Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
జూడోకా ధమాకా

జూడోకా ధమాకా

అష్మిత, హర్ష్ పసిడి పట్టుపసిడి పోరుకు ఐదుగురు బాక్సర్లు
డిస్కస్త్రోలో పూనియాకు కాంస్య పతకం
గ్లాస్గో 2026 కామన్వెల్త్ క్రీడలు

గ్లాస్గో (స్కాట్లాండ్)

భారత జూడో చరిత్రలో సరికొత్త అధ్యాయం. కామన్వెల్త్ క్రీడల్లో ఇప్పటివరకు ఒక్క పసిడి పతకం సాధించని భారత్.. గ్లాస్గోలో ఏకంగా గంట వ్యవధిలోనే రెండు పసిడి పతకాలు ఖాతాలో వేసుకుంది. మహిళల 48 కేజీల విభాగంలో అష్మిత చారిత్రక స్వర్ణం సాధించగా, పురుషుల 60 కేజీల విభాగంలో హర్ష్ సింగ్ సైతం పసిడి పట్టుతో మెరిశాడు. మహిళల 48 కేజీల ఫైనల్లో కెనడా జూడోకా క్వాచ్ ఫేవరేట్గా బరిలోకి దిగినా.. అష్మిత అదరగొట్టింది. సూపర్ డిఫెన్స్, సరైన సమయంలో ఎటాక్తో అష్మిత బంగారు పతకం సాధించి, భారత జూడో చరిత్రలో బంగారు శకానికి తెరతీసింది. ఆ వెంటనే జరిగిన పురుషుల 60 కేజీల ఫైనల్లో హర్ష్ సింగ్ ఆకట్టుకున్నాడు. ఆస్ర్టేలియా జూడోకా జోషువా కట్జ్తో పోరు ఉత్కంఠభరితంగా సాగింది. తొలి రెండు నిమిషాల్లో ఎవరికీ ఒక్క పాయింట్ దక్కలేదు. ఆఖరు రెండు నిమిషాల్లో పైచేయి సాధించిన హర్ష్ సింగ్ భారత్ ఖాతాలో మరో బంగారు పతకాన్ని వేశాడు. మహిళల 57కేజీల విభాగంలో యామిని మౌర్య సైతం ఫైనల్కు చేరుకుంది. పసిడి పోరుకు చేరుకున్న యామిని కనీసం సిల్వర్ మెడల్ ఖాయం చేసుకుంది. ఈ మెడల్ ఈవెంట్ శుక్రవారమే అర్థరాత్రి అనంతరం జరుగనుంది. జావెలిన్ త్రో ఫైనల్ సైతం అర్థరాత్రి తర్వాత జరుగనుండగా.. నీరజ్ చోప్రా పసిడి పతకమే లక్ష్యంగా బరిలోకి దిగనున్నాడు.

ఫైనల్కు ఐదుగురు బాక్సర్లు
బాక్సింగ్లో ఇప్పటికే పతకాలు ఖాయం చేసుకున్న బాక్సర్లు పతకం రంగు మెరుగుపర్చుకునేందుకు రింగ్లో పంచ్లు విసురుతున్నారు. శుక్రవారం జరిగిన పోటీల్లో ఐదుగురు బాక్సర్లు సెమీఫైనల్లో గెలుపొంది ఫైనల్కు చేరుకున్నారు. పురుషుల 55 కేజీల విభాగం సెమీఫైనల్లో జాడుమని సింగ్ 5-0తో నైజీరియా బాక్సర్ను చిత్తు చేసి ఫైనల్కు చేరుకున్నాడు. మహిళల 70 కేజీల సెమీఫైనల్లో అరుంధతి 4-0తో వేల్స్ బాక్సర్ను మట్టికరిపించి పసిడి పోరుకు చేరుకుంది. మహిళల 57 కేజీల విభాగం సెమీస్లో జాస్మిన్ లబోరిన్ మలేషియా బాక్సర్పై గెలుపొంది తుది పోరుకు అర్హత సాధించింది. ప్రీతి పవార్, అంకుశ్ పంగాల్ ఇదివరకే ఫైనల్కు చేరుకున్న సంగతి తెలిసిందే.

పూనియాకు కాంస్యం
ట్రాక్ అండ్ ఫీల్డ్లో భారత్కు మరో పతకం దక్కింది. మహిళల డిస్కస్ త్రోలో పూనియా కాంస్య పతకంతో మెరిసింది. గురువారం అర్థరాత్రి అనంతరం జరిగిన పతక పోటీలో పూనియా సత్తా చాటింది. 58.65 మీటర్ల త్రోతో పూనియా ఫైనల్లో మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకం కైవసం చేసుకుంది. మరో భారత అథ్లెట్ నిధి రాణి 57.10 మీటర్ల త్రోతో నాల్గో స్థానంలో నిలిచి పతకానికి అడుగు దూరంలో ఆగిపోయింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana