Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
జవహర్నగర్ డంపింగ్ యార్డును ఎత్తేయాల్సిందే

జవహర్నగర్ డంపింగ్ యార్డును ఎత్తేయాల్సిందే

ర్మ, క్యాన్సర్, 
శ్వాసకోశ వ్యాధుల విజృంభణ ప్రాణం అరచేతిలో పెట్టుకుని జీవనం
రాంకీ వ్యవహారశైలిపై ఆగ్రహం..
అఖిలపక్ష సమావేశంలో నేతలు
డంప్ యార్డు తొలగించాలని డిమాండ్

నేడు సీఎం రేవంత్రెడ్డితో 
భేటీకి నిర్ణయం

నవతెలంగాణ-సిటీబ్యూరో/ఎల్బీనగర్/నాగోల్
మేడ్చల్ జిల్లా జవహర్నగర్ ప్రాతంలో ఉన్న డంపింగ్ యార్డు ప్రజల ప్రాణాలను హరించే ప్రమాదకర స్థితికి చేరిందని స్థానికులు, మాజీ ప్రజాప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేశారు. గాలి, నీటి కాలుష్యం విపరీతంగా పెరిగి ప్రజలు తీవ్ర అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని అన్నారు. వెంటనే డంపింగ్ యార్డును ఎత్తేయాలని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్రెడ్డి సూచనల మేరకు జవహర్నగర్ డంపింగ్ యార్డు, స్థానిక సమస్యలపై మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ అధ్యక్షతన మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా నాగోల్ ఆల్కాపురిలోని స్వాగత్ గ్రాండ్ హోటల్లో గురువారం అభిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ, ప్రభుత్వ చీప్విప్ పట్నం మహేందర్రెడ్డి, మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ టి.వినరు కృష్ణారెడ్డి, మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ సుమతి, జలమండలి ఎండి అశోక్రెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా డీసీసీ అధ్యక్షులు తోటకూర వజ్రేష్ యాదవ్, ఎమ్మెల్యేలు మల్లారెడ్డి, సుధీర్రెడ్డి, మర్రి రాజశేఖర్రెడ్డి, బండారు లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యే సుధీర్రెడ్డి, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

జవహర్నగర్ డంపింగ్ యార్డు పరిసర ప్రాంతాల్లో దోమలు అధికంగా పెరిగి మలేరియా, డెంగ్యూ వంటి వ్యాధులు ప్రబలుతున్నాయని, చర్మ, శ్వాసకోశ వ్యాధులు, క్యాన్సర్ వంటి తీవ్ర వ్యాధులు పెరుగుతున్నాయని ప్రజాప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేశారు. డంపింగ్ యార్డుకు ప్రతి రోజూ సుమారు 8,500 నుంచి 12,500 టన్నుల చెత్త వస్తుండటంతోపాటు, 339 ఎకరాల విస్తీర్ణంలో పేరుకుపోయిన చెత్త నుంచి వెలువడుతున్న దుర్గంధపు నీరు సమీప చెరువులు, బోర్ల నీటిని కలుషితం చేస్తున్నట్టు తెలిపారు. భూగర్భ జలాలు కలుషితమై తాగునీటి సమస్య జఠిలమవుతోందని, మనుషులు నివసించలేని పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. మూడు కార్పొరేషన్ల పరిధిలోని చెత్తను ఒకే దగ్గరికి తీసుకురావడంతో ప్రాణం అర చేతిలో పెట్టుకుని బతకాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. జవహర్నగర్ డంపింగ్ యార్డు నిర్వహణలో రాంకీ సంస్థ వ్యవహరిస్తున్న తీరుపై ప్రజాప్రతినిధులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒప్పందం ప్రకారం సౌకర్యాలు కల్పించకుండా సంస్థ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. రాంకీ సంస్థను తొలగించి, డంపింగ్ యార్డ్ను శుద్ధి చేసి, నగరానికి నాలుగు వైపులా డంపింగ్ యార్డులు ఏర్పాటు చేయాలని కోరారు. ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తే ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని ఎమ్మెల్సీ, ప్రభుత్వ విప్ హెచ్చరించారు. జవహర్నగర్ డంపింగ్ యార్డు విషయంలో సీఎంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.

శాశ్వత పరిష్కారం అవసరం : 
ఎంపీ ఈటల రాజేందర్​
'ఎంఎంసీ'లో కొన్ని మున్సిపాల్టీలు, కార్పొరేషన్లు, గ్రామాలు కలవడంతో అనేక రకాల సమస్యలు ఉత్పన్నమవుతున్నాయనే విషయాన్ని ఇప్పటికే సీఎం దృష్టికి తీసుకెళ్లామని ఎంపీ ఈటల రాజేందర్ తెలిపారు. ఇక్కడ అభివృద్ధితోపాటు లా అండ్ ఆర్డర్ సమస్యలు కూడా ఉన్నాయన్నారు. అన్ని రాజకీయ పార్టీలు, అన్ని ప్రాంతాలతోనే జవహర్నగర్ డంపింగ్ యార్డు సమస్యకు శాశ్వత పరిష్కారం సాధ్యమవుతుందన్నారు. జవహర్నగర్తోపాటు మచ్చ బొల్లారం సహా అనేక చిన్న చిన్న డంపింగ్ యార్డుల వల్ల కూడా ప్రజలు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. నేడు ప్రజాప్రతినిదులందరితో కలిసి స్వయంగా డంపింగ్ యార్డ్ వద్దకు వెళ్లి అక్కడి సమస్యలను తెలుసుకుని ప్రభుత్వానికి తెలియజేస్తామని తెలిపారు. రాంకీ సంస్థ ప్రతినిధులు కూడా వచ్చేలా చూడాలని అధికారులను ఆదేశించారు.

సమస్యకు శాశ్వత పరిష్కారం : 
వజ్రేష్ యాదవ్
ప్రజల ప్రాణాలకు సంకటంగా మారిన డంపింగ్ యార్డ్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు సీఎం రేవంత్రెడ్డి సుముఖంగా ఉన్నారని డీసీసీ అధ్యక్షులు తోటకూర వజ్రేష్ యాదవ్ అన్నారు. ఈ నెల 4న సీఎం జవహర్నగర్ డంపింగ్ యార్డ్ సమస్యపై స్పందించి శాశ్వత పరిష్కారం చూపాలని, అందుకు కావాల్సిన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారని గుర్తు చేశారు.

డంపింగ్ యార్డును తరలించాలి : ఎమ్మెల్యే మల్లారెడ్డి
జవహర్నగర్ డివిజన్లో ఉన్న డంపింగ్ యార్డును తరలించాలని మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి డిమాండ్ చేశారు. జవహర్నగర్, నాగారం, దమ్మాయిగూడ పరిధిలోని భూగర్భ జలాలు కూడా కలుషితం కావడంతో తాగునీటి సమస్య తీవ్రంగా మారిందన్నారు. జవహర్నగర్ను రాంకీ సంస్థను దత్తత తీసుకుని 'సీఎస్ఆర్' ఫండ్స్తో అభివృద్ధి చేయాలని ఉన్నా.. పట్టించుకోవడం లేదన్నారు. ఇక్కడ రూ.500 కోట్లతో ఏర్పాటు చేసిన కరెంటు ఉత్పత్తి కేంద్రం పని చేయడం లేదన్నారు.

మూడు డంపింగ్ యార్డులు 
ఏర్పాటు చేయాలి : సబితా ఇంద్రారెడ్డి
నగరంలో ఒకే చోట కాకుండా మూడు చోట్ల డంపింగ్ యార్డులు ఏర్పాటు చేస్తే బాగుంటుందని మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి కోరారు. వర్షాకాలం వస్తున్న నేపథ్యంలో వరద నీటి కాలువ, డ్రెయినేజీ సమస్యలు వస్తాయని, నాలాలను శుద్ధి చేయాలని అధికారులను కోరారు.

ఆస్తి పన్ను వసూలు చేయొద్దు : 
ఎమ్మెల్యే సుధీర్రెడ్డి
జవహర్నగర్ డంపింగ్ యార్డ్ సమస్య తీవ్రంగా ఉందని, సౌండ్, ఎయిర్, వాటర్ పొల్యూషన్ విపరీతంగా ఉందని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు. ఈ డంపింగ్ యార్డు వల్ల ఇబ్బంది పడుతున్న జవహర్నగర్ ప్రజల నుంచి ఆస్తి పన్ను వసూలు చేయొద్దని కోరారు. ఉచితంగా మంచినీరు సరఫరా చేయాలని, వాటర్ బిల్లు కూడా వసూలు చేయొద్దని చెప్పారు. సరూర్నగర్ చెరువులోనికి మురికి నీరు వస్తోందని, చెరువు అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని కోరారు.

తెలంగాణ ఫండ్స్ ఆంధ్రాలో ఖర్చు : ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్రెడ్డి
రాంకీ సంస్థ తెలంగాణ సీఎస్ఆర్ ఫండ్స్ను ఆంధ్రాలో ఖర్చు చేస్తున్నదని మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్రెడ్డి ఆరోపించారు. సీఎస్ఆర్ ఫండ్స్ కింద దాదాపు ఇప్పటికే రూ.30 కోట్లను ఆంధ్రప్రదేశ్లో ఉపయోగించినట్టు ఆరోపించారు.

అగ్రిమెంట్ను అమలు 
చేయని రాంకీ : జేఏసీ సభ్యులు
రాంకీ సంస్థ ప్రభుత్వంతో చేసుకున్న అగ్రిమెంట్లను అమలు చేయడం లేదని జేఏసీ సభ్యులు ఆరోపించారు. రాంకీ సంస్థను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. భూమి, గాలి, నీరు కలుషితం చేస్తుండటంతో ఎన్జీటీ కోర్టులో కేసు వేసినట్టు జేఏసీ సభ్యులు తెలిపారు. ఈ సమావేశంలో ఎల్బీనగర్, ఉప్పల్ జోనల్ కమిషనర్లు వికాస్ మహా, రాధికాగుప్తా ఎంఎంపీ శానిటేషన్ అదనపు కమిషనర్ రఘు ప్రసాద్, రాంకీ సంస్థ ప్రతినిధి కష్ణ తోట, మాజీ ప్రజాప్రతినిదులు పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana