Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
గాలిదుమారం.. ఈదురుగాలులు

గాలిదుమారం.. ఈదురుగాలులు

రుములు, పిడుగులతో వర్షాలు.. పంటలకు తీవ్రనష్టంకొనుగోలు కేంద్రాల్లో తడిసిన పంటలు
నేలకొరిగిన చెట్లు, వంగిన విద్యుత్ స్తంభాలు
చీకట్లు కమ్ముకున్న పలు గ్రామాలు

నవతెలంగాణ- విలేకరుల బృందం
రాష్ట్రంలోని పలు జిల్లాలో ఆదివారం ఈదురు గాలులతో కూడిన వర్షం పడింది. ఎండ వేడిమితో ఇబ్బంది పడుతున్న జనానికి ఈ వర్షాలు ఉపశమనం కలిగించినా కొనుగోలు కేంద్రాల్లో పంటలు తడిసిపోయాయి. నల్లగొండ జిల్లా నకిరేకల్ మండలంలో భారీ ఈదురుగాలుల వల్ల తీవ్ర నష్టం వాటిల్లింది. రోడ్డు వెంట ఉన్న చెట్లు, కరెంటు స్తంభాలు కూలిపోయాయి. కొనుగోలు కేంద్రాలలో ధాన్యంపై వేసిన పట్టాలు లేచిపోవడంతో ధాన్యం తడిసింది. నకిరేకల్-నోముల రహదారిలో రోడ్డుకు అడ్డంగా చెట్లు పడిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కడపర్తి, నెల్లిబండ, చందంపల్లి, గొల్లగూడెం, చందుపట్ల తదితర గ్రామాలలో నిమ్మ, మామిడి కాయలు రాలిపోయాయి. కొన్నిచోట్ల నిమ్మ, మామిడి చెట్లు కూలిపోయాయి. తాటికల్, నకిరేకల్ పట్టణంలోని వివిధ ప్రాంతాలలో ఎల్టీ లైన్లు, 11కేవీ వైరు తెగిపడ్డాయి. సుమారు 30 కరెంటు స్తంభాలు కూలిపోయాయి.నార్కట్పల్లి మండలంలోని అక్కెనపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ తీగలు తెగిపడడం, విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. తిప్పర్తి మండలంలో ఈదురు గాలుల బీభత్సానికి మండలంలో వందల ఎకరాల్లో బొప్పాయి,మామిడి,నిమ్మ తోటలు నేలరాలాయి. సూర్యాపేట జిల్లాలో ఈదురుగాలులు, వర్షం బీభత్సం సృష్టించింది. ప్రధాన రోడ్ల వెంట గల వృక్షాలు నేలకొరిగాయి. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో, ఇతర ప్రాంతాల్లో రైతుల ధాన్యం తడిసింది. తిరుమలగిరిలో మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఒక్కసారిగా కురిసిన అకాలవర్షంతో ఐకేపీ సెంటర్లలో ఆరబోసిన ధాన్యం తడవడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. ఖమ్మం జిల్లాలోని ముదిగొండ, బోనకల్, కూసుమంచి, తిరుమలాయపాలెం, తల్లాడలో ఆదివారం ఈదురు గాలులతో వర్షం పడింది. ఉరుములు మెరుపులతో భీభత్సమైన గాలితో వాన రావటంతో కొనుగోలు కేంద్రాలతోపాటు కల్లాలలో ఉన్న ధాన్యం, మొక్కజొన్నల వైపు రైతులు పరుగులు తీశారు. పంటలను తడవకుండా పట్టాలతో కప్పినా గాలికి లేచిపోయి పంటలు తడిసిపోయాయి. దీంతో రైతులు ఆందోళనకు గురయ్యారు. విద్యుత్ తీగలు తెగిపడటంతో పల్లెలు చీకటమయమయ్యాయి. ములుగు జిల్లా ఏటూరునాగారంలో గాలిదుమారం, ఈదురుగాలులు వచ్చాయి. మంచిర్యాల జిల్లా మందమర్రి, రామకృష్ణాపూర్లో చెట్లు నేలకొరిగాయి. విద్యుత్ స్తంభాలు దెబ్బతిన్నాయి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana