Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కాలం మారింది.మారాల్సిందేమిటి?

కాలం మారింది.మారాల్సిందేమిటి?

'సుందరయ్య గొప్ప నాయకుడే. కానీ కాలం మారింది. మనమూ మారాలి' అనేవారున్నారు. సుందరయ్య పాటించిన విలువలు, ఆయన ఆచరణ గురించి మాట్లాడితే 'చాదస్తం'గా కొట్టిపారేసేవారూ లేకపోలేదు.

నిజమే… మారిందేమిటో, మారవల్సిం దేమిటో స్పష్టత అవసరమే!అందుకు తగిన సందర్భం సుందరయ్య వర్ధంతి. 'చాదస్తం' అనే మాట ఎందుకొస్తున్నదో, ఈ రోజుల్లో సుందరయ్య పాటించిన విలువలు అమలు చేయటం సాధ్యం కాదన్న అభిప్రాయాలు ఎందుకు కలుగ్గుతున్నాయో కూడా పరిశీలించాలి. సుందరయ్య మరణించిన 41 సంవత్సరాల తర్వాత ఆయన గురించిన చర్చ ఎందుకు జరుగుతున్నది? వీరుల త్యాగాలు స్మరించుకోవటం, లక్ష్యసాధనకు పునరంకితం కావాలనుకోవటం సహజం. ఇక్కడ లక్ష్యం సాధించటం మాత్రమే కాదు. సుందరయ్య ఒక నమూనా. ఆయన వ్యక్తి మాత్రమే కాదు.. ఒక శక్తి. అందుకే ఆయన గురించి ఇంత చర్చ. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు చూశాం. జండాలు వేరైనా, స్థూలంగా కమ్యూనిస్టు ఉద్యమ పునాదులు చెదిరిన కాలంలో ఉన్నాం. మరోవైపు వేలాది కాంట్రాక్టు, వలస కార్మికులు ఉన్నట్టుండి రోడ్ల మీదకు వస్తున్నారు. పోరుబాట పడుతున్నారు. నిర్మాణాత్మక కార్మికవర్గ సంస్థల, రాజకీయ పార్టీల ప్రయత్నంతో సంబంధం లేకుండానే జరగటం గమనార్హం. ఈ కారణంగానే, అనేక పరిమితులు కూడా ఏర్పడుతున్నాయి. అందుకే కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య వర్ధంతికి ఇంతటి ప్రాధాన్యత సంతరించుకున్నది.

సుందరయ్య అనగానే గుర్తుకువచ్చేది వర్గపోరాటం. ఆయన ప్రజాజీవితం కార్మిక సంక్తి, వ్యవసాయ కార్మిక సంఘం నిర్మాణంతో మొదలైంది. రైతాంగ పోరాటంతో పెనవేసుకున్నది. పటిష్టమైన విప్లవ పార్టీ నిర్మాణం, పాలక వర్గాలు, బూర్జువా పార్టీల ప్రభావాలకు అతీతంగా పనిచేయటం, పనిపట్ల నిబద్ధత, కమ్యూనిస్టు క్రమశిక్షణకు ఆయనకు ఆయనే సాటి. మతోన్మాద ప్రమాదం గురించి ఆయనేం చెప్పారో కూడా పరిశీలించాల్సిన సందర్భం. ఆయన మీద భగత్సింగ్, ఇతర విప్లవకారుల ప్రభావం, గాంధీ ప్రభావం బలంగా ఉన్నాయని ఆయనే చెప్పారు. జైలులో ఉండగా భగత్సింగ్ సహచరులు శివవర్మ తదితరులతో చర్చించిన విషయాలు తన ఆత్మకథలో గుర్తుచేసుకున్నారు. ఈ అనుభవాలను రంగరించి, వడపోసి, జీర్ణం చేసుకున్న నాయకుడు కాబట్టే ప్రజానాయకుడ య్యారు. నిర్మాణ దక్షతకు గొప్ప మారుపేరయ్యారు. గత కాలపు అనుభవాల నుంచి నేర్చుకోవటం ఎంత అవసరమో, దుర్లక్షణాలను వదిలించుకోవటం కూడా అంతే ముఖ్యమని, ఆచరించి చూపారు. మూఢ విశ్వాసాలకు తావులేకుండా, కులమతాల బంధనాలు తెంచుకున్నారు. తానూ, లైలా భార్యాభర్తలుగా జీవించాలని నిర్ణయించుకున్నామని పార్టీ నాయకత్వం ముందు ప్రకటించారు.

కలిసి జీవించారు. సంప్రదాయాల పేరుతో అమలు జరుగుతున్న మూఢ విశ్వాసాలకు 'నేను వ్యతిరేకమే… కానీ, ఇంట్లో బంధుమిత్రులు ఒప్పుకోవటం లేదని' సాకులు వెతుకుతున్న కాలంలో, ఆనాటికన్నా ఆధునిక ప్రపంచంలో ఉన్నాం కదా! అంతటితో ఆగడంలేదు. ఇప్పుడు వారం రోజుల పెండ్లితంతు పునరుద్ధరణకు ప్రభావితులవుతున్నారు. వేదికమీద దండలు మార్పించి, వేదిక వెనక తాళి కట్టేస్తున్నారు. సాధారణ ప్రజల ముందు నిజాయితీ ప్రశ్నార్థకమవుతున్నది. పెండ్లి, పెండ్లిరోజు, పుట్టినరోజు తదితర సందర్భాలలో ఆడంబరాల మోతాదు అవధులు దాటుతున్నది. ఉద్యమ జీవితం ప్రారంభంలో తనను 'రెడ్డీ' అని పిలిచేవారని పిఎస్ చెప్పారు. కాలక్రమంలో 'రెడ్డి' తోక కత్తిరించుకున్నారాయన. ఇప్పుడు సుందరరామిరెడ్డి అంటే ఎవరికి తెలుసు? 'సుందరయ్య' ముద్ర చిరస్థాయిగా నిలిచింది. సామాజిక రంగంలో పోరాట సందేశం ఇతరులకు తప్ప, తన కుటుంబానికి వర్తించదన్నట్టు వ్యవహరించే కాలం నుంచి మనం వెనుదిరిగి చూస్తున్నాం. సుందరయ్య పోరాటం తన కుటుంబం నుంచీ, బంధుమిత్రుల నుంచే మొదలు పెట్టారు.

కులం గుర్తింపు కత్తిరించుకోవటంతో ఆగలేదు. కుల వివక్ష మీద అమ్మతోనే ఘర్షణకు శ్రీకారం చుట్టారు. మహిళల పట్ల వివక్షను ఇంట్లోనే ప్రశ్నించారు. సహపంక్తి భోజనాలకు హరిజనులను కూడా పిలిచి (అప్పట్లో దళితులను హరిజనులు అనేవారు) కులకట్టుబాట్ల మీద తిరుగుబాటు చేశారు. కుల బంధనాలను బద్దలు కొట్టవల్సిన సమయంలో 'కులాల హక్కులూ, కుల బలాల నిష్పత్తిలో వాటాల' డిమాండు ముందుకొస్తున్నాయి. శ్రామికుల మధ్య కులాల పేరుతో విభజన సృష్టించే ఆధునిక పెట్టుబడిదారీ వర్గం ఎత్తుగడల ప్రభావం వామపక్ష శ్రేణులను కూడా వదలటం లేదు. ప్రజాస్వామ్యం పేరుతో ఈ నినాదాలు చేస్తున్నవారు సోషలిజం సాధనకు ఇవి ఆటంకాలన్న విషయం గమనించలేకపోతున్నారు.

పార్టీ జెండాలు, కండువాలు కలగాపులగమౌ తున్న కాలమిది. కమ్యూనిస్టు పార్టీకి, బూర్జువా పార్టీకి మధ్య స్పష్టమైన విభజన రేఖ గీసి, ఎర్రజెండా విశిష్టత కాపాడిన నేత సుందరయ్య. సంస్కరణవాదం పార్లమెంటరీ ధోరణుల మీద ఆయన చేసిన తిరుగుబాటు ఫలితమే కదా నేటి సీపీఐ(ఎం). విప్లవ పార్టీ నిర్మించాలన్న లక్ష్యంతో ఆనాటి నేతలు వేసిన అడుగుల ఫలితమే కదా! చేసిన బాసలు గుర్తొచ్చే కాలం! పార్టీ ఫిరాయింపులు కమ్యూనిస్టు సమూహం నుంచి కూడా జరుగుతాయని పీఎస్ ఊహించి ఉండరు. జెండాల రంగులతో నిమిత్తం లేని పదవీ వ్యామోహం, పదవుల కోసం ఆరాటం, సంపాదన మార్గాల కాలం కూడా ఒకటి ఉంటుందని ఆయన అనుకున్నారో లేదో తెలియదు. అట్లా ఉండకూడదన్న నిబద్ధత చాటిన నేత. ఓటు, పదవి కూడా సరుకుగా మారాయి. సంపాదన మార్గాలైనాయి. పెట్టుబడిదారీ విధానం ఫలితమిది. ఇందుకు భిన్నంగా ఒక కమ్యూనిస్టుకు, ఓటు ఒక ఆయుధం. పదవి ఒక సాధనం. ఇదొక రాజకీయ పోరాటం. పెట్టుబడికీ, పెట్టుబడి మీద పోరాటానికీ గీత చెదిరితే ప్రజలకు ప్రత్యామ్నాయం కనిపించదు. ప్రత్యామ్నాయం చూపా లన్నది సుందరయ్య బాట! కార్యకర్తల పట్ల కమ్యూనిస్టు దృక్పథానికీ, బూర్జువా దృక్పథానికీ పొంతన లేదు. బూర్జువాపార్టీల నాయకులకు స్వాగత బ్యానర్లు కట్టేవారు, ఫ్లెక్సీ బోర్డులు పెట్టేవారు, సోషల్ మీడియాలో ప్రమోట్ చేసేవారు, దాడులకు ఉపయోగపడే గ్యాంగులే కార్యకర్తలు. అన్నీ వ్యక్తికోసం, దోపిడీవర్గం కోసమే. వీరి నిర్వహణ ఖర్చులు కూడా నాయకులే భరిస్తారు.

లేదా వసూళ్లు చేసుకుని దండుకోమంటారు. నాయకులు ఎక్కడికి పోయినా ఒక కాన్వారు, భజనబృందం కావాలి. 'గన్మెన్' హోదాకు చిహ్నంగా మారింది. వీటన్నింటికీ భిన్నమైన కమ్యూనిస్టు నమూనా ప్రదర్శించిన జననేత సుందరయ్య. సైకిల్ మీద పార్లమెంటుకు పోయిన ప్రజా ప్రతినిధి. ఆయన కారు కూడా వాడారు. వాహనం హోదాకు చిహ్నం కారాదు. ఉద్యమావసరంగా ఉండాలన్నదే ఆయన అభిప్రాయం. పార్టీ కోసం, ఉద్యమం కోసం ఆస్తిని కరిగిం చటమే తప్ప పోగేయటం, అనుభవించటం తెలియని కార్మికవర్గ సంస్కృతికి ప్రతినిధి సుందరయ్య. ఒకప్పుడు హైదరా బాదులో ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి శాసనసభకు బస్సులో వెళ్లిన శాసనసభ్యులు ఇప్పుడు కారు దిగగలిగే పరిస్థితి లేదు. పైగా విలాసవంతమైన కార్లు వాడుతున్నారు. ఆటోలో సచివాలయానికి పోయిన సున్నం రాజయ్యను పోలీసులు కూడా శాసనసభ్యుడంటే నమ్మలేదు. ఓట్లకోసం డబ్బులు పంచే ఈ రోజుల్లో 'కోటి' కి లొంగని కుంజా బొజ్జి, వీరి దృష్టిలో అమాయకుడు. అందుకే ఆయన సుందరయ్య విలువలకు వారసుడే!

విరాళాల కోసం 'పద్దులు' కాదు, ప్రజలమీద ఆధారపడాలన్నారు. వ్యక్తిగత భేషజాలు లేవు. పదవుల కోసం ఆరాటం, అలకలు, తప్పటడుగులు లేవు. నచ్చని నిర్ణయాన్ని కూడా మరింత పట్టుదలతో అమలు చేయటం ఆయన ప్రత్యేకత. నిరంతరం ప్రజల మీద, ప్రజాఉద్యమం, పార్టీ నిర్మాణం మీదనే ధ్యాస. అందుకే బూర్జువా, భూస్వామ్య పార్టీల విష సంస్కృతి ప్రభావం వెంటాడుతున్న నేటి పరిస్థితుల్లో సుందరయ్య అమలు చేసి చూపిన విలువల అవసరం పెరిగింది. మధురై మహాసభ కీలక రంగాలలో కృషి, మాస్లైన్, వర్గ పోరాటం, శాఖల పని విధానం, కార్యకర్తల సామర్ధ్యం గురించి నొక్కి చెప్పింది. అంటే సుందరయ్యను మరొకసారి ముందుకు తేవటమే కదా! వీటన్నింటికీ నిజమైన ప్రతినిధి ఆయనే కదా! ఇప్పుడు సంఘటిత, అసంఘటిత రంగాలన్న తేడా లేదు. పెద్ద ఎత్తున వలస కార్మికుల శ్రమ దోపిడీ సాగుతున్నది.

వీరిని సంఘటితం చేయటం సమస్యగా మారిన స్థితిలో మళ్లీ సుందరయ్య గుర్తుకొస్తున్నారు. జైలుజీవితంలో హిందీ, ఉర్దూ నేర్చుకున్నానని ఆయన ఆత్మకథలో చెప్పారు. అప్పటికే ఆయనకు సంస్కృతంలో కూడా ప్రవేశం ఉన్నది. ప్రేమ్చంద్ నవల ఉర్దూలోనే చదివానన్నారాయన. బలమైన ఉద్యమ కేంద్రాలు బలహీన ప్రాంతాలకు అండగా నిలవాలని ఆయన నిశ్చితాభిప్రాయం. డెబ్బయ్యవ దశకంలోనే మతోన్మాద ప్రమాదాన్ని పసిగట్టారు. అలాంటి సంస్థలతో అణువంత సంబంధం కూడా ప్రమాదకరమే అన్నారు. పాఠశాల జీవితం నుంచే సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటంలో దూకిన సుందరయ్యను తుదిశ్వాస వరకూ కార్మికవర్గ దృక్పథమే నడిపింది. అదే ఆయన ప్రత్యేకత. ఇప్పుడు ఆలోచించాలి. సుందరయ్య నెలకొల్పిన విలువలు గత కాలపు స్మృతులు కాదు. నేటి అవసరం. కాలం మారింది నిజమే! మారిందేమిటి? మారాల్సిందేమిటి? ఇది కమ్యూ నిస్టు ఉద్యమం ముందున్న సవాలు. అందుకే 'సుందరయ్య'ల అవసరం పెరిగింది.

ఎస్. వీరయ్య

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana