నవతెలంగాణ-హైదరాబాద్: హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తెలంగాణ ప్రభుత్వం తీపికబురు అందించింది. మెట్రో రైళ్లల్లో కొత్త కోచ్ లను తీసుకు రావాలని కీలక నిర్ణయం తీసుకుంది.
ప్రస్తుతం తిరుగుతున్న మెట్రో రైళ్లల్లో ప్రయాణికుల అవసరాలకు తగ్గట్టుగా సీటింగ్ కెపాసిటీ లేదు. రద్దీ ఎక్కువున్న సమయాల్లోనే కాకుండా సాధారణ రోజుల్లో కూడా ప్రయాణికులు నిల్చునే ప్రయాణిస్తున్నారు. దీనికి ముఖ్య కారణం ట్రైన్ లోని కుడి, ఎడమ భాగాల్లో మాత్రమే సీట్లు ఉండటం. మధ్య వరుసలో భోగీలన్నీ ఖాళీగానే ఉంటాయి.
దీంతో చాలా తక్కువ మంది ప్రయాణికులకు మాత్రమే సీట్లు దొరికే అవకాశం ఉంటుంది. ఉదయం, సాయంత్రం వేళల్లో రద్దీ మరింత ఎక్కువగా ఉండటంతో కనీసం నిల్చోని ప్రయాణం చేయడానికి కూడా ఖాళీ ఉండటం లేదు. దీంతో తర్వాతి ట్రైన్ కోసం నిరీక్షించాల్సి వస్తోంది. ప్రస్తుతం సమ్మర్ కావడంతో మెట్రోలో రద్దీ విపరీతంగా పెరిగింది.
జనంతో మెట్రో రైళ్లు కిటకిటలాడుతున్నాయి. ఈ క్రమంలో మెట్రో రైళ్లల్లో కొత్త కోచ్లు తీసుకురావాలని అధికారులు ఎప్పటినుంచో భావిస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పుడు మరో ముందడుగు పడింది. ఇటీవల మెట్రోను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడంతో కొత్త కోచ్ల ప్రతిపాదన మరోసారి తెరపైకి వచ్చింది. ఇందుకు వేగంగా అడుగులు ముందుకు పడుతున్నాయి. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది.

