Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కమలా నారాయణన్ ఆంక్షల సంకెళ్లను తెంచుకున్న నృత్యహేల

కమలా నారాయణన్ ఆంక్షల సంకెళ్లను తెంచుకున్న నృత్యహేల

1938. బొంబాయి నగరం. ఒక స్థానిక సంస్థ శ్రీరామ నవమి వేడుకలలో భాగంగా ఓ నాలుగేళ్ల చిన్నారి 'కథక్' నృత్య ప్రదర్శన ఇచ్చింది. ఆ చిన్నారి ప్రదర్శన ప్రేక్షకులను ఆకట్టుకుంది.

ఆమె పేరు 'బేబీ' కమల. ఆ సభలోని ప్రేక్షకులలో ఏ.ఎన్. కళ్యాణ సుందరం అయ్యర్ కూడా ఉన్నారు. న్యాయవాదిగా ఉన్నా, సినీ రంగంలోకి అడుగుపెట్టి సాగర్ మూవీటోన్లో సర్వోత్తమ్ బాదామితో కలిసి తమిళ చిత్రాలను తీస్తున్నాడు. ఆ చిన్నారి ప్రతిభ ఆయనను ఆకట్టుకుంది. అప్పట్లో ఆయన 'వలిబర్ సంఘం' (1938) తమిళ సినిమా తీయగా 'బేబీ' కమల ఒక చిన్న పాత్రలో నటించి నృత్యం చేసింది. తన తర్వాతి చిత్రం 'రామనామ మహిమ' (1939)లో కమల ఒక చిన్న వేషం వేసింది. దురదష్టవశాత్తు ఆ రెండు చిత్రాలూ బాగా ఆడలేదు. ఆ తర్వాత వచ్చిన 'షాదీ' (1941) లో కూడా ఆమె నర్తించింది.

అయితే షూటింగ్ సమయంలో స్టూడియోలో ఆమె నృత్యాలను చూసిన హిందీ సినీ రంగంవారు ఆమెపై ఆసక్తిని కనబరిచారు. దాంతో ఆమె ఆ కాలం నాటి పలు హిందీ చిత్రాలలో నృత్యం చేసింది. వాటిలో మొదటిది 'కిస్మత్' (1943). అశోక్ కుమార్ హీరోగా నటించిన ఈ చిత్రం కలకత్తాలోని ఒకే థియేటర్లో ఏకంగా మూడేళ్లపాటు ప్రదర్శితమై చరిత్ర సృష్టించింది.
ఈ చిత్రంలో కమల నృత్యం చేయడమే కాకుండా ఒక పాత్రలోనూ నటించింది. రెండవ చిత్రం 'రామరాజ్యం' (1943). భారతీయ చలనచిత్ర చరిత్రలో అత్యంత విజయవంతమైన పౌరాణిక చిత్రాలలో ఇదొకటి. హిందీ చిత్రాలలో బాల తార వేషాల కోసం బొంబాయి వచ్చిన తర్వాత తండ్రి ఉద్యోగం పోయింది. దాంతో తల్లిదండ్రి, తాత ఇతర కుటుంబ సభ్యులంతా కమల సంపాదన పైనే ఆధారపడ్డారు. కుటుంబం గడవడానికి కమల సినిమాలలో నటించడం తప్ప మరొక మార్గం లేదు.
తరువాత 1947లో ఎ.వి. మెయ్యప్పన్ హిందీ 'రామరాజ్య' చిత్రాన్ని తమిళంలో 'రామరాజ్యం' పేరుతో డబ్ చేశాడు. దాంతో 'కిస్మత్, రామరాజ్యం' చిత్రాలు బేబీ కమలకు దక్షిణ భారతదేశంలో మంచి గుర్తింపు తెచ్చిపెట్టినవి. ఆమె తమిళ చిత్ర నిర్మాతల దృష్టిని ఆకర్షించింది. దాంతో భరతనాట్యంలో శిక్షణ పొందేందుకు కమల, తల్లితో మద్రాసుకు మకాం మార్చింది. అయితే, భరతనాట్యాన్ని ప్రతి ఇంటికీ పరిచయం చేసే స్థాయికి తీసుకువెళ్ళే ఘనత బేబీ కమలకే దక్కింది. కమల ప్రముఖ గురువు కట్టుమన్నార్ కోయిల్ ముత్తు కుమార పిళ్ళై వద్ద శిక్షణ పొందింది. ఆ తర్వాత వళువూర్ బి.రామయ్య పిళ్ళైకి శిష్యురాలైంది.
కోయంబత్తూరుకు చెందిన 'పక్షిరాజా ఫిల్మ్స్' అధినేత శ్రీరాములు నాయుడు కమలను తమిళ చిత్ర పరిశ్రమకు పరిచయం చేశాడు. ఆ చిత్రం పేరు 'జగతలప్రతాపన్' (1944). ఈ జానపద చిత్రం ఘనవిజయం సాధించింది. ఇందులో నాగలోకం సన్నివేశంలో కమల పాము నృత్యం చేసింది. ఆ చిత్రంలో తన గురువు రామయ్య పిళ్ళై కూర్చిన నృత్యం ఆమెను తమిళ చిత్ర పరిశ్రమలో స్టార్గా నిలబెట్టింది. అప్పటికి ఆమె వయసు కేవలం పదేళ్లే.
ఎ.వి.ఎం. వారు తన రెండు చిత్రాలలో కమలకు అవకాశం కల్పించడంతో ఆమె సినీ కెరీర్ ఒక్కసారిగా పుంజుకుంది. అందులో ఒకటి 'శ్రీ వల్లి' (1945). విశేషమేమిటంటే ఈ చిత్రంలో కమల బాల వల్లి, బాల మురుగన్ అనే రెండు పాత్రలనూ పోషించింది. ఇందులో ఆమె 'యార్ ఉన్నైపోల్ ఆదరిప్పవర్ ఆరుముగత్తర్సే', 'చిందై అరిందువాడి సెల్వకుమారన్' అనే రెండు పాటలకు భరతనాట్య ప్రదర్శనలు ఇచ్చింది.

1945లో కమల అమెరికన్-తమిళ చిత్రనిర్మాత ఎల్లిస్ ఆర్. డుంగన్ దర్శకత్వంలో ఎం.ఎస్. సుబ్బులక్ష్మితో సంగీత ప్రధానమైన క్లాసిక్ చిత్రం 'మీరా'లో కమల శ్రీకృష్ణుడి పాత్రను పోషించింది. ఒక స్వప్న సన్నివేశంలో ఆమె 'బేబీ' రాధతో కలిసి నత్యం చేసింది. ఎం.ఎస్. పాడిన 'కాత్రినేలే వరుం గీతం' సన్నివేశంలోని కొన్ని షాట్లలో కమల కృష్ణునిగా కూడా కనిపించింది. ఆ తర్వాత కమల 'ఎన్ మగన్' (1945), 'ఏకాంబ వననన్', 'కాటగం', 'మహాత్మా ఉదంగర్' (1947) వంటి చిత్రాలలో కూడా నృత్యం చేసింది.
1946 ప్రాంతంలో మద్రాసులో పాత్రికేయుడు పి.ఎ. నీలన్కాంతన్ నాటకం 'నమ్ ఇరువర్' ప్రదర్శనమైంది. మెయ్యప్పన్ ఆ నాటకాన్ని చూసి ప్రభావితుడై దాని సినిమా హక్కులను కొనుగోలు చేశారు. ఈ చిత్రంలో కథానాయకుడి సోదరిగా నటించిన కమల, 'ఆడువోమే పల్లు పాడువోమే… ఆనంద స్వతంత్రం', 'వెట్రి ఎట్టు దిక్కుమెన కొట్టుమురసే' అనే పాటలకు నత్యం చేసింది. ఈ చిత్రంలో కమల ప్రదర్శించిన నృత్యాలు చిత్రానికే కాకుండా, చలనచిత్ర సాంస్కతిక చరిత్రలోనూ ఒక మైలురాయిగా నిలిచిపోయాయి. మహాత్మా గాంధీ గురించి రాసిన 'కరుణా మూర్తి గాంధీ మహాత్మ' 'మహాన్… గాంధీ… మహాన్!' అనే రెండు పాటలకు కూడా కమల నత్యం చేసింది.

'నం ఇరువర్' (1947) చిత్రం ఘనవిజయం సాధించి కమల నత్యం నాటి మద్రాసు ప్రెసిడెన్సీలోని తమిళ ప్రాంతాలలో ఒక సాంస్కతిక విప్లవానికి నాంది పలికింది. దీనివల్ల అనేక నృత్య పాఠశాలలు వెలిశాయి. భరతనాట్యానికి గౌరవప్రదమైన గుర్తింపు లభించింది.
తరువాత కాలంలో కమల తమిళ, హిందీ, కన్నడ, తెలుగు భాషలలోని అనేక చిత్రాలలో నృత్యం చేసింది. కొన్నింటికి ఆమె స్వయంగా నృత్య దర్శకత్వం వహించింది. 'భూకైలాస్' తెలుగు చిత్రంలో ఆమె అభినయించిన 'మున్నిట పవళించు నాగశయన' పాట ఆ రోజుల్లో చాలా పాపులర్. అంతేకాకుండా 'కొంజమ్ సలంగె, లావణ్య, శివగంగ సీమై, వెధల ఉళగం' (1940) వంటి తమిళ చిత్రాలలో హీరోయిన్గా నటించిన కమల 'జ్వాల' వంటి హిందీ చిత్రాలలోనూ కీలక పాత్ర పోషించింది. ఇంకా 'శివ తపోభంగం, పాలై విళక్కు' వంటి మొత్తం నూరు చిత్రాలలో కమల నటించింది.
1948లో మద్రాస్ మ్యూజిక్ అకాడమీలో కమల చేసిన నత్యం ఆమె జీవితంలో ఒక మైలురాయి వంటిది. భరతనాట్య కళాకారిణిగా ఆమెకు ఆ తర్వాత తిరుగులేకుండా పోయింది. దేశదేశాలలో జరిగే డాన్స్ ఫెస్టివల్స్లో ఆమె నృత్యం తప్పనిసరిగా ఉండేది.
1934 జూన్ 16న కావేరి నదీ తీరాన మయూరన్లో రాజం- రామమూర్తి అయ్యర్ దంపతులకు కమల జన్మించింది. పుట్టిన కొన్ని నిమిషాలకే ఆమెకు కాబోయే భర్త ఆమెను చూశాడు. అతడు ఆర్.కె. లక్ష్మణ్. అప్పుడు ఆయన వయసు ఐదేళ్లు. ప్రసూతి గది నుండి బయటకు తీసుకువస్తున్న ఆ చిన్నారిని చూడగానే ఆర్.కె. లక్ష్మణ్ సరదాగా 'ఈమె నాదే!' అన్నాడు. అతను ఆమెకు మేనమామ. 1952లో వారి వివాహమైంది. అప్పటినుండి కమల లక్ష్మణ్గా ఇంటికే పరిమితమైంది. తాము ఒకరినొకరు ఎంచుకున్నామని కమల తెలిపేది.

ఆమె ఆయన కీర్తిని, విజయాన్ని పూర్తిగా ఆస్వాదించింది. భారతదేశపు అత్యంత ప్రసిద్ధ కార్టూనిస్ట్, వ్యంగ్య చిత్రకారుడిగా ఎదిగిన ఆయనతో కలిసి ప్రపంచమంతా పర్యటించింది. సామాజిక కార్యక్రమాల్లో కమల ఎంతో ఆత్మవిశ్వాసంతో వ్యవహరించేది.
కఠినమైన 10 ఏళ్ల దాంపత్యంలో ఆర్.కె.లక్ష్మణ్ భారతదేశంలోని అత్యంత అహంకార పూరితమైన వ్యక్తులను కూడా తమ అసలు స్వరూపాలను ప్రతిబింబించేలా కఠినమైన వ్యంగ్య చిత్రాలుగా మలిచిన ఆ అద్భుతమైన కార్టూనిస్ట్ స్ఫూర్తి చనిపోకుండా ఆమె చూసుకుంది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే కమలకు తనకంటూ ఒక ప్రత్యేకమైన, గొప్ప జీవితం ఉండేది. ఆమె పిల్లల కోసం 'థమా స్టోరీస్' అనే పుస్తకాన్ని రాసింది. అయితే ఎవరూ ఊహించని విధంగా వారి వైవాహిక జీవితం ఘోరంగా విఫలమైంది. తన కళపట్ల భర్తకు, వారి కుటుంబ సభ్యులకు ఎలాంటి గౌరవం లేదని ఆమె గ్రహించడానికి ఎంతో కాలం పట్టలేదు. వారి ఆంక్షలు వల్ల ఆమె నాట్యానికి, సినిమాలకు, రంగస్థలానికి పూర్తిగా దూరమైంది. అయితే ఆమె తాను నృత్యం కోసం పుట్టిందని అనుకునేది. కానీ నృత్యమే చేయకుండా ఉండిపోవాలంటే భరించలేకపోయింది. అత్త వారింట తనకు, తన కళకు జరుగుతున్న అవమానాన్ని భరించలేక తన కళను, అభిరుచిని బతికించుకోవడం కోసం ఆ వివాహ బంధాన్ని రద్దు చేసుకుంది. కానీ అభిమానులు ఆమెను కమలా లక్ష్మణ్ అనడం మానలేదు.
లక్ష్మణ్తో విడివడిన తర్వాత మళ్లీ నృత్య ప్రదర్శనలు ఇస్తూ తన కళాజీవితంలో కొత్త అధ్యాయాన్ని మొదలుపెట్టింది. ఆ తర్వాత 1964లో సైనిక ఉద్యోగి మేజర్ లక్ష్మీనారాయణన్తో ఆమె పెళ్లయింది. ఆ తర్వాత ఆమె కుటుంబ జీవితం ఎలాంటి ఆటంకం లేకుండా కొనసాగింది. ఆమెను ఆమె నత్యాన్ని గౌరవించి ప్రోత్సహించే భర్త లభించాడు.

