Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కత్తల్వాడి గ్రామస్తులతో ఎంఈఓ సమావేశం

కత్తల్వాడి గ్రామస్తులతో ఎంఈఓ సమావేశం

వతెలంగాణ - జుక్కల్ మండల పరిధిలోని కత్తల్వాడీ గ్రామంలోకి ప్రయివేటు బస్సులు రాకుండా సోమవారం గ్రామస్తులు అడ్డుకున్న విషయం తెలిసిందే. అయితే విషయం తెలుసుకున్న ఎంఈఓ తిరుపతయ్య మంగళవారం గ్రామాన్ని సందర్శించారు.

ఈ క్రమంలో సర్పంచ్ గోపాల్ రావుతో పాటు గ్రామస్తులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..గ్రామంలోని పేద విద్యార్థుల తలిదండ్రులు అప్పులు చేసి, తమ పిల్లలను ప్రయివేటు బడులకు పంపొద్దని సూచించారు. ప్రయివేటుకు ధీటుగా ప్రభుత్వ బడుల్లోనే నాణ్యమైన విద్యాభోదన అందుతుందని, అర్హత గల ఉపాధ్యాయులను ప్రభుత్వం నియమిస్తుందని చెప్పారు. అంతేకాదు విద్యార్థులకు ఉదయం టిఫిన్ తోపాటు మధ్యాహ్న భోజన వసతి కల్పించిందని వివరించారు. దీంతోపాటు పెన్నులు, బూట్లు, ఐడీకార్డులు, యూనిఫామ్స్ ఉచితంగా అందజేస్తోందని, వీటిని పేద విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రయివేటు బడుల్లో ఉన్న టీచర్ల కంటే ప్రభుత్వ బడుల్లో విషయ పరిజ్ఞానం కలిగిన, విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో భోధించే ఉపాధ్యాయులు ఉన్నారని పేర్కొన్నారు. వీటన్నిటితో పాటు ఒక్క రూపాయి కూడా ఫీజు చెల్లించకుండా నాణ్యమైన విద్యను అభ్యసించవచ్చని తెలిపారు.

ఇప్పటికైనా గ్రామపెద్దలు, యువత, విద్యార్థుల తలిదండ్రులు మరోసారి ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోవాలని సూచించారు. అనంతరం గ్రామస్తులు మాట్లాడుతూ.. తమ పిల్లలను ప్రయివేటు బడులకు పంపబోమనీ, ఇకపై నుంచి ప్రభుత్వ బడులకే పంపిస్తామని ముక్తకంఠంతో చెప్పారు. అలాగే గ్రామ యువకులు మాట్లాడుతూ.. ఇకపై మండలంలోని ప్రతి గ్రామంలో ప్రయివేటు బడులకు విద్యార్థులను పంపకుండా అవగాహన కల్పిస్తామని చెప్పారు. ప్రయివేటు బస్సులను గ్రామంలోకి రాకుండా అడ్డుకోవడం శుభపరిణామంగా భావిస్తున్నామని వెల్లడించారు. ప్రయివేటు ఆగడాలకు ఎట్టిపరిస్థితుల్లోనూ అడ్డుకట్ట వేయాల్సిందేనని బల్లగుద్ది చెప్పారు.

కత్తల్వాడి ఎంపీపీ ఎస్ పాఠశాలకు 25 మంది విద్యార్థులు రీ అడ్మిషన్: మండలంలోని కత్తల్వాడి ఎంపీపీ ఎస్ పాఠశాలకు మంగళవారం 25 మంది విద్యార్థులు రీ అడ్మిషన్ తీసుకోవడం జరిగిందని ఎంఈఓ తిరుపతయ్య, గ్రామ సర్పంచ్ గోపాల్ రావు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నిన్న జరిగిన సంఘటన ప్రభుత్వ పాఠశాలలకు గ్రామానికి చెందిన విద్యార్థులు రావడానికి, గ్రామస్తుల కోరిక మేరకు ప్రయివేటు బడుల వాహనాలను అడ్డుకోవడం జరిగిందని గ్రామ సర్పంచ్ అన్నారు. సాయంత్రం ఏర్పాటుచేసిన అవగాహన కార్యక్రమంలో ఎంఈఓ తిరుపతయ్య, గ్రామ సర్పంచ్, గ్రామస్తులతో మాట్లాడిన అనంతరం మంగళవారం ఉదయం 25 మంది విద్యార్థులు చేరడం ప్రభుత్వ పాఠశాలకు పూర్వ వైభవాన్ని తీసుకొచ్చారని పేర్కొన్నారు. ఈ అవగాహన కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ తో పాటు ఎంఈఓ తిరుపతయ్య, ఎడ్యూకేటర్ ఉపాధ్యాయుడు రాందాస్, ఉపసర్పంచ్ గ్రామ పెద్దలు , విద్యార్థుల తల్లిదండ్రులు, తదితరులు పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana