Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
జనం కన్నెర్ర

జనం కన్నెర్ర

పెట్రో ధరలపై సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో నిరసన• చమురు ధరలను వెంటనే ఉపసంహరించాలి
• ధరలు పెంచి పేదల నడ్డి విరిచిన కేంద్రం
• దేశాన్ని సంక్షోభం వైపు తీసుకెళ్తున్న 
బీజేపీ ప్రభుత్వం

ఇకనైనా కార్పొరేట్ శక్తుల అనుకూల 
విధానాలను మార్చుకోవాలి : సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు టి.జ్యోతి
• సీపీఐ(ఎం) గ్రేటర్ హైదరాబాద్ 
సెంట్రల్ సిటీ కమిటీ ఆధ్వర్యంలో 
గోల్కండ చౌరస్తా నుంచి 
ఆర్టీసీ క్రాస్ రోడ్ వరకు నిరసన ర్యాలీ


నవతెలంగాణ- సిటీబ్యూరో/ విలేకరులు
నాలుగు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతంలో ఎన్నికల ముందు వరకు ధరలు పెంచబోమని నమ్మబలికిన బీజేపీ ప్రభుత్వం, ఎన్నికలు ముగియగానే పెట్రోల్, డీజిల్పై రూ.3 చొప్పున పెంచిందని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు టి.జ్యోతి విమర్శించారు. పెంచిన ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. సీపీఐ(ఎం) గ్రేటర్ హైదరాబాద్ సెంట్రల్ సిటీ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. గోల్కొండ చౌరస్తా నుంచి ఆర్టీసీ క్రాస్ రోడ్డు వరకు ర్యాలీగా వెళ్లిన నాయకులు, కార్యకర్తలు.. అక్కడ కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు.
ఈ సందర్భంగా టి.జ్యోతి మాట్లాడుతూ.. దేశంలో పెట్రోల్, డీజిల్ నిల్వలు అపారంగా ఉన్నాయని ధరలు పెంచబోమని ఎన్నికలకు ముందు కేంద్ర ప్రభుత్వం నమ్మబలికిందని ఆరోపించారు. కానీ నాలుగు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతంలో ఎన్నికలు ముగియగానే ధరలు పెంచిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనివల్ల నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరిగే ప్రమాదం ఉందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. గత ఆదివారం హైదరాబాద్ పర్యటనలో ప్రధాని మోడీ ప్రజలకు సుద్దులు చెప్పడమే తప్ప, సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోలేదని విమర్శించారు. భారత విదేశాంగ విధానం అమెరికా కబంధ హస్తాల్లో చిక్కుకుందని ఆందోళన వ్యక్తం చేశారు. రష్యా, ఇరాన్ దేశాలు తక్కువ ధరకు చమురు ఇస్తామన్నా, అమెరికా భయంతో మోడీ ప్రభుత్వం వెనకడుగు వేస్తోందన్నారు.

ఇది దేశ ప్రజలకు తీవ్ర నష్టం కలిగిస్తోంద న్నారు. బీజేపీ ప్రభుత్వ విధానాలు దేశాన్ని సంక్షోభం వైపు తీసుకెళ్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. డాలర్తో రూపాయి మారకం విలువ ఎన్నడూ లేని విధంగా రూ.96కు పడిపోవడం దేశ ఆర్థిక వ్యవస్థకు ప్రమాద సంకేతమన్నారు. కార్పొరేట్ శక్తులకు కొమ్ముకాయడం మానేసి, పెంచిన ధరలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
సీపీఐ(ఎం) గ్రేటర్ హైదరాబాద్ సెంట్రల్ సిటీ కమిటీ కార్యదర్శి ఎం.వెంకటేష్ మాట్లాడుతూ.. పెరిగిన ధరల వల్ల దేశ ప్రజలపై నెలకు రూ.3,600 కోట్లు, సంవత్సరానికి రూ.43 వేల కోట్ల అదనపు భారం పడుతోందని తెలిపారు. పరోక్షంగా మరో రూ.30 వేల కోట్ల భారం పడే అవకాశం ఉందన్నారు. బియ్యం, పప్పులు, నూనెలు, కూరగాయల ధరలు ఆకాశాన్ని తాకుతాయని ఆవేదన వ్యక్తం చేశారు. మూడు రాష్ట్రాల్లో బీజేపీని గెలిపించినందుకు ప్రధాని మోడీ ప్రజలకు ఇచ్చిన 'బహుమానం' ఇదేనా? అని ప్రశ్నించారు. కార్యక్రమంలో సీపీఐ(ఎం) గ్రేటర్ హైదరాబాద్ సెంట్రల్ సిటీ కమిటీ కార్యదర్శివర్గ సభ్యులు ఎం.శ్రీనివాసరావు, ఎం.మహేందర్, ఎం.దశరథ్, నగర కమిటీ సభ్యులు ఆర్.వెంకటేష్, జె.కుమారస్వామి, ఎన్.మారయ్య, వై.వరలక్ష్మి, కె.అజరు బాబు, ఆర్.అశోక్, జి.నరేష్, జి.కిరణ్, ఎం.అజరు బాబు, కె.అశోక్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఆటోకు తాడు కట్టి..
నల్లగొండ జిల్లా కేంద్రంలో సీఐటీయూ ఆధ్వర్యంలో ఆటోకు తాడుకట్టి లాగి నిరసన తెలిపారు. మిర్యాలగూడ, చండూరులో సీపీఐ ఆధ్వర్యంలో ఆటోకు తాడుకట్టి లాగుతూ ధరల పెరుగుదలపై ప్రజలకు అవగాహన కల్పించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్, సీఎన్జీ ధరలను పెంచి సామాన్య ప్రజల నడ్డి విరుస్తోందని కరీంనగర్ సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి విమర్శించారు. నగరంలోని స్థానిక గీతా భవన్ చౌరస్తాలో ఆటోను లాగుతూ వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. సీపీఐ(ఎం) ఖమ్మం డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో ఖమ్మం ఎన్ఎస్టీ రోడ్లో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేశారు. ముందుగా పార్టీ జిల్లా కార్యాలయం నుంచి ఎన్ఎస్టీ రోడ్డు వరకు దిష్టిబొమ్మతో ర్యాలీ నిర్వహించారు. సీపీఐ ఆధ్వర్యంలో ఖమ్మం కొత్త బస్టాండ్సెంటర్లో మోడీ దిష్టిబొమ్మతో ర్యాలీ నిర్వహించి దహనం చేశారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana