Monday, 21 Sep, 12.46 am నవ తెలంగాణ

క్రీడలు
హైదరాబాద్ వేట..!

- సన్‌రైజర్స్‌తో కోహ్లిసేన ఢీ నేడు
- వార్నర్‌, విరాట్‌ షోపైనే ఆసక్తి
- రాత్రి 7.30 నుంచి స్టార్‌స్పోర్ట్స్‌లో..
2016 ఐపీఎల్‌ ఫైనలిస్ట్‌లు రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూర్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌లు నేడు సీజన్‌లో తమ తొలి మ్యాచ్‌లో బరిలోకి దిగబోతున్నాయి. 2019 సీజన్లో దారుణంగా విఫలమైన బెంగళూర్‌ బుడగ ఐపీఎల్‌లో మెరుగైన ప్రదర్శన ఆశిస్తోంది. సూపర్‌స్టార్‌ విరాట్‌ కోహ్లి తొలి ఐపీఎల్‌ టైటిల్‌ వేట యుఏఈలోనూ కొనసాగనుంది. మాజీ చాంపియన్‌ సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఎమిరేట్స్‌ పిచ్‌లపై సత్తా చాటేందుకు సిద్ధమవుతోంది. బలమైన బౌలింగ్‌ విభాగంతో నెమ్మదిగా స్పందించే పిచ్‌లపై దుమ్మురేపాలని ఆరెంజ్‌ ఆర్మీ భావిస్తోంది. దుబాయ్ (యుఏఈ)
ఐపీఎల్‌ తొలి టైటిల్‌ కోసం నిరీక్షిస్తున్న మూడో ప్రాంఛైజీ నేడు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో తలపడేందుకు సిద్ధమవుతోంది. ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మన్‌గా కొనసాగుతున్న విరాట్‌ కోహ్లి.. రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూర్‌కు తొలి టైటిల్‌ అందించేందుకు యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యుఏఈ)లో వేట మొదలుపెట్టనున్నాడు. డెవిడ్‌ వార్నర్‌ సారథ్యంలో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఎమరేట్స్‌ పిచ్‌లపై ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతోంది. హైదరాబాద్‌ పిచ్‌ పరిస్థితులను పోలి ఉండే దుబారులో సన్‌రైజర్స్‌ సొంత మైదానంలో ఆడుతున్న అనుకూలతలను అనుభవించనుంది. నేడు రాత్రి 7,30 గంటలకు హైదరాబాద్‌, బెంగళూర్‌ మ్యాచ్‌ ఆరంభం కానుంది.
బెంగళూరు బలం పెరిగింది! : జట్టు ప్రదర్శనతో నిమిత్తం లేకుండా విరాట్‌ కోహ్లి బ్యాటింగ్‌ విన్యాసాలు కొనసాగుతాయి. బెంగళూర్‌ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచినా, అట్టడగున నిలచినా.. విరాట్‌ కోహ్లి పరుగుల వేటలో ముందంజలో ఉంటాడు. ఈ సీజన్‌ అందుకు మినహాయింపు కాబోదు. పైగా పించ్‌ హిట్టిర్ల కంటే టెక్నిక్‌తో ఆడే బ్యాట్స్‌మెన్‌కు యుఏఈ పిచ్‌లు ఎక్కువగా అనుకూలిస్తాయి. విరాట్‌ కోహ్లి, ఏబీ డివిలియర్స్‌కు తోడు ఆసీస్‌ కెప్టెన్‌ అరోన్‌ ఫించ్‌ రాకతో బెంగళూర్‌ బ్యాటింగ్‌ లైనప్‌ మరింత బలోపేతంగా మారింది. యువ సంచలనం దేవదత్‌ పడికల్‌ ఐపీఎల్‌లో సత్తా చాటేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాడు. పేస్‌ విభాగం బెంగళూర్‌కు కాస్త బెంగగా మిగలనుంది. మహ్మద్‌ సిరాజ్‌, ఉమేశ్‌ యాదవ్‌, నవదీప్‌ సైనిలతో కూడిన పేస్‌ విభాగం ప్రత్యర్థులకు సవాల్‌ విసిరే అవకాశం లేదు!. క్రిస్‌ మోరిస్‌ అనుభవం పేస్‌ విభాగంలో కాస్త మార్పు తీసుకొచ్చే వీలుంది. స్పిన్నర్‌ యుజ్వెంద్ర చాహల్‌ కీలకం కానున్నాడు. పవన్‌ నేగి, వాషింగ్టన్‌ సుందర్‌లతో కూడిన స్పిన్‌ విభాగం ఉపయుక్తం కాదు. ఆల్‌రౌండర్‌ మోయిన్‌ అలీ సైతం ప్రత్యర్థి జట్లను ఇబ్బందికి గురిచేయగలడు.
సొంత మైదానంలోనే..! : ఐపీఎల్‌ వేదిక యుఏఈకి మారినా.. సన్‌రైజర్స్‌కు మాత్రం సొంతగడ్డ పరిస్థితుల్లో ఆడుతున్నట్టే ఉండనుంది. దుబాయ్, అబుదాబి పిచ్‌లు హైదరాబాద్‌ తరహాలోనే ఉంటాయి. విధ్వంసకారుడు డెవిడ్‌ వార్నర్‌ సారథ్యంలోని సన్‌రైజర్స్‌ ఈ సీజన్లో టైటిల్‌ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. జానీ బెయిర్‌స్టో జతగా వార్నర్‌ గత సీజన్లో అద్భుత ఇన్నింగ్స్‌లు నమోదు చేశాడు. మనీశ్‌ పాండే, కేన్‌ విలియమ్సన్‌లతో మిడిల్‌ ఆర్డర్‌ బాగుంది. యువ క్రికెటర్లు అబ్దుల్‌ సమద్‌, ప్రియాం గార్గ్‌, విరాట్‌ సింగ్‌లలో ఒకరు మిడిల్‌ ఆర్డర్‌లో చోటు దక్కించుకోనున్నారు. ఇక బౌలింగ్‌ విషయానికొస్తే సన్‌రైజర్స్‌కు ఎదురులేదు. భువనేశ్వర్‌ కుమార్‌, రషీద్‌ ఖాన్‌లు పేస్‌, స్పిన్‌ దాడికి నాయకత్వం వహించనున్నారు. టీ20 వరల్డ్‌ నం.1 ఆల్‌రౌండర్‌ మహ్మద్‌ నబి సేవలూ అందుబాటులో ఉన్నాయి. స్టార్‌ ఆల్‌రౌండర్‌ మిచెల్‌ మార్ష్‌ రూపంలో ఓ మ్యాచ్‌ ఫినిషర్‌ అందుబాటులో వచ్చాడు. నాణ్యమైన విదేశీ క్రికెటర్లను కలిగిన సన్‌రైజర్స్‌.. తుది జట్టులో నలుగురుని ఎంచుకోవటం క్లిష్టమైన పని. పేస్‌ విభాగంలో సందీప్‌ శర్మ, ఖలీల్‌ అహ్మద్‌, బసిల్‌ తంపీలు భువికి తోడుగా ఉండనున్నారు.
దుబాయ్ పిచ్‌ పేసర్లు, స్పిన్నర్లకు సమానంగా అనుకూలించనుంది. ఎకానమి విషయంలో స్పిన్నర్లది ఇక్కడ పైచేయి. అతి తక్కువ ఎకానమితో బౌలింగ్‌ చేసే రషీద్‌ ఖాన్‌, మహ్మద్‌ నబి సన్‌రైజర్స్‌కు ఎక్స్‌ ఫ్యాక్టర్‌ కానున్నారు. బిగ్‌ హిట్టింగ్‌కు వెళ్లకుండా ప్రశాంతంగా పరుగులు పిండుకునే విరాట్‌ కోహ్లి, కేన్‌ విలియమ్సన్‌, మనీశ్‌ పాండే, దేవదత్‌ పడిక్కల్‌ వంటి బ్యాట్స్‌మెన్‌ ఇక్కడ స్వేచ్ఛగా చెలరేగే అవకాశం కనిపిస్తోంది.
తుది జట్లు (అంచనా) :
సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ : జానీ బెయిర్‌స్టో (వికెట్‌ కీపర్‌), డెవిడ్‌ వార్నర్‌ (కెప్టెన్‌), మనీశ్‌ పాండే, విజయ్ శంకర్‌, విరాట్‌ సింగ్‌, అబ్దుల్‌ సమద్‌, మహ్మద్‌ నబి, రషీద్‌ఖాన్‌, భువనేశ్వర్‌ కుమార్‌, ఖలీల్‌ అహ్మద్‌, సందీప్‌ శర్మ.
రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూర్‌ : అరోన్‌ ఫించ్‌, దేవదత్‌ పడిక్కల్‌, విరాట్‌ కోహ్లి (కెప్టెన్‌), ఏబి డివిలియర్స్‌, మోయిన్‌ అలీ, శివం దూబె, వాషింగ్టన్‌ సుందర్‌, క్రిస్‌ మోరీస్‌, యుజ్వెంద్ర చాహల్‌, నవదీప్‌ సైని, ఉమేశ్‌ యాదవ్‌.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Navatelangana
Top