భారత ప్రభుత్వం కమలను సాంస్కృతిక ప్రతినిధిగా ఎంపిక చేసింది. ఆమె ప్రపంచవ్యాప్త ప్రశంసలు పొందడమే కాకుండా భరతనాట్య రంగంలో ఒక దిగ్గజంగా నిలిచింది. అందులో భాగంగా మహారాణి ఎలిజబెత్ 2 ఎదుట నృత్య ప్రదర్శన ఇవ్వడం ఆమె జీవితంలో ఒక గొప్ప అనుభూతి. ఎలిజబెత్ రాణి 'భారతీయ నత్య కళ గురించి వినడమే కానీ ఇంత గొప్పగా ఉంటుందని అనుకోలేదు. క్షణం సేపు నన్ను నేనే మర్చిపోయాను' అని కమల ప్రదర్శన తర్వాత ఇచ్చిన స్టేట్మెంట్ ఆమె నృత్య కౌశల్యాన్ని నిరూపిస్తుంది. అంతేగాక హాలీవుడ్లో సూపర్ స్టార్గా పేరున్న షిర్లే మాక్లిన్ ఇండియాకి వచ్చినప్పుడు ప్రత్యేకించి కమలతో కొన్నాళ్లు గడిపి, ఆమె వద్ద భారతీయ నాట్య కళ గురించిన విషయాలు అధ్యయనం చేశాడు.
1960-75 మధ్యకాలంలో ఆమె భారతదేశంలోనే గాక ఆసియా, అమెరికా, యూరప్లోని ప్రధాన నగరాలు అన్నింటిలోనూ ప్రదర్శనలిచ్చింది. తమిళనాడు ప్రభుత్వం 'కలైమామణి అవార్డు, కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డు, పద్మభూషణ్, మ్యూజిక్ అకాడమీ ప్లాటినం జూబ్లీ' పురస్కారంతో పాటు ఇంకా పలు అవార్డులు ఎన్నో ఆమెకు లభించాయి. మద్రాసులో భరత నాట్యాలయ సంస్థలు నెలకొల్పి ఎందరో బాల బాలికలకు నత్యం నేర్పింది. అమెరికాలో స్థిరపడిన కమల న్యూ జెర్సీలో భారత నాట్యాలయ డాన్స్ స్కూలును నెలకొల్పి నృత్యంలో ఔత్సాహికులకు శిక్షణ ఇచ్చింది. కాలిఫోర్నియాలో 2025 నవంబర్ 25న కమల కన్నుమూసింది.
నత్యంతోనే స్టార్డమ్ను సొంతం చేసుకున్న ఆమె సినిమాల్లో 'బేబీ' కమలగా, కమలా లక్ష్మణ్గా పదేళ్లపాటు, ఆ తర్వాత కమలా నారాయణన్గా ఆంక్షలు సంకెళ్లను ఛేదించుకుని భరతనాట్యానికి గౌరవాన్ని తెచ్చిపెట్టింది. భారతీయ నృత్య సంప్రదాయానికి ఆమె ఒక చెరగని ప్రతీక.

హెచ్.రమేష్ బాబు,
7780736386

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana