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వ విలువ రూ.ఆరు వేలు ఉండేలా నిర్ణయం తీసుకునే అవకాశమున్నది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana