Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఇండస్ఇండ్ బ్యాంక్లో ఇన్సైడర్ ట్రేడింగ్..!

ఇండస్ఇండ్ బ్యాంక్లో ఇన్సైడర్ ట్రేడింగ్..!

ఆడిట్లోనూ లోపాలు పీఎంఓ, ఆర్బీఐకి విజిల్బ్లోయర్ ఫిర్యాదు

ముంబయి : ప్రయివేటు రంగ విత్త సంస్థ ఇండుస్ఇండ్ బ్యాంక్లో తీవ్ర అవకతవకలు జరుగుతున్నాయని తెలుస్తోంది.

బ్యాంక్లో ఇన్సైడర్ ట్రేడింగ్, గవర్నెన్స్ వైఫల్యాలు, ఆడిట్ సమీక్షలలోని లోపాలపై దర్యాప్తు జరపాలని కోరుతూ ప్రధాన మంత్రి ఆఫీసు (పీఎంఓ), ఆర్బీఐ సహా పలు నియంత్రణ సంస్థలకు తాజాగా ఆ సంస్థలోనే పని చేసే ఓ సమాచారకర్త (విజిల్బ్లోయర్) నుంచి ఫిర్యాదు అందింది. ఈ ఫిర్యాదు ప్రతిని సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ (ఎస్ఎఫ్ఐఓ), నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ అథారిటీ (ఎన్ఎఫ్ఆర్ఎ) వంటి కీలక దర్యాప్తు సంస్థలకు కూడా ఆయన పంపారు.
రూ. 2,000 కోట్ల డెరివేటివ్స్ అకౌంటింగ్ వ్యత్యాసం బయటపడిన తర్వాత ఇండస్ఇండ్ బ్యాంక్పై నిఘా మరింత తీవ్రమైంది. తాజా ఫిర్యాదులో ముఖ్యంగా ఇండస్ఇండ్ బ్యాంక్ మాజీ జోనల్ హెడ్ సమీర్ అగర్వాల్ను లక్ష్యంగా చేసుకుని ఆరోపణలు చేశారు. ఆయన తన కార్పొరేట్ బ్యాంకింగ్ బాధ్యతల ద్వారా పొందిన రహస్య సమాచారాన్ని ఉపయోగించి.. కుటుంబ సభ్యులు, అనుబంధ సంస్థల ద్వారా దాదాపు రూ. 815 కోట్ల విలువైన షేర్ల లావాదేవీలు జరిపినట్లు పేర్కొన్నారు. తద్వారా కీలక పరిణామాలు బహిరంగం కావడానికి ముందే ఆయన సుమారు రూ. 46 కోట్ల మేర అక్రమ లాభాలను ఆర్జించారని ప్రధాన ఆరోపణ. అలాగే మైక్రోఫైనాన్స్ రుణాల పాత బకాయిలను దాచడం వంటి ఆర్థిక రికార్డుల తారుమారుకు పాల్పడ్డారని తెలుస్తోంది.
విజిల్బ్లోయర్ సమాచారం మేరకు… సమీర్ అగర్వాల్ రుణ పోర్ట్ఫోలియోలో ఉన్న కేసోరామ్ ఇండస్ట్రీస్ అనే కంపెనీ ఒక పెద్ద వ్యూహాత్మక ఒప్పందానికి సిద్ధమవుతున్న తరుణంలో ఆ ముందస్తు సమాచారంతో ఆయన భార్య సదరు కంపెనీకి చెందిన 34 లక్షలకు పైగా షేర్లను కొనుగోలు చేశారు. దీనివల్ల ఆమెకు రూ. 3.26 కోట్ల లాభం చేకూరింది. మొత్తం మీద వారి కుటుంబానికి ట్రేడింగ్ విలువ రూ.816 కోట్లుగా ఉండగా అందులో రూ. 53 కోట్లకు పైగా లాభాలు వచ్చాయని.. ఈ లావాదేవీల్లో ఎక్కువ భాగం ఆయన పర్యవేక్షణలోని కార్పొరేట్ పోర్ట్ఫోలియో పరిధిలోని కంపెనీలతోనే జరిగాయని ఫిర్యాదులో వివరించారు.
ఈ వ్యవహారంపై సమీర్ అగర్వాల్ స్పందించకపోగా.. ఇండస్ఇండ్ బ్యాంక్ యాజమాన్యం ఈ ఆరోపణలను పూర్తిగా తిరస్కరించింది. తాము అంతర్గత విధానాలు, నియంత్రణ నిబంధనల ప్రకారం అన్ని అంశాలను సమగ్రంగా పరిశీలించి తగిన చర్యలు తీసుకున్నట్లు బ్యాంక్ స్పష్టం చేసింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana