Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
గాజాలో శాంతి ఒప్పందం కుదిరింది

గాజాలో శాంతి ఒప్పందం కుదిరింది

ఆయుధాలను హమాస్ విడనాడిందిఇక ఇజ్రాయిల్కు భద్రత లభిస్తుంది : ట్రంప్

వాషింగ్టన్ : గాజాలో హమాస్, ఇతర సాయుధ గ్రూపులు ఆయుధాలు విడనాడాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు.

దీనిని చారిత్రక ఒప్పందంగా ఆయన అభివర్ణించారు. 'ఈ రోజు గాజాలో హమాస్, ఇతర సాయుధ గ్రూపులన్నీ పూర్తిగా ఆయుధాలను విడనాడాయి. శాంతి బోర్దు చారిత్రక ఒప్పందం కుదిర్చింది' అని ఆయన తన సామాజిక మాధ్యమ వేదిక ట్రూత్ సోషల్లో పోస్ట్ చేశారు. చిరకాల శాంతి, భద్రత దిశగా ఇది అతి పెద్ద చర్య అని తెలిపారు. అయితే ఒప్పందం కుదిరిన విషయాన్ని హమాస్ ఇంకా ధృవీకరించలేదు. గాజాలో కార్యకలాపాలు సాగిస్తున్న మరో మిలిటెంట్ గ్రూప్ పాలస్తీనియన్ ఇస్లామిక్ జిహాద్ మూవ్మెంట్ శుక్రవారం ఉదయం ఓ ప్రకటన చేస్తూ ఒప్పందం నివేదికలు అసంపూర్తిగా ఉన్నాయని తెలిపింది. కాల్పుల విరమణలో హమాస్తో పాటు ఈ గ్రూపు కూడా భాగస్వామే.

శాంతి బోర్డు ఏం చెప్పింది?
హమాస్, ఇతర సాయుధ గ్రూపులు కమిటీకి ఆయుధాలు అప్పగిస్తాయని శాంతి బోర్డు ప్రతినిధి ఒకరు చెప్పారు. ముందుగా పోలీసు ఆయుధాల బదిలీ జరుగుతుందని, ఆ తర్వాత వ్యక్తిగత ఆయుధాల అప్పగింత పూర్తవుతుందని తెలిపారు. గాజాలో యుద్ధాన్ని ముగించేందుకు, సాంకేతిక నిపుణుల ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ట్రంప్ ప్రతిపాదించిన బహుళ దశల శాంతి ప్రణాళిక అమలులో హమాస్ను ఆయుధాలు విడనాడేలా చేయడం కీలకమైన అడుగు. ప్రణాళిక అమలు కోసం హమాస్తో మధ్యవర్తులు అనేక నెలలుగా సంప్రదింపులు జరుపుతున్నారు. కాగా ఒప్పందం అమలు విషయంలో హమాస్ తన మాటను నిలబెట్టుకుంటుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 'ఒప్పందం అమలైతే హమాస్ తన వద్ద ఉన్న ఆయుధాలను అప్పగిస్తుంది. అధికారం తాత్కాలిక యంత్రాంగం చేతికి వస్తుంది. ప్రభుత్వం, పాలన నుంచి హమాస్ వైదొలుగుతుంది. ఇవన్నీ పాలస్తీనా ప్రజలకు రాజకీయ భవిష్యత్తు కల్పిస్తాయి' అని శాంతి బోర్డు ప్రతినిధి వివరించారు. 'మొట్టమొదటిసారిగా తన వద్ద ఉన్న ఆయుధాలన్నింటినీ వదులుకునేందుకు ఓ ఆచరణాత్మక ప్రణాళికకు హమాస్ కట్టుబడి ఉంది. ఆ తర్వాత గాజా నుంచి ఇజ్రాయిల్ వైదొలుగుతుంది. మెరుగైన భవిష్యత్తు కోసం చాలా కాలంగా ఎదురు చూస్తున్న గాజా ప్రజలకు ఇది గణనీయమైన ప్రయోజనాలను, ఇజ్రాయిల్ ప్రజలకు భద్రతను అందిస్తుందని ఆశిస్తున్నాం' అని శాంతి బోర్డు సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్లో తెలియజేసింది.

అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు: ట్రంప్
ఈ ఒప్పందం గాజాను నూతన పాలస్తీనా ప్రభుత్వం పాలించేందుకు వీలు కల్పిస్తుందని, అది శాంతి బోర్డుతో కలిసి పనిచేస్తుందని ట్రంప్ చెప్పారు. గాజా ఇకపై ఉగ్రవాద దాడులకు స్థావరంగా ఉపయోగ పడకుండా ఇజ్రాయిల్కు భద్రత లభిస్తుందని అన్నారు. నెలల తరబడి జరిగిన చర్చల కారణంగా ముందడుగు పడిందని, ఏం చేయాలనే దానిపై అవగాహన కలిగిందని అమెరికా, శాంతి బోర్డు తెలియజేశాయి. అయితే ఇది షరతులతో కూడిన ఒప్పందమేనని స్పష్టం చేశాయి. ఒప్పందాన్ని కుదర్చడంలో సాయపడిన ఈజిప్ట్, ఖతార్, టర్కీ మధ్యవర్తులకు ట్రంప్ కృతజ్ఞతలు తెలిపారు. 'ఎన్నటికీ సాధ్యం కాదని అందరూ భావించిన అద్భుతాన్ని అందించిన అందరికీ అభినందనలు' అని అన్నారు. ఒప్పందం అమలుకు సమయం పడుతుందని, రెండు వారాలలో షరతులను ప్రచురిస్తామని అధికారులు చెప్పారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana