Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఖాళీ అవుతున్న అమెరికా ఆయుధాగారం

ఖాళీ అవుతున్న అమెరికా ఆయుధాగారం

రిగిపోతున్న రక్షణ వ్యవస్థలు గల్ఫ్ మిత్రుల్లో పెరుగుతున్న ఆందోళనదూకుడు వద్దంటూ నిపుణుల హెచ్చరిక

వాషింగ్టన్ : ఏ దేశానికైనా యుద్ధ సమయంలో ఆయుధ నిల్వలు ఎంత కీలకమో క్షిపణి రక్షణ వ్యవస్థలు కూడా అంతే కీలకం.

ఎందుకంటే శత్రువులు ప్రయోగించే క్షిపణులు, డ్రోన్లను మధ్యలోనే అడ్డుకొని నేలకూల్చేవి ఈ వ్యవస్థలే. అయితే అమెరికాలో ఇప్పుడు ఈ రెండూ అడుగంటి పోతున్నాయి. ఇరాన్ ప్రయోగించిన క్షిపణులను అడ్డుకునే క్రమంలో అమెరికా సేనలు తమ వద్ద ఉన్న రక్షణ వ్యవస్థలలో సుమారు 80 శాతం వరకూ ఖర్చు చేశాయి. అదే సమయంలో పెంటగాన్ వద్ద ఉన్న ఆయుధ నిల్వలు కూడా ప్రమాదకర స్థాయిలో క్షీణించిపోతున్నాయి.

ఆందోళనకరంగా థాడ్, పేట్రియాట్ నిల్వలు
యుద్ధానికి ముందు అమెరికా సైన్యం వద్ద ఉన్న థాడ్ వ్యవస్థల నిల్వలలో ప్రస్తుతం ఐదింట నాలుగు వంతులు ఖాళీ అయ్యాయి. పేట్రియాట్ వ్యవస్థల నిల్వలలో కూడా సగం ఖర్చయ్యాయి. థాడ్ నిల్వలు అడుగంటుతున్న విషయాన్ని అమెరికా ఇప్పటి వరకూ బయటపెట్టలేదు. సెంటర్ ఫర్ స్ట్రాటజిక్ అండ్ ఇంటర్నేషనల్ స్టడీస్ అంచనా ప్రకారం ఇరాన్పై యుద్ధానికి దిగకముందు అమెరికా వద్ద సుమారు 2,200 పేట్రియాట్ వ్యవస్థలు, 452 థాడ్ వ్యవస్థలు ఉండేవి. ఇప్పడు ఆ నిల్వలు క్షీణించిపోవడంతో గల్ఫ్లోని అమెరికా మిత్రదేశాలలో ఆందోళన మొదలైంది. గగనతల రక్షణ వ్యవస్థలు తగినంత సంఖ్యలో లేకుంటే ఇరాన్ ప్రతీకార దాడులను తిప్పికొట్టడం చాలా కష్టమవుతుందని అవి భయపడుతున్నాయి. ఎందుకంటే గల్ఫ్ దేశాలలో చాలా వరకూ ఈ అమెరికా వ్యవస్థల పైనే ఆధారపడి ఉన్నాయి.

ట్రంప్ దూకుడుకు బ్రేక్
ఇరాన్పై భారీ స్థాయిలో పోరు జరపాలన్న ట్రంప్ నిర్ణయానికి ఆయన సలహాదారులు బ్రేక్ వేస్తున్నారు. కీలక ఆయుధ వ్యవస్థల కొరతే దీనికి ప్రధాన కారణం. యుద్ధ సమయంలో అమెరికా సేనలు తమ వద్ద ఉన్న అత్యంత కచ్చితత్వంతో కూడిన ఆయుధాలను…ముఖ్యంగా ఉపరితలం నుంచి గగనతలంలోకి ప్రయోగించే వాటిని దాదాపుగా పూర్తిగా వాడేసింది. దూర ప్రాంతాలలోని లక్ష్యాలను తాకే క్షిపణులు ప్రస్తుతం అమెరికా వద్ద చాలా తక్కువ సంఖ్యలో ఉన్నాయని రాయిటర్స్ వార్తా సంస్థ ఓ నివేదికలో తెలిపింది. పెంటగాన్ నివేదికలు, గల్ఫ్ మిత్రుల సూచనలు పరిశీలించిన తర్వాతే ఇరాన్పై దాడులను నిలిపివేయాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయించారని స్పష్టమవుతోంది. అయితే అమెరికా నేతలు, అధికారులు మాత్రం పైకి మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ ప్రకటనలు గుప్పిస్తున్నారు. తమ వద్ద అవసరానికి మించి ఆయుధాలు, మందుగుండు సామగ్రి ఉన్నాయని బీరాలు పలుకుతున్నారు.

తొలి దశలోనే భారీగా వినియోగం
రక్షణ వ్యవస్థల కొరత నేపథ్యంలో శత్రువు ప్రయోగించే క్షిపణులు, డ్రోన్లు భారీ సంఖ్యలో లక్ష్యాలను ఛేదించడం ప్రారంభిస్తే సంప్రదాయ దాడులు వికటించే ప్రమాదం ఉన్నదని పలువురు నిపుణులు హెచ్చరించారు. యుద్ధంలో దాదాపుగా సగం ఆయుధాలను వినియోగించడంతో తోమహాక్ క్షిపణుల నిల్వలు కూడా తరిగిపోయాయి. యుద్ధం ప్రారంభ సమయంలోనే అమెరికా తన వద్ద తోమహాక్ నిల్వలలో 30 శాతం వరకూ వినియోగించింది. ముఖ్యంగా ఆ సమయంలో కచ్చితమైన దూర శ్రేణి దాడుల కోసం, ఇరాన్ ప్రయోగించిన క్షిపణులు`డ్రోన్ల నుంచి రక్షణ కోసం అమెరికా సేనలు వేలాది క్షిపణులను, వ్యవస్థలను ఉపయోగించాయి. యుద్ధానికి ముందున్న స్థాయికి థాడ్ నిల్వలను చేర్చాలంటే మూడు నాలుగు సంవత్సరాల సమయం పడుతుందని నిపుణుల అంచనా. థాడ్ రాకెట్ మోటార్, పేట్రియాట్ ఉత్పత్తి కోసం అమెరికా ఈ వారంలోనే రెండు ఒప్పందాలు కుదుర్చుకున్నప్పటికీ అవి కార్యరూపం దాల్చడానికి ఎంత సమయం పడుతుందో చెప్పడం కష్టం.

ప్రజల సొమ్ముతో సైనిక మోహరింపా ?ట్రంప్ ప్రభుత్వంపై డెమొక్రాట్ల ఆగ్రహం
2029 జనవరి వరకూ వాషింగ్టన్ డీసీలో నేషనల్ గార్డుల మోహరింపునకు సుమారు 1.4 బిలియన్ డాలర్లు ఖర్చవుతాయని రక్షణ శాఖ అంచనా వేసింది. ఈ మేరకు కాంగ్రెస్కు ఓ నివేదిక అందజేసింది. 2027 - 29 ఆర్థిక సంవత్సరాలలో రాజధానిలో సగటున రెండున్నర వేల మంది గార్డులు ఉంటారన్న అంచనా ఆధారంగా ఈ నివేదికను రూపొందించారు. మాసాచూసెట్స్కు చెందిన డెమొక్రటిక్ సెనెటర్ ఎలిజబెత్ వారెన్ అడిగిన ప్రశ్నలకు సమాధానంగా ఈ అంచనాను విడుదల చేశారు. కాగా నేషనల్ గార్డుల మోహరింపుపై స్థానిక అధికారుల నుంచి విమర్శలు వస్తున్నాయి. నగర స్వతంత్ర ప్రతిపత్తిని ఈ చర్య దెబ్బతీస్తుందని, ప్రజల సొమ్ముతో రాజధాని వీధులను సైన్యంతో నింపుతుందని వారు ఆరోపించారు. 'అమెరికా కుటుంబాలు ఆకాశాన్ని తాకుతున్న ధరలతో ఇబ్బంది పడుతుంటే దేశాధ్యక్షుడు ట్రంప్ మాత్రం వాషింగ్టన్ వీధులలో 1.4 బిలియన్ డాలర్లు ఖర్చు పెట్టి దళాలను మోహరించాలని చూస్తున్నారు' అని వారెన్ మండిపడ్డారు. నేషనల్ గార్డులు కీలుబొమ్మలు కారని, పన్ను చెల్లింపుదారుల సొమ్ము ట్రంప్ రాజకీయ పోరాటాలకు గల్లా పెట్టె కాకూడదని చెప్పారు. నేషనల్ గార్డులు అమెరికాలో రిజర్వ్ పోలీసు దళాలు. అవసరమైనప్పుడు వారిని రంగంలోకి దింపుతారు. జాతీయ విపత్తుల వంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు, ప్రజలలో అశాంతి చెలరేగినప్పుడు గార్డులను వినియోగిస్తారు. విదేశాలలో సైనిక చర్యలకు కూడా వారిని వాడుకుంటారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana