Dailyhunt
ఫీజుల రీయింబర్స్మెంట్ పథకం రద్దుకు కుట్ర..

ఫీజుల రీయింబర్స్మెంట్ పథకం రద్దుకు కుట్ర..

- పేద విద్యార్థుల ఉన్నత విద్యకు ముప్పు, ప్రభుత్వం తక్షణమే స్పందించాలని డిమాండ్- బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు నీల నాగరాజు
నవతెలంగాణ - కామారెడ్డి : జిల్లా కేంద్రంలోనీ జిల్లా కార్యాలయంలో జరిగిన సమావేశంలో బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు నీల నాగరాజు మాట్లాడుతూ ఫీజుల రీయింబర్స్మెంట్ పథకాన్ని నీరుగార్చేందుకు కుట్ర జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.

గత నాలుగు సంవత్సరాలుగా ఫీజుల బకాయిలు పూర్తిగా విడుదల చేయకపోవడంతో ప్రైవేట్ కళాశాల యజమాన్యాలు న్యాయస్థానాన్ని ఆశ్రయించాల్సి వచ్చిందన్నారు.

ప్రభుత్వం ఫీజులు చెల్లించకపోతే కళాశాలలు విద్యార్థుల నుంచే ఫీజులు వసూలు చేసుకోవచ్చని హైకోర్టు తీర్పు ఇవ్వడం వల్ల పేద విద్యార్థుల ఉన్నత విద్యకు ఆటంకం కలుగుతుందని ఆయన పేర్కొన్నారు. ఫీజులు చెల్లించే స్థోమత లేని పేద విద్యార్థుల కోసం తీసుకువచ్చిన ఈ పథకం అమలు లేకపోతే వారి భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందని అన్నారు.

ఫీజుల రీయింబర్స్మెంట్ నిధులను విడుదల చేయడంపై ముఖ్యమంత్రి తక్షణమే స్పందించాలని డిమాండ్ చేశారు. ఈ పథకాన్ని అమలు చేయకపోతే బీసీ మంత్రులు తమ పదవులకు రాజీనామా చేయాలని కోరారు. పథకం రద్దు జరిగితే ప్రభుత్వానికి తీవ్రమైన ప్రతికూల ప్రభావాలు ఉంటాయని హెచ్చరించారు. గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2008 లో బీసీ విద్యార్థుల ఉన్నత చదువులకు భరోసా కల్పించేందుకు ఫీజుల రీయింబర్స్మెంట్ పథకాన్ని సాధించుకున్నామని గుర్తుచేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా ఈ పథకం కొనసాగుతున్నప్పటికీ, ప్రస్తుతం ప్రభుత్వం దీన్ని బలహీనపరుస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

రాష్ట్రంలో గత ఐదేళ్లుగా ఫీజుల బకాయిలు విడుదల కాకపోవడంతో అనేక మంది విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వేలాది మంది ఉన్నత విద్యకు దూరమవుతున్నారని తెలిపారు. ఒకవైపు విద్యకు ప్రాధాన్యత ఇస్తున్నామని ప్రభుత్వం చెబుతూనే, మరోవైపు ఈ పథకాన్ని అమలు చేయడంలో నిర్లక్ష్యం చూపుతోందని విమర్శించారు.

హైకోర్టు తాజా తీర్పు నేపథ్యంలో ప్రభుత్వం తన వైఖరిని స్పష్టంగా ప్రకటించాలని, బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంటే వెంటనే చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కలను ఆయన కోరారు. బీసీ మంత్రులు తమ బాధ్యతలను నిర్వర్తించకపోతే పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. బీసీల హక్కుల కోసం అవసరమైతే పెద్దఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి రాజేందర్, ప్రశాంత్, సాత్విక్, హరికృష్ణ, గణేష్, రాము, వినయ్, కృష్ణ, సుమన్ తదితరులు పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana