Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
హృదయాల మధ్య ఏర్పడే బంధమే స్నేహం

హృదయాల మధ్య ఏర్పడే బంధమే స్నేహం

నేను ఖమ్మం జిల్లాలో పుట్టాను. అమ్మ వీర రత్నమాల. నాన్న వీరయ్య. హైస్కూల్ విద్యాభ్యాసం మొత్తం ఖమ్మం జిల్లాలోని వివిధ గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో పూర్తి చేశాను.

తర్వాత కళాశాల విద్య కృష్ణా జిల్లాలో, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఆంధ్రా విశ్వ విద్యాలయంలో జరిగింది. చదువు పూర్తి చేసిన వెంటనే ఆంధ్రాబ్యాంకులో నా ఉద్యోగ జీవితం ప్రారంభమయింది. గుంటూరు జిల్లాలోనీ నరసరావుపేటలో మొదలు పెట్టి బదిలీపై నా స్వస్థలం ఖమ్మం జిల్లా అశ్వారావుపేటకి 1987లో వచ్చాను. అక్కడ సహోద్యోగిగా ఉన్న సుజాతతో నా స్నేహం మొదలైంది.అప్పటి నుంచి ఇప్పటి వరకూ ఏ మాత్రం విభేదాలు లేకుండా గత 40 ఏండ్లుగా మా స్నేహం కొనసాగుతుంది. అశ్వారావుపేటలో మేమిద్దరం కలిసి పని చేసిన సమయంలో తన అనుభవాలు ఎన్నో నాతో పంచుకునేది. ముఖ్యంగా ఉద్యోగ నిర్వహణలో ఎంతో సహకరిస్తూ చాలా ఆప్యాయంగా ఉండేది. తనకు ఒక పాప. మా అందరికి సాయంత్రాలు పాపతో సరదాగా కాలం గడపటం ఒక మంచి అనుభూతి. నేను అక్కడ ఉన్నప్పుడే సుజాత వాళ్ల నాన్న చేతుల మీదుగా పాపకు అక్షరాభ్యాసం చేయడం జరిగింది. ఒక పక్క ఇంటి బాధ్యత, మరోపక్క ఉద్యోగం. రెండింటినీ ఎంత బాగా నిర్వహించవచ్చో సుజాతను చూసే నేర్చుకున్నాను.

పురుషులతో పాటు పోటీగా పని చేయాలనే దృక్పథం తన వల్లనే అలవర్చుకున్నాను. ఆ తర్వాత నేను హైదరాబాద్ సచివాలయంలో చేరాను. అయినా మా స్నేహం నిరాటంకంగా కొనసాగింది. బ్యాంక్ మీటింగ్స్, కొన్ని కోర్టు వివాదాల పరంగా సుజాత తరచూ హైదరాబాద్ వచ్చేది. నా పెండ్లయిన తర్వాత కూడా మా కుటుంబంతో చక్కటి అనుబంధం తనకుంది. సంతోషం ఏమంటే తన పాప నా పెద్ద కూతురు మంచి స్నేహితులయ్యారు. ఈ మధ్యనే నేను వారి ఊరికి కూడా వెళ్లి ఓ కార్యక్రమంలో పాల్గొని వచ్చాను. సుజాత నాలో అమ్మ ప్రేమను చూశానంటుంది. నేనైతే తనని ఒక మార్గదర్శిగా భావిస్తాను. ప్రస్తుతం ఇద్దరం ఉద్యోగ విరమణానంతరం విశ్రాంత జీవితం గడుపుతున్నాం. తను నన్ను వైజాగ్ రమ్మని తనతో గడపమని అడుగుతుంటుంది. నేను వెళ్ళ లేకపోయినందుకు అలుగుతుంటుంది. వైజాగ్ సముద్ర తీర ప్రాంతంలో వారి నివాసం. మేము చాలా సార్లు అక్కడకు వెళ్ళి బీచ్లో సరదాగా గడిపాం. ఆర్.కె.బీచ్ ఒడ్డున అక్కినేని విగ్రహ ప్రతిష్ఠాపన చేయడంలో సుజాత ప్రముఖ పాత్ర పోషించింది. అప్పట్లో కొన్ని సార్లు తనతో పాటు నన్ను అక్కినేని ఇంటికి తీసుకెళ్లింది.

అదొక గొప్ప అనుభూతి. తనకున్న ప్రముఖుల బంధుత్వాలు, స్నేహాలు నాకు పరిచయం చేయాలని ఉత్సాహ పడుతుంది. కొన్నిసార్లు నేను సమయం కేటాయించలేకపోతే నిరాశపడేది. నాపై విసుగు ప్రదర్శించేది. మా అమ్మాయిల పట్ల ఎంతో ఆప్యాయత కనబరుస్తుంది. సచివాలయంలో నా ఉద్యోగ హోదాను చూసి ఎంతో గర్వపడేది. సుజాత సాన్నిహిత్యం నా జీవితంలో మరిచిపోలేనిది. నలుగురికి సాయమందించే తన స్నేహితురాలిగా ఉన్నందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది. స్నేహమనేది రక్త సంబంధం కాదు.. హృదయాల మధ్య ఏర్పడే శాశ్వత బంధం. నవ్వులో తోడు, కన్నీటిలో ఓదార్పు, విజయాల్లో ఆనందం పంచుకునే బంధమే స్నేహం. అలాంటి స్నేహం నాకు సుజాత రూపంలో దొరికింది.
జి.కృష్ణవేణి

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana