Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఫైర్ ఎన్ఓసీల్లో సంతకాల ఫోర్జరీ తీవ్ర నేరం

ఫైర్ ఎన్ఓసీల్లో సంతకాల ఫోర్జరీ తీవ్ర నేరం

బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి అన్ని ప్రయివేటు కళాశాలలపై 
సమగ్ర విచారణ జరపాలి
ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్

హైడ్రా కమిషనర్ రంగనాథ్ సంతకాన్ని ఫోర్జరీ చేసి ఫైర్ ఎన్వోసీలను ఇంటర్మీడియట్ బోర్డుకు సమర్పించిన ఘటనపై ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.

ఈ మేరకు బుధవారం ఆ సంఘం రాష్ట్ర అధ్యక్ష్య, కార్యదర్శులు ఎస్.రజనీకాంత్, టి.నాగరాజు ఒక ప్రకటన విడుదల చేశారు. విద్యార్థుల ప్రాణాలకు సంబంధించిన అగ్నిమాపక భద్రత వంటి కీలక అంశంలో నకిలీ పత్రాలు సమర్పించడం తీవ్రమైన నేరం మాత్రమే కాకుండా విద్యా వ్యవస్థపై ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీసే చర్య అని వారు ఖండించారు. అధికారులు గుర్తించిన హైందవీ జూనియర్ కాలేజీ (బర్కత్పుర), రెసోనెన్స్ జూనియర్ కాలేజీ (ఎస్ఆర్ నగర్), ప్రియాంక జూనియర్ కాలేజీ (మెహిదీపట్నం), మదర్స్ గర్ల్స్ జూనియర్ కాలేజీ (విద్యానగర్), శ్రీచైతన్య జూనియర్ కాలేజీ (చంద్రాయణగుట్ట), న్యూ ఎరా జూనియర్ కాలేజీ (చిక్కడపల్లి), షాహీన్ జూనియర్ కాలేజీ (శివరాంపల్లి), వశిష్ట జూనియర్ కాలేజీ (తెల్లాపూర్)లపై కేసులు నమోదు కావడం, గుర్తింపును రద్దు చేయాలని ఇంటర్ బోర్డుకు ఫిర్యాదు చేయడాన్ని వారు స్వాగతించారు. అయితే కేసుల నమోదు, గుర్తింపు రద్దు, బోర్డుకు ఫిర్యాదు వంటివి కేవలం ఈ ఎనిమిది కళాశాలలకే పరిమితం కావద్దని కోరారు.

రాష్ట్రంలోని అన్ని ప్రయివేటు జూనియర్ కళాశాలల్లో ఫైర్ సేఫ్టీ, భవన భద్రత, అనుమతులు, ఎన్వోసీలపై సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే మరో 60 కళాశాలల ఎన్వోసీలను అధికారులు పరిశీలిస్తున్నట్టు ప్రకటించడం పరిస్థితి తీవ్రతను సూచి స్తోందని తెలిపారు. విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడే యాజమాన్యాలపై కఠినమైన క్రిమినల్ చర్యలు తీసుకోవా లని విజ్ఞప్తి చేశారు. నకిలీ పత్రాల ఆధారంగా అనుమతులు పొందిన కళాశాలల గుర్తింపును వెంటనే రద్దు చేయాలని పేర్కొన్నారు.

ప్రతి విద్యాసంస్థలో అగ్నిమాపక భద్రతా ప్రమాణాలను కచ్చితంగా అమలు చేస్తున్నారా? లేదా? అనే అంశంపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని కోరారు. నిబంధనలు ఉల్లంఘించే యాజమాన్యాలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని, ఇంటర్మీడియట్ విద్యా మండలిని వారు డిమాండ్ చేశారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana