Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
జూన్ తరువాతే సినిమా హాళ్లపై నిర్ణయం

జూన్ తరువాతే సినిమా హాళ్లపై నిర్ణయం

ఢిల్లీ: లాక్‌డౌన్ కారణంగా మూతబడిన సినిమా హాళ్లను తిరిగి తెరిచే విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర సమాచార ప్రసారశాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ మీడియాతో మాట్లాడుతూ దేశవ్యాప్తంగా దాదాపు 70 రోజులుగా మూతబడిన సినిమా హాళ్లను తిరిగి తెరిచే విషయమై జూన్ తర్వాత మాత్రమే ఆలోచిస్తామన్నారు. ఈ నెలలో కోవిడ్ కేసుల సంఖ్యను, పరిస్థితిని సమీక్షించిన అనంతరం ఈ విషయంలో ఓ నిర్ణయం తీసుకోనున్నట్లు ఆయన తెలిపారు. అంతకు ముందు సినిమా రంగంలోని వివిధ సంఘాల ప్రతినిధులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమైన మంత్రి వివిధ అంశాలపై చర్చించారు. లాక్‌డౌన్ కారణంగా చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఈ సందర్భంగా వారు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు.

సినిమా థియేటర్లను తెరిపించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. స్పందించిన మంత్రి మాట్లాడుతూ.. ఈ నెల తర్వాత ఈ విషయంలో ఓ నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. లాక్‌డౌన్ కారణంగా చిత్ర పరిశ్రమ రోజుకు రూ. 30 కోట్లకు పైగా నష్టపోతున్నప్పటికీ లాక్‌డౌన్‌పై సినీరంగం సంఘీభావంగా ఉందని మంత్రి ప్రశంసించారు. సినీ సంఘాల ప్రతినిధులు తన దృష్టికి తీసుకొచ్చిన వివిధ డిమాండ్లను పరిష్కరించేందుకు తాము ప్రయత్నిస్తామని మంత్రి వారికి తెలిపారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana