Friday, 14 Aug, 2.47 am నవ తెలంగాణ

రాష్ట్రీయం
కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులందరినీ రెగ్యులరైజ్ చేయాలి

- టీఎస్‌యూటీఎఫ్‌ డిమాండ్‌
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్‌
హైకోర్టు తీర్పు నేపథ్యంలో రాష్ట్రంలో వివిధ శాఖల్లో పని చేస్తున్న కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులందరినీ వెంటనే రెగ్యులరైజ్‌ చేయాలని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్‌(టీఎస్‌యూటీఎఫ్‌్‌) రాష్ట్ర కమిటీ డిమాండ్‌ చేసింది. అప్పటివరకు సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం ఆయా ఉద్యోగులు పని చేస్తున్న పోస్టుకు అర్హత కలిగిన వేతనాలు చెల్లించాలని కోరింది. టీఎస్‌ యూటీఎఫ్‌ రాష్ట్ర కమిటీ సమావేశం బుధ, గురువారాల్లో రెండు రోజులపాటు దశ్యమాధ్యమ(వర్చువల్‌) పద్దతిలో జరిగింది. రాష్ట్ర అధ్యక్షులు కె జంగయ్య అధ్యక్షత వహించగా, ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సమావేశంలో జాతీయ విద్యావిధానంపై సమగ్రంగా చర్చించారు. ఉమ్మడి జాబితాలో ఉన్న విద్యారంగంలో రాష్ట్రాల స్వేచ్ఛను హరిస్తూ ఫెడరల్‌ స్వభావానికి కేంద్ర ప్రభుత్వం విఘాతం కలిగిస్తున్నందున్నదనీ, రాష్ట్ర ప్రభుత్వం ఈ విద్యా విధానాన్ని తిరస్కరించాలని సమావేశం కోరింది. కేంద్రీకరణ, వ్యాపారీకరణ, కాషాయీకరణకు దోహదం చేస్తూ విద్యలో పేదలు, ధనికులకు మధ్య అంతరాలను మరింత పెంచేదిగా ఉన్న జాతీయ విద్యావిధానం చెక్కర పూసిన విషపు గుళికలా ఉందని టీఎస్‌యూటీఎఫ్‌ విమర్శించింది. జాతీయ విద్యావిధానం మంచి చెడులపై ఉపాధ్యాయులకు, పౌర సమాజానికి అవగాహన కలిగించటానికి విస్తతంగా వెబినార్లు, ఆన్‌లైన్‌ సమావేశాలు నిర్వహించాలని సమావేశం నిర్ణయించింది. ఏకాభిప్రాయం ఉన్న ఉపాధ్యాయ, అధ్యాపక, విద్యార్థి సంఘాలతో కలిసి జాతీయ విద్యావిధానానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తామని స్పష్టం చేసింది. ఈనెల 20 నుంచి యాదగిరి, టిశాట్‌ చానళ్ల ద్వారా పాఠాలు బోధించాలనే రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని టీఎస్‌యూటీఎఫ్‌ స్వాగతించింది. మా సర్వే ప్రకారం 85 శాతం కుటుంబాలకు మాత్రమే టీవీలు ఉన్నాయనీ, అవి అందుబాటులో లేని పిల్లల కోసం వెంటనే పాఠశాల, గ్రామపంచాయతీ, అంగన్‌ వాడీ కేంద్రంలో టీవీలు వినియోగించాలనీ, లేనిచోట ఏర్పాటు చేయాలని కోరింది. ఈ నెల 17 నుంచి ఉపాధ్యాయులు పాఠశాలలకు హాజరవుతున్న నేపథ్యంలో పాఠశాలల్లో తగిన శానిటేషన్‌ సౌకర్యాలు పునరుద్ధరించాలనీ విజ్ఞప్తి చేసింది.
కేజీబీవీలు, గురుకులాలు, మోడల్‌ స్కూళ్లు ఎంఆర్‌ సీల్లో పని చేస్తున్న కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులందరిని రెగ్యులరైజ్‌ చేయాలని సమావేశం డిమాండ్‌ చేసింది. స్కూల్‌ కాంప్లెక్స్‌ ప్రధానోపాధ్యాయుల అధికారాలపై స్పష్టత ఇవ్వాలనీ, పరీక్షలో ఎంపికైన సెక్టోరల్‌ అధికారుల నియామక ఉత్తర్వులు ఇవ్వాలనీ, ఉపాధ్యాయుల పదోన్నతుల సంక్షోభాన్ని పరిష్కరించాలనీ, భార్యాభర్తల అంతర్జిల్లా బదిలీలు, మోడల్‌ స్కూల్‌ ఉపాధ్యాయుల బదిలీల షెడ్యూల్‌ను వెంటనే విడుదల చేసి ఆన్‌లైన్‌ లో నిర్వహించాలనీ, టీఆర్టీలో మిగిలి పోయిన హిందీ ఉపాధ్యాయుల ఫలితాలు విడుదల చేయాలని రాష్ట్ర కమిటీ ప్రభుత్వాన్ని కోరింది. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చావ రవి, సహాధ్యక్షులు సిహెచ్‌ దుర్గాభవాని, కె సోమశేఖర్‌, కోశాధికారి ఎన్‌ కిష్టయ్య, వాయిస్‌ ఆఫ్‌ టీచర్‌ మాసపత్రిక ప్రధాన సంపాదకులు పి మాణిక్‌ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శులు సిహెచ్‌ రాములు, బి నరసింహారావు, టి లక్ష్మారెడ్డి, ఎ వెంకట్‌, ఎం రాజశేఖరరెడ్డి, ఆర్‌ శారద, జి నాగమణి, ఎం ఆంజనేయులు, జి అశోక్‌, డి సత్యానంద్‌, ఇ గాలయ్య, ఎస్‌ వై కొండలరావు, ఆవారి శ్రీనివాస్‌, ఎం.ఎ.కె దత్‌ పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Navatelangana
Top